SS Rajamouli Says About AP CM YS Jagan Reaction On Movie Ticket Prices Ahead RRR Release - Sakshi
Sakshi News home page

అందుకే సీఎం జగన్‌ని కలిశా : రాజమౌళి

Published Wed, Mar 16 2022 8:23 AM | Last Updated on Wed, Mar 16 2022 9:09 AM

SS Rajamouli Says CM Jagan Responded Positively - Sakshi

 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తనను బాగా రిసీవ్‌చేసుకున్నారని, ఆయన మాట్లాడిన తీరు, ఇచ్చిన హామీ ప​ట్ల చాలా సంతృప్తిగా ఉన్నానని అన్నారు ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి. సోమవారం(మార్చి 13) ఆయన సీఎం జగన్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే.తాజాగా ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ టీమ్‌ నిర్వహించిన ప్రెస్‌ మీట్‌లో సీఎంతో భేటీపై రాజమౌళి స్పందించారు. ‘సీఎం జగన్‌గారు చెప్పినదంతా చాలా క్లియర్‌గా ఉంది. ఒకపక్క జీవో, మరోవైపు కరోనా, ఇంకోవైపు రెండు వైపుల నుంచి కమ్యూనికేషన్‌ లోపించడం ఇలాంటి కారణాలతో గత ఏడాది కాస్త టెన్షన్‌ వాతావరణం ఉండిపోయింది. కానీ చాలా తక్కువ సమయంలోనే జగన్‌గారు ఇండస్ట్రీపై ఓ అవగాహనకు వచ్చారు. అలాగే టికెట్‌ ధరల గురించి వచ్చిన కొత్త జీవోకు సంబంధించిన పూర్తి స్థాయి గైడ్‌లైన్స్‌ రాలేదు కాబట్టి కాస్త కన్‌ఫ్యూజన్‌ ఉండింది. 

కానీ సీఎంగారు మమ్మల్ని రిసీవ్‌ చేసుకుని మాట్లాడిన తీరు, హామీ ఇచ్చిన విధానాన్ని బట్టి మేం సంతృప్తిగానే ఉన్నాం. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ గురించి మాట్లాడటానికి మార్చి 13 (సోమవారం)న కలిశాం. సీఎంగారు చాలా క్లియర్‌గా ఉన్నారు. ప్రభుత్వం ఒక జీవోను పాస్‌ చేసింది. ఆ జీవో ప్రకారం ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది. ‘పెద్ద బడ్జెట్‌తో సినిమా తీశారు. మీకు నష్టం రావడం మా అభిమతం కాదు. కానీ ప్రేక్షకులపై కూడా భారం పడకూడదు. ఇరుపక్షాల వారు సంతృప్తి చెందేలా పరిస్థితులు ఉంటాయి’  అని జగన్‌గారు హామీ ఇచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఐదు షోలకు అనుమతి ఇచ్చింది. ఈ ప్రకారం ఒక్కరోజు కాదు.. అన్ని రోజులు బెనిఫిట్‌ షో ఇచ్చినట్లే. మేం సీఎంగారిని ఏం అడిగాం అనే విషయంపై నేను ఇప్పుడు మాట్లాడి, అది మరో రకంగా ప్రజల్లోకి వెళ్లడం సరికాదు. అందుకే మాట్లాడటం లేదు. ఓ అప్లికేషన్‌ అయితే పెట్టాం. అన్నీ సవ్యంగానే జరుగుతాయనే నమ్మకం ఉంది’అని రాజమౌళి చెప్పుకొచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement