బాలీవుడ్ హీరోయిన్, మాజీ మిస్ వరల్డ్ ప్రియాంక చోప్రా, హీరో మహేశ్‌బాబుకి జోడీగా నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి ఓ సినిమా తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బి 29’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం రూపొంనుంది. ఈ సినిమా కోసం పొడవాటి జుట్టు, గుబురు గడ్డం, మీసాలతో సరికొత్త లుక్‌లోకి మారిపోయారు మహేశ్‌బాబు.
దుర్గా ఆర్ట్స్‌పై కేఎల్ నారాయణ నిర్మించనున్న ఈ సినిమా 2025లో ప్రారంభం కానుంది. దాదాపు 1000 కోట్ల బడ్జెట్‌తో రెండు భాగాలుగా రూపొందనున్న ఈ సినిమాలో పలువురు విదేశీ నటులు కనిపించనున్నారు. భారతీయ భాషలతో పాటు, విదేశీ భాషల్లోనూ ఈ మూవీని అనువదించనున్నారు.
అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ అడ్వెంచర్ సినిమాకి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. ఈ సినిమాలో మహేశ్‌బాబు సిక్స్‌ప్యాక్‌లో కనిపిస్తారని టాక్. ఇదిలా ఉంటే... ఈ చిత్రంలో మహేశ్‌బాబుకి జోడీగా నటించే హీరోయిన్ల జాబితాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ వంటి వారి పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా ప్రియాంకా చోప్రా కథానాయికగా నటించనున్నారనే వార్తలు వస్తున్నాయి.
ప్రముఖ సింగర్, యాక్టర్ నిక్ జోనాస్‌తో వివాహం తర్వాత అమెరికాలో స్థిరపడ్డ ప్రియాంక కేవలం హాలీవుడ్ చిత్రాలపైనే దృష్టి పెట్టారు. అయితే ‘సిటాడెల్ సీజన్– 1’లో నటించిన ఆమె సీజన్ 2లో కూడా నటిస్తున్నారు. ఇక అబ్దుల్ మాజిద్ దర్శకత్వంలో విజయ్ హీరోగా నటించిన తమిళ సినిమా ‘తమిళన్’ (2002) మూవీతో హీరోయిన్‌గా పరిచయమైన ప్రియాంక చోప్రా తర్వాత దక్షిణాది సినిమాల్లో నటించకుండా కేవలం బాలీవుడ్‌కే పరిమితమయ్యారు. అయితే రామ్‌చరణ్‌కి జోడీగా ‘జంజీర్’ (2013) చిత్రంలో నటించినప్పటికీ అది స్ట్రైట్ బాలీవుడ్ మూవీ. ఒకవేళ ఆమె మహేశ్‌బాబు–రాజమౌళి కాంబో చిత్రంలో నటిస్తారన్న వార్త నిజమైతే అప్పుడు చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత దక్షిణాదిలో ప్రియాంకా చోప్రా నటించినట్లు అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment