
కోలీవుడ్ నటుడు శశికుమార్ దర్శకత్వంలో నటించేందుకు లేడీ సూపర్ స్టార్ నయనతార పచ్చజెండా ఊపారా? ఈ ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వినిపిస్తోంది. సుబ్రమణ్యపురం చిత్రం ద్వారా కథానాయకుడు, దర్శకుడిగా పరిచయమైన శశికుమార్ ఆ తరువాత నాడోడిగళ్ చిత్రంలో నటించారు. ఈ రెండు చిత్రాలు ఘన విజయం సాధించడంతో శశికుమార్ హీరోగా స్థిరపడిపోయారు. పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ఈయన ఈ మధ్య కథానాయకుడిగా నటించిన అయోథి చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలను అందుకుంది.
ఇక నటి నయనతార విషయానికి వస్తే లేడీ సూపర్‌స్టార్‌గా ఆమె రాణిస్తున్నారు. ఇటీవల జవాన్ చిత్రంతో బాలీవుడ్‌లోనూ విజయాన్ని అందుకున్నారు. గతేడాది ఆమె ఎన్నో అంచనాలు పెట్టుకున్న తన 75వ చిత్రం అన్నపూరణి తీవ్ర నిరాశ పరిచింది. అంతే కాకుండా వివాదాల్లో చిక్కుకుని కేసుల వరకూ వెళ్లి ఓటీటీలో నుంచి తొలగించారు. ఇదిలా ఉండగా.. నయన్‌కు అవకాశాలు ఏ మాత్రం తగ్గడం లేదు. అయితే విజయాలే ముఖం చాటేస్తున్నాయి. ప్రస్తుతం టెస్ట్ అనే క్రికెట్ నేపథ్యంలో సాగే చిత్రంతో పాటు మన్నాంగట్టి అనే హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
కాగా తాజాగా నటుడు శశికుమార్ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్త సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరలవుతోంది. ఇదీ హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. ఇందులో నయనతార పాత్ర చాలా బలంగా ఉంటుందని తెలిసింది. ఈ చిత్రానికి శశికుమార్ దర్శకత్వం మాత్రమే చేయనున్నట్లు.. నటన జోలికి వెళ్లడం లేదని సమాచారం. కాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment