సినిమాకు సంతకం చేసినవారిని పక్కనపెట్టేసి వేరే హీరోహీరోయిన్లతో సినిమాలు తీసిన సంఘటనలు కోకొల్లు. తనకూ అలాంటి చేదు అనుభవం ఎదురైందంటున్నాడు తెలుగు హీరో సందీప్ కిషన్ (Sundeep Kishan). హిందీలో అలాంటి ఘోర అనుభవాలు ఎదుర్కొన్నానన్నాడు. ఇతడు షోర్ ద సిటీ (2010) మూవీతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా తర్వాత మరే హిందీ చిత్రంలోనూ కనిపించలేదు. 2019లో వచ్చిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌తో మరోసారి బాలీవుడ్ ప్రేక్షకులను ఓటీటీ మాధ్యమం ద్వారా పలకరించాడు.
మొదట్లో ఎగ్జయిటయ్యా!
హిందీలో సినిమాలు చేయకపోవడానికి గల కారణాలను తాజా ఇంటర్వ్యూలో సందీప్ కిషన్ బయటపెట్టాడు. అతడు మాట్లాడుతూ.. షోర్ ఇన్ ద సిటీ సినిమా కంటే ముందే నేను రెండు హిందీ చిత్రాలకు సంతకం చేశాను. ఆ రెండూ కూడా ప్రముఖ నిర్మాణ సంస్థల బ్యానర్‌లో కావడంతో చాలా ఎగ్జయిట్ అయ్యాను. నేను అనుకుందొకటైతే జరిగింది మరొకటి! రెండేళ్లపాటు ముంబైలో ఖాళీగా కూర్చున్నాను. ఆ సమయంలో ఒక తమిళ్, రెండు తెలుగు చిత్రాలు నా చేతిలో ఉన్నప్పటికీ ఆసక్తి చూపించలేదు.
సౌత్‌లో ఆఫర్స్ వదిలేసుకున్నా..
ఆల్‌రెడీ హిందీలో రెండింటికి సంతకం చేసినందున వేరే ఆఫర్లను వదిలేసుకున్నాను. పోనీ ఇంత చేసినా నాకేమైనా ఉపయోగం ఉందా? అంటే అదీ లేదు! నన్ను అంతకాలం వెయిట్ చేయించి చివరి నిమిషంలో ఆ సినిమాల్ని వేరేవారితో మొదలుపెట్టారు. మోసపోయాననిపించింది. అందుకే దక్షిణాది ఇండస్ట్రీలోనే నిజాయితీగా ఉండాలనుకున్నాను. ఇక్కడే కొనసాగుతున్నాను.
(చదవండి: ఒకప్పుడు క్షమించేవాళ్లు.. ఇప్పుడలా కాదు!: బాలీవుడ్ హీరో)
కేవలం భాష కోసం..
బాలీవుడ్ (Bollywood)లో సినిమాలు చేయకూడదు అని నిర్ణయించుకోలేదు. కాకపోతే కేవలం హిందీ భాష కోసం అక్కడ సినిమాలు చేయాలనుకోవడం కరెక్ట్ కాదనిపించింది. నా భాషలోనే సినిమాలు చేస్తాను. అది అందరికీ నచ్చుతుందనుకుంటే హిందీలోనూ రిలీజ్ చేస్తాను. ఇప్పుడందరూ చేస్తుందదేగా! అని చెప్పుకొచ్చాడు.
కెరీర్ మొదలు
సందీప్ కిషన్ చెన్నైలోని తెలుగు కుటుంబంలో జన్మించాడు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్లు చోటా కె నాయుడు, శ్యామ్ కె నాయుడుకు దగ్గరి బంధువు. సినిమానే వృత్తిగా ఎంచుకోవాలని 2008లో హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యాడు. ఇందుకోసం మొదటగా డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ వద్ద ఏడాదిపాటు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు. ఆ సమయంలోనే స్నేహగీతం సినిమా ఛాన్స్ అందుకున్నాడు.
తెలుగులో హీరోగా..
అడల్ట్ కామెడీ సినిమా ఆఫర్లు వస్తే తిరస్కరించాడు. అలాంటి చిత్రాల్లో నటించబోయేది లేదని తేల్చి చెప్పాడు. ప్రస్థానం సినిమాతో వెండితెరపై తన ప్రయాణం మొదలుపెట్టాడు. స్నేహ గీతం చిత్రంతో హీరోగా మారాడు. రొటీన్ లవ్ స్టోరీ, గుండెల్లో గోదారి, డి ఫర్ దోపిడి, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, బీరువా, జోరు, రారా కృష్ణయ్య, ఒక్క అమ్మాయి తప్ప, శమంతకమణి, నక్షత్రం, మనసుకు నచ్చింది, ఏ1 ఎక్స్‌ప్రెస్, మైఖేల్ వంటి చిత్రాలతో తెలుగువారికి దగ్గరయ్యాడు.
నిర్మాతగానూ..
గతేడాది ఊరు పేరు భైరవకోనతో అలరించాడు. కెప్టెన్ మిల్లర్, రాయన్ చిత్రాల్లో సహాయక పాత్రలు పోషించాడు. ప్రస్తుతం కూలీ మూవీలో నటిస్తున్నాడు. ఇది కాకుండా అతడి చేతిలో మరో మూడు సినిమాలున్నాయి. ఇతడు హీరో మాత్రమే కాదు నిర్మాత కూడా! నిను వీడని నీడను నేనే, వివాహ భోజనంబు, ఏ1 ఎక్స్‌ప్రెస్ వంటి చిత్రాలకు నిర్మాతగానూ వ్యవహరించాడు.
చదవండి: ఈ హీరోయిన్‌ను చూస్తుంటే శ్రీదేవిని చూసినట్లే ఉంది: ఆమిర్ ఖాన్
Comments
Please login to add a commentAdd a comment