రజనీకాంత్ పవర్‌ఫుల్ పాత్ర పోషించిన తాజా చిత్రం లాల్ సలామ్. ఈ చిత్రంలో ఆయన అతిథిగా మొహిద్దీన్ అనే పాత్రలో కనిపించారు. ఈ చిత్రానికి ఆయన పెద్ద కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ భారీ ఎత్తున నిర్మించారు. విక్రాంత్ హీరోగా నటించిన ఈ చిత్రంలో నటి నిరోషా, జీవిత, తంబిరామయ్య, సెంథిల్, తంగదురై ముఖ్య పాత్రలు పోషించారు. కాగా సీనియర్ క్రికెట్ కళాకారుడు కపిల్ దేవ్ కూడా ఇందులో అతిథి పాత్ర పోషించడం మరో విశేషం. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించిన లాల్ సలామ్ చిత్ర షూటింగ్ ఈ నెల 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్ రిలీజ్ కార్యక్రమాన్ని చైన్నెలోని ఓ స్టార్ హోటల్లో నిర్వహించారు మేకర్స్.
ఈ సందర్భంగా చిత్ర దర్శకురాలు ఐశ్వర్య రజినీకాంత్ మాట్లాడుతూ.. లాల్ సలామ్ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమ వేదికపై తను మాట్లాడింది తన తండ్రి రజనీకాంత్‌కు తెలియదన్నారు. అయితే చిత్ర ప్రమోషన్ కోసమే తాను మాట్లాడినట్టు ఆ తర్వాత చైన్నె విమానాశ్రయంలో కొందరు మీడియా వారు తన తండ్రి వద్ద ప్రస్తావించారన్నారు. అందుకు చిన్న వివరణ ఇస్తున్నానని తెలిపారు.
తన ద్వారానో.. లేదంటే చిత్రంలోని రాజకీయ అంశాల వల్లనో సూపర్ స్టార్ చిత్రం ఆడాల్సిన అవసరం లేదన్నారు. ఎలాంటి రాజకీయాలు లేని జైలర్ చిత్రం సూపర్ హిట్ అయిన విషయం అందరికీ తెలిసిందే అన్నారు. వ్యక్తిగత భావాలకు గౌరవం ఇచ్చే వ్యక్తి తన తండ్రి రజనీకాంత్ అని పేర్కొన్నారు. కాగా రాజకీయాలు అన్నవి ప్రతి రంగంలోనూ ఉంటాయని.. కానీ అలాంటి రాజకీయంతో కూడిన క్రికెట్ క్రీడా నేపథ్యంలో సాగే కథా చిత్రం లాల్ సలామ్ అని చెప్పారు. ఈ అవకాశాన్ని కల్పించిన లైకా ప్రాడక్షన్‌న్స్ అధినేత సుభాస్కరన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఈ కార్యక్రమంలో నటుడు విష్ణు విశాల్, విక్రాంత్, తంబి రామయ్య, సెంథిల్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment