
నటుడు వెట్రి కథానాయకుడిగా నటించిన జీవీ చిత్రం 2019లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. దీనికి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం జీవీ–2. వెట్రి హీరోగా, అశ్విని చంద్రశేఖర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో రోహిణి, మైమ్ గోపి, కరుణాకరన్, రమల, సీనియర్ నటుడు వైజీ మహేంద్రన్, నాజర్ సోదరుడు అహ్మద్ ముఖ్యపాత్రలు పోషించారు. తొలి భాగానికి దర్శకత్వం వహించిన వీజే గోపీనాథ్‌నే రెండో భాగాన్నీ తెరకెక్కించారు. వీ హౌస్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ కామాక్షి ఈ చిత్రాన్ని నిర్మించారు. దీనికి కేఎస్ సుందరమూర్తి సంగీతాన్ని, ప్రవీణ్‌కుమార్ ఛాయాగ్రహణం అందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈచిత్రం ఈనెల 19వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది.
ఈ సందర్భంగా శనివారం సాయంత్రం చిత్ర యూనిట్ చెన్నైలో ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించింది. ఇందులో నామ్ తమిళర్ పార్టీ నేత సీమాన్, దర్శకుడు కె.భాగ్యరాజ్, నటుడు వైజీ మహేంద్రన శీను రామస్వామి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. చిత్ర దర్శకుడు గోపీనాథ్ మాట్లాడుతూ జీవీ చిత్రానికి స్టోరీ అందించిన బాబు తమిళ్ ఇతర సినిమాలతో బిజీగా ఉండడంతో ఈ చిత్రానికి తానే కథను సిద్ధం చేశానని తెలిపారు. చిత్ర షూటింగ్‌ను 22 రోజుల్లో పూర్తి చేసినట్లు తెలిపారు. చిత్ర నిర్మాత సురేష్ కామాక్షి మాట్లాడుతూ చిన్న చిత్రాలకు థియేటర్లో ఓపెనింగ్స్ రావడం కష్టంగా మారిందన్నారు.
ఆ మధ్య విడుదలైన మామనిదన్ చిత్రానికి కూడా ఇదే పరిస్థితి ఎదురైందన్నారు.తరువాత ఆ చిత్రం ఓటీటీలో విడుదలై మంచి విజయాన్ని సాధించిందన్నారు. ఈ చిత్ర హీరో మంచి నటుడన్నారు. సీమాన్ మాట్లాడుతూ ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను తమిళుల కోసం తీసుకురావాలన్న వారి ఆలోచనకే అభినందించాలన్నారు. ఇక్కడ అందరికీ బిరియాని లభించడం లేదని, కొందరు గంజితోనే బతుకుతున్నారన్నారు. సూర్య నటించిన సూరరై పోట్రు చిత్రం థియేటర్లలో విడుదల కాకపోయినా, ఓటీటీలో విడుదలై విశేష ప్రేక్షకాదరణను పొందిందన్నారు. పొలం అనే తెలుగు చిత్రాన్ని తాను ఓటీటీలోనే చూశానని, అది అద్భుతమైన చిత్రమని ప్రశంసించారు. కాబట్టి ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సీమాన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment