
Allu Aravind Launches Aha Ott Tamil: ఇప్పుడంతా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల హవా కొనసాగుతుందని చెప్పొచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇవి చిన్న చిత్రాలకు ఆశాజనకంగా మారుతున్నాయి. ఆ విధంగా తెలుగులో ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్ సూపర్ రేటింగ్‌తో దూసుకుపోతోంది. దీని అధినేత అల్లు అరవింద్ ఆహాను తమిళంలోనూ ప్రారంభించారు. దీని ఆవిష్కరణ కార్యక్రమాన్ని శుక్రవారం చెన్నైలోని ఓ హోటల్‌లో నిర్వహించారు.
ఆడంబరంగా జరిగిన ఈ వేడుకకు నిర్మాత ఆర్.బి.చౌదరి, కలైపులి ఎస్.థాను, దర్శకుడు కె ఎస్ రవికుమార్, శరత్‌కుమార్, రాధిక శరత్‌కుమార్ దంపతులు, నటుడు ఎస్.జె.సూర్య, ఖుష్భు, కె.భాగ్యరాజ్, పా.రంజిత్, నటుడు జయం రవి, సంగీత దర్శకుడు అనిరుధ్, దర్శకుడు శివ పాల్గొన్నారు. అల్లు అరవింద్‌ను నిర్మాత కలైపులి ఎస్.థాను సత్కరించారు. నటుడు జయం రవి, సంగీత దర్శకుడు అనిరుధ్ ఆహా లోగోను ఆవిష్కరించారు.
అల్లు అరవింద్ మాట్లాడుతూ తాను చెన్నైలో పుట్టి పెరిగి విద్యాభ్యాసం చేసిన రోజులను గుర్తు చేసుకున్నారు. 20 ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు వెళ్లి మళ్లీ ఇప్పుడు తిరిగి రావడం.. పుట్టింటికి వచ్చినంత ఆనందం కలుగుతోందని పేర్కొన్నారు. ఈ ఆహా ఓటీటీ ద్వారా తమిళంలో నూరుశాతం ఎంటర్‌టైన్‌మెంట్ అందించడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.