చెన్నై: ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులు, సాంకేతిక వర్గాన్ని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఏటా అవార్డులతో సత్కరించే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. కాగా గత కొన్నేళ్లుగా ఈ వేడుకలు వాయిదా పడుతూ వచ్చాయి. ఈ క్రమంలో 2015 ఏడాదికి గాను ఉత్తమ అవార్డుల ప్రదాన కార్యక్రమాన్ని బుధవారం సాయంత్రం చైన్నెలో ఘనంగా నిర్వహించారు.
2015వ సంవత్సరానికిగానూ..
ఈ వేడుకల్లో తమిళ భాషాభివృద్ధి శాఖ, సమాచార మంత్రి స్వామినాథన్, మంత్రి సుబ్రమణ్యం, మైలాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వేలు, చైన్నె మహానగరం, ఉప మేయర్ మహేష్ ముఖ్య అతిథులుగా పాల్గొని అవార్డు గ్రహీతలకు జ్ఞాపికలతో పాటు బంగారు పతకాలను, నగదు బహుమతులను అందించారు. 2015కు గాను ఉత్తమ చిత్రంగా తనీ ఒరువన్, ద్వితీయ ఉత్తమ చిత్రంగా పసంగ –2, తృతీయ ఉత్తమ చిత్రంగా ప్రభాకు అవార్డులు అందించారు.
ఉత్తమ నటుడిగా హీరో మాధవన్
అలాగే మహిళల ఔన్నత్యాన్ని పెంపొందించేలా రూపొందిన 36 వయదినిలే చిత్రానికి ప్రత్యేక అవార్డును ప్రదానం చేశారు. ఇరుది చుట్రు చిత్రానికి గాను హీరో మాధవన్‌కు ఉత్తమ నటుడి అవార్డు, 36 వయదినిలే చిత్రానికి గాను జ్యోతికకు ఉత్తమ నటి అవార్డు, వై రాజా వై చిత్రానికి గాను నటుడు గౌతమ్ కార్తీక్‌కు ప్రత్యేక జూరీ అవార్డు ప్రదానం చేశారు. అలాగే ఇతర నటీనటులు, సాంకేతిక వర్గాన్ని అవార్డులతో సత్కరించారు.
కమిటీ ఏర్పాటు చేశాం..
ఈ సందర్భంగా సమాచార శాఖ మంత్రి స్వామి నాథన్ మాట్లాడుతూ.. 2015వ సంవత్సరానికిగానూ 39 మంది కళాకారులకు ఈ వేదికపై అవార్డులను అందించామన్నారు. ఇకపోతే 2016 నుంచి 2023 వరకు చలన చిత్ర అవార్డుల ఎంపిక కోసం ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కమిటీ నివేదిక ఇచ్చిన తరువాత ఎంపికైన కళాకారులకు అవార్డులను ప్రదానం చేస్తామన్నారు.
చదవండి: 'ప్రేమలు' మూవీ రివ్యూ
Comments
Please login to add a commentAdd a comment