‘‘నలభై ఏళ్ల సుధీర్ఘ కెరీర్‌లో 800 పైగా సినిమాలు చేశాను. వీటిలో 300 పైగా తండ్రి పాత్రలు ఉన్నాయి. దీంతో తండ్రి పాత్రలు చేయాలంటే విసుగొచ్చింది. ఈ ఏడాది 18 సినిమాల్లో తండ్రి పాత్రలు చేయమని అవకాశాలు రాగా, వదులుకున్నాను. కొత్త తరహా పాత్రలు చేయాలనుకుంటున్న నాకు ‘పెదకాపు–1’లో మంచి పాత్ర దొరికింది. నా కెరీర్‌లో నేను గుర్తుంచుకోదగ్గ పాత్రల్లో ‘పెదకాపు 1’ ఉంటుంది’’ అన్నారు నటుడు– దర్శకుడు తనికెళ్ల భరణి. విరాట్ కర్ణ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ పెదకాపు 1’. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించిన తనికెళ్ల భరణి పంచుకున్న విశేషాలు.
► ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘బ్రహ్మోత్సవం’ చిత్రాల తర్వాత శ్రీకాంత్ అడ్డాలతో నేను చేసిన చిత్రం ‘పెదకాపు 1’. ఈ చిత్రంలో సమాజంపై విసిగిపోయిన ఓ టీచర్ పాత్రలో కనిపిస్తాను. శ్రీకాంత్ అడ్డాల పోషించిన పాత్రను తప్పిస్తే ఈ సినిమాలో లీడ్ రోల్ చేసిన అందరితో నాకు కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. ‘మాతృ దేవో భవ, లేడీస్ టైలర్, శివ, మన్మథుడు, అతడు’.. ఇలా నిడివితో సంబంధం లేకుండా నా కెరీర్‌లో నేను గుర్తుపెట్టుకోదగ్గ పాత్రలు ముప్పై వరకు ఉంటాయి. ఈ జాబితాలో ‘పెదకాపు 1’ చేరుతుంది. చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమాకి కెమెరామేన్ చోటా కె. నాయుడుతో వర్క్ చేయడం థ్రిల్‌గా అనిపించింది. విరాట్ కర్ణ కొత్తవాడైనా బాగా నటించాడు. మిక్కీ జే మేయర్ సంగీతం బాగుంటుంది. మిర్యాల రవీందర్‌రెడ్డిగారు ఈ సినిమాను భారీగా నిర్మించారు.
► ‘మిథునం’ తర్వాత నా దర్శకత్వంలో మరో చిత్రం రాలేదు. నేను కమర్షియల్ సినిమాలు తీయలేను. నా దగ్గర కొన్ని కథలు ఉన్నాయి. ఆర్ట్ ఫిల్మ్ తరహా చిత్రాలను నిర్మించే నిర్మాతలు దొరకడం లేదు. నా నలభై ఏళ్ల కెరీర్‌లో నేను అనుకున్నవన్నీ చేశాను. అయితే ఓ అంతర్జాతీయ సినిమా తీయాలనే ఆకాంక్ష మాత్రం మిగిలిపోయి ఉంది. ప్రస్తుతం శివరాజ్‌కుమార్, ప్రభుదేవా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమాలో కీలక పాత్ర చేస్తున్నాను. శేఖర్ అనే కొత్త దర్శకుడు తీస్తున్న సినిమాలో ఓ వైవిధ్యమైన పాత్ర చేస్తున్నాను.
Comments
Please login to add a commentAdd a comment