
అధికారంలోకి వచ్చేది బీఆర్‌ఎస్సా..కాంగ్రెస్సా..?.. తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసిన ఇదే చర్చ జరుగుతోంది. సామాన్య ప్రజానీకంతో పాటు సీనీ ప్రముఖులు సైతం ఈ ఫలితాల కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఫలితాలతో సినిమా వాళ్లకు సంబంధం ఏంటనే డౌట్ రావడం సహజం. అయితే చిత్ర పరిశ్రమకు రాజకీయాలతో ప్రత్యేక్షంగా సబంధం లేకున్నా.. పరోక్షంగా మాత్రం చాలా ఉంది. షూటింగ్‌ల అనుమతి మొదలు.. టికెట్ల రేట్ల పెంపు వరకు ప్రతీది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అందుకే ఇప్పుడు టాలీవుడ్ నిర్మాతల్లో టెన్షన్ మొదలైంది. ఒకవేళ ప్రభుత్వం మారితే ఇండస్ట్రీపై ఎలాంటి వైఖరితో వ్యవహరిస్తుంది? టికెట్ల రేట్ల విషయంలో సహకరిస్తుందా లేదా అనే భయం నిర్మాతల్లో మొదలైంది.
ఎవరు వస్తే నో టెన్షన్.?
మళ్లీ అధికారంలోకి బీఆర్‌ఎస్ వస్తుందా? వస్తే ఎలాంటి పరిణామాలుంటాయన్నదానిపై టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు బీఆర్‌ఎస్ ప్రభుత్వంతో టాలీవుడ్‌కు సత్సంబంధాలున్నాయి. ఒక వేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఎలాంటి మార్పులు జరుగుతాయి? అన్నది కూడా చర్చగా మారింది. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి సినిమా అవార్డులు లేవు. నంది అవార్డులు కూడా ఆంధ్రప్రదేశ్‌కే పరిమితమయ్యాయి. ఇక షూటింగ్‌ల పరంగా ప్రస్తుతాని అయితే హైదరాబాదే సినిమా క్యాపిటల్. బోలెడన్ని స్టూడియోలతో పాటు 24 క్రాఫ్ట్స్ నిపుణులందరూ హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్నారు. ఎలాంటి కెమెరాలయినా ఇక్కడ రెడీగా ఉన్నాయి. దేశం మొత్తమ్మీద ముంబై తర్వాత హైదరాబాద్‌లోనే సినిమా ఎక్విప్‌మెంట్, మ్యాన్‌పవర్ ఉంది. అందుకే కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వంమీద ఇక్కడ ఆసక్తి ఎక్కువగా నెలకొంది.
‘సలార్’తో మొదలు..
డిసెంబర్ చివరి వారం నుంచి వరుసగా పెద్ద సినిమాలు విడుదల కాబోతుంది. డిసెంబర్ 22న సలార్ రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్‌తో నిర్మించిన చిత్రమిది. టికెట్ల రేట్లను పెంచి కలెక్షన్స్‌ని పెంచుకోవాలని నిర్మాతలు భావిస్తున్నారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే..ఎలాగో అనుమతులు ఇస్తారు. ఒకవేళ కాంగ్రెస్ వస్తే మాత్రం అంత త్వరగా పర్మిషన్స్ ఇవ్వకపోవచ్చు. ఏదైనా రెండు వారాల్లోనే తెలియాలి. ఇక సలార్ తర్వాత సంక్రాంతికి హనుమాన్, గుంటూరుకారం లాంటి పెద్ద సినిమాలు వస్తున్నాయి. వీటికి కూడా టికెట్ల రేట్లు పెంచాల్సి వస్తుంది. సలార్ విషయంలో క్లారిటీ వస్తే.. సంక్రాంతి సినిమాలకు పెంపు ఉంటుందో లేదో తెలిసిపోతుంది.
రేవంత్‌తో భేటీ?
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా వచ్చాయి. దీంతో తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని భావించి..ఇప్పటికే పలువురు నిర్మాతలు రేవంత్ రెడ్డిని కలిసినట్లు సమాచారం. టాలీవుడ్‌కి చెందిన ఓ బడా నిర్మాత తాజాగా రేవంత్‌తో భేటీ అయ్యాడు. ఆయన మర్యాదపూర్వకంగానే రేవంత్‌ని కలిసినట్లు తెలుస్తోంది. అలాగే పలువురు సినీ ప్రముఖులు సైతం రహస్యంగా రేవంత్‌ని కలిసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికీ..ఇండస్ట్రీకి అనుకూలంగానే వ్యవహరిస్తుందని సినీ పెద్దలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.మరి అధికారంలోకి వచ్చేది ఎవరనేది మరికొన్ని గంటల్లో తెలిసిపోతుంది.
తెలంగాణ ఎన్నికల ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment