తనపై పలుమార్లు వేధింపులకు పాల్పడ్డాడని సహాయకురాలి ఫిర్యాదు
మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాల్సిందిగా బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొన్న బాధితురాలు
కేసు నమోదు చేసిన పోలీసులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జనసేన ఆదేశం
మణికొండ: సినిమాల్లో నృత్య దర్శకునిగా పనిచేస్తూ పాపులర్ అయిన జానీ మాస్టర్ తనపై పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడినట్టు అతని సహాయకురాలు (21) పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్, చెన్నై, ముంబై తదితర నగరాల్లో ఔట్‌డోర్ షూటింగ్‌లలో పాల్గొన్నప్పుడు ఆయన తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే నార్సింగిలోని తన నివాసానికి వచ్చి పలుమార్లు వేధింపులకు గురి చేశాడని వివిధ ఆధారాలతో ఆమె ఆదివారం రాత్రి రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన మతం మార్చుకుని అతడిని వివాహం చేసుకోవాలంటూ బెదిరింపులకు పాల్పడ్డాడని ఆ యువతి ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, బాధితురాలు ఉండేది నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో కావటంతో రాయదుర్గం పోలీసులు ఎఫ్‌ఐఆర్ నంబర్ 1371/2024 ప్రకారం సెక్షన్ 376 (రేప్), 506 (క్రిమినల్ బెదిరింపులు), 323(2) గాయపర్చడం వంటి సెక్షన్ల కింద జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి నార్సింగి పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు.
ఇదిలా ఉండగా జానీ మాస్టర్‌కు గతంలోను నేరచరిత్ర ఉందని, 2015లో ఓ కాలేజీలో మహిళపై దాడి కేసులో 2019లో మేడ్చల్ కోర్టు అతనికి ఆరునెలల జైలుశిక్ష విధించిందని పోలీసులు తెలిపారు. ఇటీవల ఆయన రాజకీయాల్లోచేరి ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీ తరఫున గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేశారు. కేసు తమ స్టేషన్‌కు వచ్చిందని, విచారణ చేస్తున్నామని నార్సింగి సీఐ హరికృష్ణారెడ్డి తెలిపారు. మరో పక్క సఖీ బృందం బాధితురాలి వద్ద రహస్య ప్రదేశంలో వివరాలు సేకరించింది.
బాధితుల గోప్యతను కాపాడాలి
‘ఓ ఇష్యూ కోర్టులో ఉన్నప్పుడు ఆ సమస్య పరిష్కారమయ్యే వరకు సంబంధిత వ్యక్తుల తాలూకు ముసుగు లేని ఫొటోలను, వీడియోలను ఉపయోగించవద్దని, ఒకవేళ ఇప్పటికే ఉపయోగించినట్లయితే వెంటనే తీసివేయాలని కోరుతున్నాం’ అని తెలుగు చలనచిత్ర వాణిజ్యమండలి ఓ నోట్‌ని విడుదల చేసింది. బాధిత పార్టీల గోప్యతను కాపాడాలని అన్ని ప్రింట్, డిజిటల్, ఎలక్ట్రానిక్ మీడియాలను అభ్యర్థిస్తున్నాం.. అంటూ తెలుగు చలనచిత్ర వాణిజ్యమండలి తరఫున గౌరవ కార్యదర్శి కె.ఎల్.దామోదర్‌ప్రసాద్ ఆ నోట్‌లో పేర్కొన్నారు.
జానీ మాస్టర్ ‘వ్యవహారం’లో స్పందించిన జనసేన
పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశం
సాక్షి, అమరావతి: మొన్నటి ఎన్నికల్లో జనసేన పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై హైదరాబాద్‌లో లైంగిక వేధింపుల కేసు నమోదు కావడంపై ఆ పార్టీ స్పందించింది. ఈ మేరకు జనసేన కార్యాలయం పార్టీ ప్రతినిధి వేములపాటి అజయ్‌కుమార్ పేరుతో సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని షేక్ జానీ (జానీ మాస్టర్)ని ఆదేశించడమైనది. ఆయనపై కేసు నమోదైన క్రమంలో పార్టీ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తక్షణమే ఈ నిర్ణయం అమలులోకి వస్తుంది..’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment