సంక్రాంతి బరిలో సినిమాల రిలీజ్‌పై మొన్నటివరకు పెద్ద చర్చే జరిగింది. ఓవైపు పెద్ద హీరో సినిమా గుంటూరు కారం, మరోవైపు చిన్న హీరో చిత్రం హను-మాన్ జనవరి 12వ తేదీకే గురి పెట్టాయి. హనుమాన్ రెండు రోజులు ఆలస్యంగా రిలీజ్ చేయొచ్చుగా అని సలహా ఇచ్చాడు దిల్ రాజు. కానీ హను-మాన్ నిర్మాతలు మాత్రం.. ఒక్క రోజు కూడా ముందుకూ వెనక్కూ జరిగేది లేదని తేల్చి చెప్పేసింది. చివరకు అన్నట్లుగానే గుంటూరు కారం చిత్రానికి పోటీగా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే తమకు సరిపడా థియేటర్లు ఇవ్వలేదని మొదటి నుంచీ మొత్తుకున్నారు హనుమాన్ మేకర్స్. ఆ గొడవ అలా సాగుతుండగానే రిలీజ్ కూడా అయిపోయింది.
అగ్రిమెంట్ బేఖాతరు
తాజాగా మరో కొత్త తలనొప్పి వచ్చిపడింది. ఇప్పటికే పెద్దగా థియేటర్లు లేవంటే హను-మాన్ కోసం అగ్రిమెంట్లు కుదుర్చుకున్న థియేటర్లు సైతం సదరు చిత్రాన్ని ప్రదర్శించడం లేదట! ఈ విషయంపై మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూర్లు, నిర్మాత నిరంజన్ రెడ్డి.. తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలికి ఫిర్యాదు చేశారు. థియేటర్ల యజమానులు ఇలా నిబంధనలు అతిక్రమించడాన్ని నిర్మాతల మండలి తీవ్రంగా ఖండించింది. 'జనవరి 12 నుంచి హనుమాన్ ప్రదర్శించేందుకు మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ తెలంగాణలో కొన్ని థియేటర్లతో అగ్రిమెంట్ చేసుకుంది. కానీ వాళ్లు ఈ అగ్రిమెంట్‌ను బేఖాతరు చేస్తూ నైజాం ఏరియా థియేటర్లలో సినిమా ప్రదర్శించడం లేదు.
ఇప్పటివరకు జరిగిన నష్టాన్ని భరించాలి
దీనివల్ల డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు అపార నష్టం కలిగింది. కాబట్టి ఈ థియేటర్లు వెంటనే హను-మాన్ సినిమాను ప్రదర్శించడంతో పాటు ఇప్పటివరకు జరిగిన నష్టాన్ని భరించాలి. థియేటర్ల యజమానులు ఇలా ఇష్టారీతిన వ్యవహరించడం తెలుగు సినీ పరిశ్రమ మనుగడకే ప్రమాదం. ఇప్పటికైనా పూర్వ ఒప్పందాన్ని గౌరవిస్తూ సినిమాకు సత్వర న్యాయం చేయండి' అంటూ తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఓ లేఖ విడుదల చేసింది.
Comments
Please login to add a commentAdd a comment