ఆట, పాట, మాట, అభినయం.. ఈ బహుముఖ ప్రజ్ఞను ఆశించడం అత్యాశే. కానీ టీనా దేశాయ్ విషయంలో కాదు. అందం ఆమె అడిషనల్ మెరిట్. ఇంతకీ ఎవరీమే? ఇక్కడ మాట్లాడుతున్నామంటే కచ్చితంగా వెబ్ సిరీస్ నటే అయ్యుంటుంది కదా!
► తండ్రి గుజరాతీ. తల్లి.. తెలుగు. ఆమె కుటుంబం కర్ణాటకలో స్థిరపడింది. దాంతో టీనా బెంగుళూరులోనే పుట్టింది, పెరిగింది. అక్కడే బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్‌మెంట్ కోర్సు పూర్తి చేసి మోడల్‌గా కెరీర్ ప్రారంభించింది. అనతికాలంలోనే టాప్ మోడల్‌గా పేరు తెచ్చుకుంది. 2012లో ప్రముఖ కింగ్‌ఫిషర్ క్యాలెండర్‌లో చోటూ దక్కించుకుంది.
► తెలుగు, గుజరాతీ, కన్నడ, ఇంగ్లిష్, హిందీ భాషల్లో టీనా అనర్గళంగా మాట్లాడుతుంది. దీనివల్లే ఆమెకు కొన్ని హిందీ, ఇంగ్లిష్ సినిమాల్లో డబ్బింగ్ చెప్పే చాన్స్ వచ్చింది. చెప్పి మెప్పించింది కూడా. కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్‌లో ఆట, పాటలతో అలరించింది.
► ‘యే ఫాస్లే’ సినిమాతో 2011లో చిత్రసీమలోకి ప్రవేశించింది. అది అంతగా ఆడకపోయిన ఆ తర్వాత ‘టేబుల్ నెం.21’ థ్రిల్లర్ మూవీతో మంచి హిట్ కొట్టింది. అప్పటి నుంచి వరుసగా బాలీవుడ్ సినిమాలతోపాటు హాలీవుడ్ మూవీస్ కూడా కాల్షీట్స్ అడిగాయి. వాటిల్లో ‘ది బెస్ట్ ఎగ్జోటిక్ మారిగోల్డ్ హోటల్’ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇందులో స్లమ్ డాగ్ మిలయనీర్ దేవ్ పటేల్ హీరో.
► నెట్‌ఫ్లిక్స్ ‘సెన్స్ 8’ సిరీస్‌తో వెబ్ ఎంట్రీ ఇచ్చింది. ఎనిమిది దేశాలకు చెందిన ఓ ఎనిమిది మంది మధ్య జరిగే కథే ఈ సెన్స్ 8.
► పెంపుడు కుక్కలతో ఆడుకోవడం, ట్రావెలింగ్ అంటే చాలు నేల మీద పాదం ఆగదు టీనాకు. గోవా, లాస్ ఏంజెల్స్ ఆమెకు నచ్చే ప్రదేశాలు.
షారుఖ్ ఖాన్ అంటే చాలా ఇష్టం. నిజానికి నా పదమూడేళ్ల వయసులో ‘కోయల్’ సినిమా చూసే నిర్ణయించుకున్నా నేను కూడా సినిమాల్లో నటించాలని. అందులో షారుఖ్ చేసిన ఫైట్స్, డాన్స్‌కి పెద్ద ఫ్యాన్ అయిపోయా. ఎప్పటికైనా.. షారుఖ్ ఖాన్ పక్కన నటిస్తా.
– టీనా దేశాయ్
Comments
Please login to add a commentAdd a comment