Viral News: Famous Anchor & Actor TNR Last Emotional Video About Coronavirus - Sakshi
Sakshi News home page

టీఎన్‌ఆర్‌ లాస్ట్‌ వీడియో, కన్నీరు పెట్టిస్తోన్న చివరి వ్యాఖ్యలు

Published Mon, May 10 2021 7:18 PM | Last Updated on Tue, May 11 2021 10:54 AM

TNR Last Video Goes Viral Over Coronavirus Gets Emotional - Sakshi

ప్రముఖ జర్నలిస్టు, యాంకర్‌, నటుడు టీఎన్‌ఆర్‌(తుమ్మల నరసింహా రెడ్డి)) సోమవారం కరోనా కాటుకు బలైన సంగతి తెలిసిందే. ఫ్రాంక్లీ విత్‌ టీఎన్‌ఆర్‌ అనే షోతో సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ, టాలెంటెడ్‌ డైరెక్టర్‌ తేజ వంటి ఎంతో మంది సినీ ప్రముఖులను ఇంటర్వ్యూలు చేస్తూ ఎంతో పాపులారిటీ తెచ్చుకున్న ఆయన మరణ వార్త టాలీవుడ్‌లో తీవ్ర విషాదం నింపింది. దీంతో ఆయన మృతిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో కరోనా పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాలంటూ ఆయన విడుదల చేసిన చివరి వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో ఆయన కరోనా ఏం చేయదంటూ అందరికి ధైర్యం చెప్పిన తీరు భావోద్వేగానికి గురిచేస్తోంది. 

కరోనా గురించి టీఎన్‌ఆర్‌ ఏమన్నారంటే.. ‘మన తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన స్టే హోం చాలెంజ్‌ను నేను స్వీకరించి వారం రోజుల పాటు ఇంట్లోనే ఉండబోతున్నాను. ఎక్కడికి వెళ్లడం లేదు. ఇంట్లోనే ఉంటూ మంచి పుస్తకాలు, మంచి సినిమాలు చూస్తున్నాను. చెడులో కూడా మంచి వెతుక్కోవాలని అంటారు కదా పెద్దలు. ఈ కష్టకాలం నాకు మంచి అలవాట్లను నేర్పింది. అవేంటంటే ప్రాణాయామం, యోగా. రోజూ చేస్తున్నాను. నా పిల్లలతో కూడా చేయిస్తున్నాను. దయచేసి ఇలాంటి సమయంలో పిల్లలతో ఎక్కువ సమయాన్ని గడపండి. పిల్లలకు మంచి మంచి విషయాలు చెబుతూ ధైర్యం చెప్పండి. వారి పని వారు చేసుకునేలా తీర్చిదిద్దండి. భవిష్యత్తుపై ఓ నమ్మకం ఏర్పరచండి’ అంటూ చెప్పుకొచ్చారు. 

అలాగే ‘తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఇంట్లోనే ఉంటే ఈ కరోనా ఏం చేయదు. దయచేసి రూమర్స్‌ను నమ్మకండి, నెగిటవ్‌ వీడియోలు ఎక్కువగా చూడకండి. పాజిటివ్‌గా ఉండండి. కరోనా మన దరిదాపుల్లోకి కూడా రాదు. ఇమ్యూనిటీని పెంచుకోండి. రోగనిరోధక శక్తికి నేనిచ్చే బెస్ట్‌ సలహా ప్రాణాయామం. తప్పకుండా చేయండి. ఇక నేను ఫోన్‌ చేసిన వారిలో చాలా మంది భయాందోళనకు గురవుతున్నారు. ఇంటి పెద్దలే ప్యానిక్‌ అవ్వడం ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు’ అని ఆయన పేర్కొన్నారు. ప్రజల క్షేమం దృష్ట్యా కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ ధైర్యం చెప్పి.. చివరికి ఆయనే మహమ్మారితో పోరాడి ఓడిపోవడం అందర్నీ కలచివేస్తోంది. మహమ్మారి ఏం చేయదు, మన దరికి కూడా రాదంటూ ఆయన చేప్పిన ఈ చివరి మాటలు నెటిజన్లను, ఫాలోవర్స్‌ను కన్నీరు పెట్టిస్తున్నాయి. 

చదవండి: 
కరోనా రక్కసికి బలైన టీఎన్‌ఆర్‌

టీఎన్‌ఆర్‌ ఒక్క ఇంటర్య్వూ పారితోషికం ఎంతో తెలుసా!
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement