నగరంలో నివసించే స్టార్లు.. తమ ఇమేజ్‌కు తగ్గట్టుగా షి‘కార్లు’ చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్లకు ధీటుగా రెమ్యునరేషన్స్‌లో పోటీపడుతున్న టాలీవుడ్ స్టార్స్ కార్ల వేటలోనూ ముందున్నారు. దీంతో రూ.కోట్ల విలువ చేసే కార్లకు నిలయంగా మన భాగ్య నగరాన్ని మార్చడంలో టాలీవుడ్ సెలబ్రిటీలదే పైచేయి. ఆ విషయం ప్రస్తుతం మన స్టార్ల దగ్గరున్న ఖరీదైన కార్లను పరిశీలిస్తే అర్థమవుతుంది. దీని గురించిన మరిన్ని విశేషాలు...
⇒బాలీవుడ్ స్టార్లకు ధీటుగా మోడళ్లు..
⇒కాస్ట్‌లీ కార్లకు కేరాఫ్‌గా హైదరాబాద్..
⇒అరడజన్‌కు తగ్గకుండా కలెక్షన్..
⇒లగ్జరీ వాహనాలపై టాలీవుడ్ సెలబ్రిటీస్ క్రేజ్
చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే.. గత తరం సూపర్ స్టార్స్ లాగా టాలీవుడ్ యంగ్ స్టార్స్.. ఒకటీ అర కార్లతో సరిపుచ్చుకోవడం లేదు. టాప్ 5 హీరోలుగా ఉన్న వారంతా కనీసం అరడజను కార్లకు తగ్గకుండా కలెక్షన్‌ను మెయిన్‌టైన్ చేస్తూ, కార్లపై వారికి ఉన్న క్రేజ్‌ను చాటుకుంటున్నారు.
అల్లు అర్జున్‌ని దాటేసిన రామ్‌చరణ్..
ఇప్పటిదాకా టాలీవుడ్‌లో అత్యంత ఖరీదైన స్టార్ కార్ స్టైలిస్ట్ స్టార్ అల్లు అర్జున్ దగ్గర ఉన్న రూ.6.95 కోట్లు ఖరీదు చేసే రోల్స్ రాయిస్ క్యులినన్ కాగా ఆ తర్వాత స్థానం రెబల్ స్టార్ ప్రభాస్ దగ్గర ఉన్న రూ.6 కోట్ల విలువైన లంబొర్గని అవెంటాడర్ ఎస్ రోడ్‌స్టార్ ది కాగా ఇప్పుడు వీరిద్దరినీ తోసిరాజని రామ్ చరణ్ తాజాగా కొన్న రూ.7.5 కోట్ల ఖరీదైన బ్లాక్ రోల్స్ రాయిస్ స్పెక్ట్రా నెం1 కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికే రామ్ చరణ్‌కు రూ.2.8కోట్ల ఖరీదైన మెర్సిడస్ మేబ్యాచ్ జీఎల్‌ఎస్ 600తో పాటు పలు కంపెనీల లగ్జరీ కార్లు ఉన్నాయి.
స్టైలిష్ కలెక్షన్..
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దగ్గర కూడా మంచి కలెక్షన్ ఉంది.. ఆయన దగ్గర రూ.2.5కోట్లు ఖరీదు చేసే రేంజ్ రోవర్ వోగ్, రూ.1.6 కోట్లు ఖరీదైన వాల్వో ఎక్స్‌సీ90టీ8 లతో పాటు మరికొన్ని కార్లూ ఉన్నాయి. యంగ్ టైగర్ జూనియర్ ఎన్‌టీఆర్ దగ్గర రూ.3.10 కోట్లు ఖరీదు చేసే లంబొర్గని యురస్‌ని తో పాటుగా పోర్ష్ 718 కేమ్యాన్, మెర్సిడెస్ బెంజ్ జీఎల్‌ఎస్, రేంజ్ రోవర్, మెర్సిడస్ మేబ్యాచ్, బీఎండబ్ల్యూ 7 సిరీస్.. తదితర కార్లతో అదిరిపోయే కలెక్షన్ ఉంది. రూ.4.37కోట్ల ఖరీదైన రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీని నాగ చైతన్య వినియోగిస్తున్నారు. ఆయన గత నెల్లోనే తన లగ్జరీ కార్ల కలెక్షన్‌కు రూ.3.51 కోట్లు ఖరీదైన పోర్ష్ 911 జీటీ3 ఆర్‌ఎస్ కార్‌ను కూడా జత చేశారు. ఇక ప్రిన్స్ మహేష్‌బాబు రూ.2.6కోట్ల విలువైన రేంజ్‌రోవర్ వోగ్ వాడుతుండగా. ఆయన సమకాలీకుడైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు రూ.4.5 కోట్ల విలువ చేసే రేంజ్ రోవర్ 3.0 ఎస్‌వి ఆటోబయోగ్రఫీ ఉంది. గత తరం టాప్ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి రూ.2 కోట్లపైన విలువ చేసే రోల్స్ రాయిస్ ఫాంటమ్ ఉండగా, కింగ్ నాగార్జున రూ.2.5 కోట్లు విలువ చేసే మెర్సిడస్ బెంజ్ జీ3 ఏఎమ్‌జీ వాడుతున్నారు.
స్టార్స్‌ని మించిన కార్స్..
టాలీవుడ్ సెలబ్రిటీలను తలదన్నుతూ నగరానికి చెందిన వ్యాపారవేత్త నజీర్ ఖాన్ రూ.12 కోట్లు విలువ చేసే మెక్‌ల్యారెన్ 765ఎల్‌టీ స్పైడర్‌ను గత ఏడాది కొనుగోలు చేసి సంచలనం సృష్టించారు. అప్పటి దాకా ఇదే భారతదేశంలో ఖరీదైన కారు కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment