
ఓ వ్యక్తి తనకు సారీ చెప్పేందుకు మూడు వారాల సమయం పట్టిందని టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ తెలిపింది. నేను ఈ సారి మౌనంగా ఉండాలని అనుకోలేదంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నా తరఫున ఎవరూ నిలబడరని నాకు తెలుసు.. ఈ అనుభవం నన్ను లోతుగా గాయపరిచిందని తెలిపింది. నాకు కావల్సింది కేవలం ఒక నిజమైన క్షమాపణ.. బాధ్యతను స్వీకరించడం మాత్రమేనని మంచు లక్ష్మీ పోస్ట్ చేసింది.
ఇలాంటి చిన్న చిన్న ప్రతిఘటనలే ఆడవాళ్ల గొంతుని మూగబోకుండా కాపాడతాయని మంచు లక్ష్మీ తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. నాకంటే ముందు ధైర్యంగా మాట్లాడిన ఆడవాళ్ల వరుసలోనే నేనూ నిలబడి ఉన్నా… వారి ధైర్యమే నాకు రోజు బలాన్నిస్తుందని తెలిపింది. పత్రికా రంగం వృత్తిపై నాకు చాలా గౌరవం ఉందని.. ప్రజలకు నిజం తెలియజేయడంలో ప్రాణం పెట్టే జర్నలిస్టులు ఈ సమాజానికి వెలుగు చూపే దీపాల్లాంటి వారని కొనియాడింది. కానీ ఆ శక్తిని సార్థకమైన సంభాషణల కంటే వ్యక్తిగత దాడుల కోసం వాడినప్పుడే అది ఎంతో బాధని కలిగిస్తుందని రాసుకొచ్చింది. నేను ఇంతటితో ఈ విషయాన్ని ప్రశాంతంగా ముగిస్తున్నాను.. ఇకపైన కూడా ఆత్మగౌరవంతో నడవబోతున్నాను.. నిజాయితీతో తన కథని వినిపించే ప్రతి మహిళకు గౌరవం తెలియజేస్తున్న మంచు ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసింది. ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

కాగా.. ఇటీవల మంచు లక్ష్మీ ఓ ఇంటర్వ్యూకు హాజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆమెను వయస్సు గురించి ప్రశ్నించారు. ఇది కాస్తా పెద్దఎత్తున వివాదానికి దారితీసింది. తాజాగా ఆ వ్యక్తి క్షమాపణలు కోరడంతో మంచు లక్ష్మీ వివరణ ఇచ్చింది. ఇక ఇలాంటివీ రిపీట్ కాకుండా చూసుకుంటానంటూ అతను మంచు లక్ష్మీని క్షమాపణలు కోరాడు.