టాలీవుడ్ డైరెక్టర్ మహి వి.రాఘవ్ ఇటీవలే యాత్ర-2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈనెల 8న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన మహి వి.రాఘవ్ తనపై వస్తున్న విమర్శలపై ఘాటుగా స్పందించారు. రాయలసీమకు సినీ ఇండస్ట్రీ ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. నా ప్రాంతం కోసమే నా వంతుగా ఏదో ఒకటి చేయాలనే ఆశయంతో కేవలం రెండు ఎకరాల భూమిలోనే మిని స్టూడియో నిర్మించాలనుకుంటున్నట్లు మహి తెలిపారు.
సినీ పరిశ్రమలో రాయలసీమ అంటే షూటింగ్స్ చేయటానికి ఎవరూ ఆసక్తి చూపించరని అన్నారు. ఓ వర్గం మీడియా దీని గురించి కనీసం ఆలోచన కూడా చేయడం లేదని విమర్శించారు. వాళ్ల ప్రభుత్వంలో వాళ్లకు నచ్చినవారికి ఎవరెవరికో ఎక్కడెక్కడో భూములు ఇచ్చిందని.. వాటి గురించి ఎవరూ మాట్లాడరని ఆయన మండిపడ్డారు. నా ప్రాంతం కోసం కేవలం రెండు ఎకరాల్లో మినీ స్టూడియో కట్టాలనుకుంటే దీనిపై పనిగట్టుకుని రాద్ధాంతం చేస్తున్నారని మహి వి.రాఘవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నా ప్రాంతానికి ఏదో చేయాలనే ఆశయం లేకపోతే.. నేను హైదరాబాద్‌లోనో.. వైజాగ్‌లోనో స్టూడియో కట్టుకోవటానికి స్థలం కావాలని అడుగేవాణ్ని కదా అని మహి ప్రశ్నించారు. వెనుకబడిన ప్రాంతంగా చూసే మదనపల్లిలోనే ఎందుకు స్టూడియో కట్టాలనుకుంటానని వివరించారు. నేను రాయలసీమ ప్రాంతంలోని మదనపల్లిలోనే పుట్టి పెరిగా.. అక్కడే చదువుకున్నా.. అందుకే నా ప్రాంతం కోసం ఏదో ఒకటి చేయాలన్న ఆశయంతోనే ముందుకెళ్తునన్నారు. రచయిత, నిర్మాత, దర్శకుడిగా సినీ పరిశ్రమలో 16 ఏళ్లుగా ఉంటున్నానని.. మూన్ వాటర్ పిక్చర్స్, 3 ఆటమ్ లీవ్స్ అనే రెండు నిర్మాణ సంస్థలను స్థాపించినట్లు తెలిపారు. నా సినిమాలు పాఠశాల, యాత్ర 2, సిద్ధా లోకమెలా ఉంది, సైతాన్ వెబ్ సిరీస్ రాయలసీమలోనే చిత్రీకరించినట్లు పేర్కొన్నారు.
మహి వి.రాఘవ్ మాట్లాడుతూ..'సినీ ఇండస్ట్రీ రాయలసీమ కోసం ఏం చేసింది? నా ప్రాంత అభివృద్ధి కోసమే మినీ స్టూడియో కట్టాలనుకుంటున్నా. రచయితగా, నిర్మాతగా, దర్శకుడిగా సినీ పరిశ్రమలో 16 ఏళ్లుగా ఉంటున్నా. సొంతంగా రెండు నిర్మాణ సంస్థలను స్థాపించా. సినీ పరిశ్రమలో రాయలసీమ అంటే షూటింగ్స్ చేయటానికి ఎవరూ ఇష్టపడరు. నా ప్రాజెక్ట్స్ రాయలసీమలోనే చిత్రీకరించా. ఈ రెండేళ్లలో సైతాన్, యాత్ర 2, సిద్ధా లోకమెలా ఉంది అనే మూడు ప్రాజెక్ట్స్‌ను మదనపల్లి, కడప ప్రాంతాల్లో రూపొందించాం. వాటి కోసం దాదాపు రూ.20 నుంచి 25 కోట్ల రూపాయల ఖర్చు చేశా' అని తెలిపారు.
నా ప్రాంతం కోసమే నా తపన..
అనంతరం మాట్లాడుతూ.. 'నేను పుట్టి పెరిగిన ప్రాంతానికి నా వంతుగా ఏదో చేయాలనే ఉద్దేశమే తప్ప మరొకటి లేదన్నారు. మదనపల్లిలో సినిమాలు చేయటం వల్ల స్థానిక హోటల్స్, లాడ్జీలు, భోజనాలు, జూనియర్స్‌కు ఉపయోగపడుతుందని భావించా. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రాయలసీమలో మినీ స్టూడియో నిర్మించాలనుకున్నా. బుద్ధి ఉన్నోడెవడైనా దీని గురించి ఆలోచించాలి. నా స్టూడియో నిర్మాణం కోసం యాభై, వంద ఎకరాలు అడగలేదు. కేవలం రెండు ఎకరాల్లో మాత్రమే మినీ స్టూడియో నిర్మించాలనుకున్నా. రాయలసీమకు ఎవరైనా ఏమైనా చేశారా! మీరు చేయరు... చేసేవాడిని చెయ్యనియ్యరు. ఓ వర్గం మీడియా దీని గురించి కాస్త కూడా ఆలోచించలేదు. వాళ్ల ప్రియమైన ప్రభుత్వం ఎవరెవరికీ భూములను ఎక్కడెక్కడో ఇచ్చింది. వీటి గురించి ఎవరూ మాట్లాడరు. నా ప్రాంతంలో కేవలం రెండు ఎకరాల్లో మినీ స్టూడియో కట్టాలని అనుకుంటే మాత్రం రాద్ధాంతం చేస్తున్నారు' అని మహి వి.రాఘవ్ మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment