Tollywood Heroes Collaborating With Kannada Directors, Check Here Combinations - Sakshi
Sakshi News home page

తెలుగు స్టార్‌ హీరోలతో సినిమాలు చేస్తున్న కన్నడ డైరెక్టర్స్‌

Published Sat, Mar 25 2023 8:19 AM | Last Updated on Sat, Mar 25 2023 9:25 AM

Tollywood Heroes Collaborating with Kannada Directors - Sakshi

సినిమా రంగంలో ప్రతిభ ఉంటే చాలు.. భాషాపరమైన హద్దులు బద్దలవుతాయి. టాలెంట్‌ ఉంటే పిలిచి మరీ అవకాశాలు ఇస్తుంటారు ఆయా హీరోలు, నిర్మాతలు. ఇదే కోవలో తాజాగా ప్రశాంత్‌ నీల్, హర్ష, నార్తన్‌ వంటి కన్నడ దర్శకులు తెలుగు స్టార్‌ హీరోలతో సినిమా చేసే అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు.. తెలుగు హీరోలతో ఆ కన్నడ దర్శకులు చేస్తున్న చిత్రాల గురించి తెలుసుకుందాం.

కన్నడలో ‘ఉగ్రం’ (2014) సినిమాతో డైరెక్టర్‌గా ప్రయాణం మొదలుపెట్టారు ప్రశాంత్‌ నీల్‌. ఆ తర్వాత నాలుగేళ్లకు యశ్‌ హీరోగా ‘కేజీఎఫ్‌’ (మొదటి భాగం 2018) మూవీతో కన్నడ ఇండస్ట్రీని పాన్‌ ఇండియా స్థాయికి తీసుకెళ్లారు. ఆ సినిమాకి సీక్వెల్‌గా వచ్చిన ‘కేజీఎఫ్‌’ (రెండవ భాగం 2022) చిత్రం కూడా సూపర్‌ హిట్‌ కావడంతో భారీ అవకాశాలు ప్రశాంత్‌ నీల్‌ డోర్‌ని టచ్‌ చేశాయి. అందులో భాగంగా పాన్‌ ఇండియా హీరోగా దూసుకెళుతున్న ప్రభాస్‌తో ‘సలార్‌’ మూవీ చేసే గోల్డెన్‌ చాన్స్‌ అందిపుచ్చుకున్నారు ప్రశాంత్‌. ‘కేజీఎఫ్‌’ నిర్మాత విజయ్‌ కిరగందూర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే మరో స్టార్‌ హీరో ఎన్టీఆర్‌తో సినిమా చేసే చాన్స్‌ అందుకున్నారు ప్రశాంత్‌ నీల్‌. ‘సలార్‌’ షూటింగ్‌ పూర్తి కాగానే ఎనీ్టఆర్‌ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ని ఆరంభించనున్నారు ప్రశాంత్‌ నీల్‌. కొరటాల శివతో చేస్తున్న సినిమా పూర్తయ్యాక ప్రశాంత్‌ సినిమా షూటింగ్‌లో అడుగుపెట్టేలా ప్లాన్‌ చేస్తున్నారట ఎన్టీఆర్‌.

కథా బలం, యాక్షన్‌ సినిమాలతో కన్నడ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు డైరెక్టర్‌ ఎ. హర్ష. శివరాజ్‌కుమార్‌తో ఇటీవల ఆయన తెరకెక్కించిన ‘వేద’ సినిమా సూపర్‌ హిట్‌గా నిలిచింది. తాజాగా ఆయన తెలుగులో హీరో గోపీచంద్‌తో ఓ సినిమా చేస్తున్నారు. గోపీచంద్‌ కెరీర్‌లో 31వ చిత్రమిది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ ప్రొడక్షన్‌పై కేకే రాధా మోహన్‌ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెలలోనే ప్రారంభమైంది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. 

రామ్‌చరణ్‌ ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో చేస్తున్న చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం తర్వాత ‘ఉప్పెన’ ఫేమ్‌ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ మూవీకి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు చరణ్‌. అదే విధంగా మరో సినిమాని కూడా లైన్‌లో పెట్టారట. ‘ముఫ్తీ’ (2017) సినిమాతో దర్శకుడిగా కన్నడలో ఘనవిజయం అందుకున్న నార్తన్‌తో రామ్‌చరణ్‌ సినిమా చేయనున్నారని టాక్‌. ఇక ‘ముఫ్తీ’ తర్వాత కన్నడ స్టార్‌ శివ రాజ్‌కుమార్‌తో నార్తన్‌ తీసిన ‘భైరతి రణగల్‌’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా చేస్తున్న సమయంలోనే రామ్‌చరణ్‌కు నార్తన్‌ ఓ కథ వినిపించగా, నచ్చడంతో గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని టాక్‌. శంకర్‌తో చేస్తున్న సినిమా తర్వాత బుచ్చిబాబు సినిమాని పూర్తి చేశాక నార్తన్‌ మూవీ చేస్తారట రామ్‌చరణ్‌. ప్రశాంత్‌ నీల్, హర్ష, నార్తన్‌ మాత్రమే కాదు.. మరికొందరు కన్నడ దర్శకులు తెలుగు హీరోలతో సినిమాలు చేసేందుకు చర్చలు జరుపుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement