‘ప్యాన్‌‌ ఇండియా’ను టార్గెట్‌ చేసిన చిరు, చెర్రీ, ప్రభాస్ | Tollywood Movies Ready To Shake Pan India Market | Sakshi
Sakshi News home page

ఆలిండియా బాక్సాఫీస్‌ను షేక్‌ చేయనున్న తెలుగు సినిమాలు

Published Sun, Feb 21 2021 10:04 AM | Last Updated on Sun, Feb 21 2021 12:45 PM

Tollywood Movies Ready To Shake Pan India Market - Sakshi

తెలుగు సినిమా పరిధి పెరిగింది. బాక్సాఫీస్‌ స్టామినా పెరిగింది. దాంతో, మన సినిమా బడ్జెట్‌లు పెంచుకుంది. కథల్ని విస్తృతపరుచుకుంది. తాజాగా పలు తెలుగు సినిమాలు... అఖిల భారత (ప్యాన్‌ ఇండియా) స్థాయిలో తెరకెక్కుతున్నాయి. దేశవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల కానున్నాయి. ఆలిండియా బాక్సాఫీస్‌ను కొల్లగొట్టే ప్లాన్‌లో ఉన్నాయి. ఒక్కమాటలో మనవి ఇప్పుడు ప్రాంతీయ స్థాయి సినిమాలు కాదు... ‘ప్యాన్‌’తీయ సినిమాలు! ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ ‘ప్యాన్‌తీయ’ చిత్రాల వివరాలు, విశేషాలు... 

ఆర్‌ఆర్‌ఆర్‌
‘బాహుబలి’తో తెలుగు సినిమాకు కొత్త మార్కెట్‌ను, కొత్త ప్రేక్షకులను అందించారు దర్శకధీరుడు రాజమౌళి. ఈ సినిమా తర్వాత ఆయన తెరకెక్కిస్తున్న మరో భారీ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. జూనియర్‌ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు హీరోలుగా నటిస్తున్నారు. సుమారు రూ. 350 కోట్ల బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. సుమారు పది భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. దసరా సందర్భంగా అక్టోబర్‌ 13న ఈ సినిమా విడుదల కానుంది. 



రాధేశ్యామ్‌ – ఆదిపురుష్‌  – సలార్‌ – వైజయంతీ వారి చిత్రం
‘బాహుబలి’ చిత్రం ప్రభాస్‌ని భారతదేశం మొత్తానికి నచ్చిన సూపర్‌స్టార్‌ని చేసింది. ఆయన చేసే ప్రతీ సినిమా అన్ని ప్రాంతాల్లోనూ విడుదల చేసేలా మార్కెట్‌ ఏర్పడింది. ప్రస్తుతం ప్రభాస్‌ చేతిలో ఉన్న నాలుగూ ప్యాన్‌ ఇండియా సినిమాలే. అవి – రాధాకృష్ణతో చేస్తున్న ప్రేమకథా చిత్రం ‘రాధే శ్యామ్‌’ (300 కోట్లు), ఓం రౌత్‌ దర్శకత్వంలో చేస్తున్న పౌరాణిక చిత్రం  ‘ఆదిపురుష్‌’ (500 కోట్లు), ప్రశాంత్‌ నీల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సలార్‌’ (250), నాగ్‌ అశ్విన్‌తో చేయబోయే వైజయంతీ వారి సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం (400 కోట్లు). తర్వాత ప్రభాస్‌ చేయబోయేవీ దాదాపు ప్యాన్‌ ఇండియా రిలీజ్‌ ఉండే చిత్రాలే. 

మోసగాళ్లు
ఐటీ రంగంలోనే జరిగిన అతి పెద్ద స్కామ్‌ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మోసగాళ్లు’. మంచు విష్ణు నటించి, నిర్మించిన ఈ చిత్రాన్ని హాలీవుడ్‌ దర్శకుడు జెఫ్రీ గిన్‌ చీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ప్యాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌గా తెరకెక్కించారు. అన్ని ప్రాంతీయ భాషల్లో ఈ మార్చి నెలలోనే విడుదలకు సన్నాహాలు చేసుకుంటోంది. సుమారు రూ. 50 కోట్లతో ఈ సినిమా తెరకెక్కింది. 



పుష్ప
హిట్‌ కాంబినేషన్‌ అల్లు అర్జున్, సుకుమార్‌ చేస్తోన్న మాస్‌ ఎంటర్‌టైనర్‌ ‘పుష్ప’. తెలుగులో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని  మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. సుమారు రూ. 150 కోట్ల వ్యయంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఆగస్ట్‌ 13న ‘పుష్ప’ థియేటర్స్‌లోకి వస్తుంది. 

అహం బ్రహ్మాస్మి
చిన్న గ్యాప్‌ తర్వాత మంచు మనోజ్‌ ఓ ప్యాన్‌ ఇండియా సినిమాతో కమ్‌బ్యాక్‌ ఇస్తున్నారు. కొత్త దర్శకుడు శ్రీకాంత్‌తో మనోజ్‌  ‘అహం బ్రహ్మాస్మి’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో యాక్షన్‌ మోతాదు ఎక్కువగా ఉంటుందట. రూ. 25 కోట్లతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో నటించడంతో పాటు నిర్మిస్తున్నారు కూడా మనోజ్‌. 5 భాషల్లో ఈ సినిమా విడుదలవుతుంది.

శాకుంతలం
గుణశేఖర్, సమంత కాంబినేషన్‌లో ఓ భారీ పౌరాణిక చిత్రం తెరకెక్కనుంది. దుష్యంతుడు, శకుంతల కథను తెరపై ‘శాకుంతలం’ పేరుతో చూపించనున్నారు. కొన్ని కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. గుణశేఖర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్‌లో ఉంది. ఈ చిత్రానికి కాస్ట్యూమ్‌ డిజైనర్‌ నీతా లుల్లా, ‘ఒక్కడు’ చార్మినార్‌ సెట్‌ ఫేమ్‌ కళా దర్శకుడు అశోక్‌ కుమార్, సంగీత దర్శకుడు మణిశర్మ లాంటి ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు.

లైగర్‌
‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సూపర్‌ హిట్‌తో ఫుల్‌ జోష్‌ మీద ఉన్నారు పూరి జగన్నాథ్‌. యంగ్‌ సెన్సేషన్‌ విజయ్‌ దేవరకొండతో కలసి ఆయన చేస్తున్న క్రేజీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘లైగర్‌’. బాక్సింగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్‌ బాక్సర్‌గా కనిపిస్తారు. దీన్ని ప్యాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. సెప్టెంబర్‌ 9న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. బాలీవుడ్‌ నిర్మాత కరణ్‌ జోహార్‌తో కలసి పూరి జగన్నాథ్, చార్మి ఈ సినిమాను 50 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

 

మేజర్‌
ముంబయ్‌ తాజ్‌ హోటల్‌ దాడుల్లో మరణించిన మేజర్‌ ఉన్ని కృష్ణన్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మేజర్‌’. అడివి శేష్‌ టైటిల్‌ రోల్‌ చేస్తూ ఈ సినిమా కథను సమకూర్చారు. అడివి శేష్‌తో ‘గూఢచారి’ తెరకెక్కించిన శశికిరణ్‌ తిక్క ఈ సినిమాకు దర్శకుడు. సుమారు రూ. 30 కోట్లతో ఈ సినిమా తీశారు. జూన్‌ 2న ఈ సినిమా థియేటర్స్‌లోకి రానుంది. ప్యాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదలవుతుంది.  

ప్లానింగ్‌లో మరిన్ని... 
ఇటీవలే శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు రామ్‌చరణ్‌. ప్యాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమా రూపొందనుంది. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళుతుంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత మహేశ్‌బాబుతో ఓ సినిమా చేయనున్నారు రాజమౌళి. ఇది కూడా ప్యాన్‌ ఇండియా స్థాయిలోనే తెరకెక్కుతుంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చేసిన తర్వాత త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేస్తారు జూనియర్‌ ఎన్టీఆర్‌. ఆ తర్వాత ప్రశాంత్‌ నీల్‌తో సినిమా ఉంటుంది. ప్యాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమా ఉంటుందని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement