'మ్యాడ్‌ స్క్వేర్‌' డేట్‌ మారింది.. కొత్త తేదీ ఇదే | Tollywood Procuder Suryadevara Naga Vamsi About Mad Square Release | Sakshi
Sakshi News home page

Mad Square Release Date: ముందుగానే వచ్చేస్తోన్న 'మ్యాడ్‌ స్క్వేర్‌'.. విడుదల ఎప్పుడంటే?

Published Sun, Mar 2 2025 7:12 PM | Last Updated on Sun, Mar 2 2025 7:39 PM

Tollywood Procuder  Suryadevara Naga Vamsi About Mad Square Release

సంగీత్‌ శోభన్, నార్నే నితిన్, రామ్‌ నితిన్‌ ప్రధాన పాత్రల్లో ఫన్ అండ్ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ 'మ్యాడ్‌ స్క్వేర్'. ఇటీవల విడుదలైన టీజర్‌ ఈ సినిమాపై అంచనాలు పెంచేసింది. టీజర్‌లో కామెడీ పంచులు ఆడియన్స్‌కు నవ్వులు  తెప్పిస్తున్నాయి. గతంలో విడుదలైన అభిమానులను అలరించిన మ్యాడ్‌కు సీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. కల్యాణ్‌ శంకర్‌ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీని సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చిలోనే రిలీజ్ కానుంది.

అయితే టాలీవుడ్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాకు సంబంధించి మరో అప్‌డేట్ ఇచ్చారు. మొదట అనుకున్న తేదీలో మ్యాడ్ స్క్వేర్‌ విడుదల కావడం లేదని వెల్లడించారు. ట్విటర్ వేదికగా ఈ విషయాన్ని పంచుకున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం మార్చి 29న రిలీజ్‌ చేయడం లేదని తెలిపారు. ఆ రోజు అమావాస్య ఉన్నందున ఒక రోజు ముందుగానే మార్చి 28న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ట్వీట్ చేశారు. ‍

అయితే ‍అదే రోజు నితిన్, శ్రీలీల జంటగా నటించిన రాబిన్‌హుడ్‌ కూడా విడుదల కానుందని నాగవంశీ తెలిపారు. రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా రాబిన్ హుడ్‌ హీరో నితిన్‌, డైరెక్టర్ వెంకీ కుడుములకు నాగవంశీ ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు.

లాజిక్స్ వెతకొద్దు..

కాగా.. ఇటీవల మ్యాడ్ స్క్వేర్‌ మూవీపై ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో టాలీవుడ్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడారు. మ్యాడ్-2 చిత్రం గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. మ్యాడ్‌లాగే ఇందులో కూడా ఎలాంటి కథ ఉండదని తెలిపారు. కేవలం రెండు గంటలు నవ్వుకోవడానికి థియేటర్లకు రండి అని విజ్ఞప్తి చేశారు. ఇంజినీరింగ్ చదువుకుని ఉద్యోగం చేయకూడదనుకున్న ముగ్గురు వెధవలు ఒక మంచోడిని వెధవను చేసే కథే మ్యాడ్‌ స్క్వేర్. ఈ సారి హైదరాబాద్‌లో చేసిన అరాచకాలు అయిపోయాయని.. స్టోరీని గోవాకు మార్చామని తెలిపారు. ఈ సినిమా అంతా ఫన్.. ఎలాంటి లాజిక్స్ వెతకొద్దు.. ముందే క్లియర్‌గా చెబుతున్నాని పేర్కొన్నారు. ఇది మిస్సయింది.. అది మిస్సయింది లాంటి అడొగద్దు.. నవ్వుకోవడానికి మాత్రమే థియేటర్‌కు రండి అని నాగవంశీ టాలీవుడ్ అభిమానులకు సూచించారు.
 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement