టాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సినీ గేయ రచయిత వడ్డేపల్లి కృష్ణ కన్నుమూశారు. హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతూ మరణించారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు. సి నారాయణ రెడ్డి మెచ్చిన రచయితల్లో ఒకరైన కృష్ణ పది వేల లలిత గీతాలను పరిశీలించి పీహెచ్‌డీ పూర్తి చేశారు.
పిల్ల జమీందార్, పెద్దరికం, భైరవ ద్వీపం, సోగ్గాడే చిన్ని నాయనా లాంచి హిట్ సినిమాలకు గీత రచయితగా పనిచేసిన వడ్డేపల్లి కృష్ణ రెండు సినిమాలకు దర్శకత్వం వహించారు. లావణ్య విత్ లవ్‌బాయ్స్ అనే సినిమాను ఆయన డైరెక్షన్‌లో తెరకెక్కించారు. ఆయన దర్శకత్వం వహించిన ఎక్కడికి వెళ్తుందో మనసు చిత్రంలో సాయికుమార్ హీరోగా నటించారు. అంతే కాకుండా గతేడాది సూపర్ హిట్‌గా నిలిచిన బలగం సినిమాలో కూడా నటించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జయ జయహే తెలంగాణ పాటతో ఆయన పేరు మార్మోగిపోయింది.
సి.నారాయణరెడ్డిగారి రచనలంటే ప్రాణం.. ఆయన స్ఫూర్తితోనే సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టానని గతంలో ఆయన వెల్లడించారు. ఆయన తన మొదటి పాట భానుమతి దర్శకత్వం వహించిన ‘రచయిత్రి’ సినిమా కోసం రాశారు. కానీ ఆ సినిమా ఆలస్యంగా విడుదల కావడంతో ‘పిల్ల జమీందార్’ మొదటి సినిమాగా రికార్డుల్లోకి ఎక్కింది. దాదాపు ఇప్పటివరకూ మొత్తం 200 పాటలకు పైగా రాశారు. లలిత సంగీత సాహిత్యంలో వచ్చిన మార్పుల మీద పరిశోధన చేసి, ఉస్మానియా నుంచి పీహెచ్‌డీ పట్టా కూడా అందుకున్నారు.
అవార్డులు
1992లో బాలల మీద రాసిన ‘చిరుగజ్జెలు’ అనే గేయానికిగాను బాల సాహిత్య పురస్కారం అందుకున్నారు. ఈ గేయాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం పూణెలోని బాలభారతి స్కూల్లో నాలుగో తరగతిలో తెలుగు వాచకంలో ఓ పాఠ్యాంశంగా చేర్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా రాసిన జయహే, జయహే తెలంగాణ నృత్యరూపకానికి సాహిత్యం అందించారు. వివేకానంద విజయం, విశ్వకల్యాణం నృత్యరూపకాలు కూడా నాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఆయన రచించిన ‘విశ్వకల్యాణం’ బెంగాలీ భాషలోకి కూడా అనువాదమైంది. అమెరికాలో ప్రతి ఏటా నిర్వహించే ఆటా, తానా సభలకు వరుసగా స్వాగత సంగీత నృత్యరూపకాలు అందించారు.
Comments
Please login to add a commentAdd a comment