Vaddepalli Krishna
-
సినీగేయ రచయిత వడ్డేపల్లి కృష్ణ కన్నుమూత
లక్డీకాపూల్ (హైదరాబాద్)/ సిరిసిల్ల కల్చరల్: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ కవి, సినీగేయ రచయిత డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ అనారోగ్యంతో కన్నుమూశారు. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 76 ఏళ్లు. లలిత గీతాల రచయితగా, టెలివిజన్ ధారావాహికల దర్శకుడిగా, గేయ రచయితగా, వివిధ డాక్యుమెంటరీలు, ఆడియో ఆల్బమ్స్ రూపకర్తగా ఆయన ప్రసిద్ధి చెందారు. తెలుగు సినీ పరిశ్రమలో రచయితల సంఘానికి ఆయన విశిష్ట సేవలందించారు. నంది పురస్కారాల కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. కాగా, అమెరికా నుంచి ఆయన కుమారుడు రావాల్సి ఉండటంతో కృష్ణ భౌతికకాయాన్ని నిమ్స్ మార్చురీలో భద్రపరిచారు. కృష్ణ మరణ వార్త గురించి తెలిసి పలువురు కవులు, కళాకారులు, రచయితలు నిమ్స్‌కు వచ్చి నివాళులర్పించారు. తెలంగాణ బీసీ కమిషన్ తొలి చైర్మన్ బి.ఎస్.రాములు సంతాపం తెలిపారు. రెండు రోజుల క్రితమే జీవన సాఫల్య పురస్కారంరెండు రోజుల క్రితమే తెలుగు సినీ రచయితల సంఘం వడ్డేపల్లి కృష్ణను జీవన సాఫల్య పురస్కారంతో సత్క రించింది. అమెరికాలో ఆటా సభల్లో పాల్గొనడానికి వెళ్లి న ఆయన ఆరోగ్యం దెబ్బతినడంతో జూలై 16న హైద రాబాద్ వచ్చి ఆసుపత్రిలో చేరారు. నెల రోజులు ఆసు పత్రిలోనే ఉండి నాలుగు రోజుల క్రితం డిశ్చార్జ్ అయ్యా రు. మళ్లీ ఇబ్బంది అనిపించడంతో మరోసారి నిమ్స్ ఆసుపత్రిలో చేరారు. వడ్డేపల్లి కృష్ణ సిరిసిల్లలో చేనేత కుటుంబంలో జన్మించారు. హైదరాబాద్ నాగోల్‌లో స్థిరపడ్డారు. తొలుత తపాలా శాఖలో ఉద్యోగం చేశారు. వందేళ్లలో వెలువడిన పది వేల లలిత గీతాలను పరిశీలించి పీహెచ్డీ పూర్తి చేశారు. పిల్ల జమీందార్, భైరవద్వీపం, పెద్దరికం తదితర చిత్రాలకు రాసిన పాటలకు ఆయనకు మంచి పేరు వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరు వాత జయ జయహే తెలంగాణ నృత్య రూపకం రచించా రు. కృష్ణ తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. రెండు సినిమాలకు దర్శకత్వం వహించారు. -
టాలీవుడ్లో తీవ్ర విషాదం.. ప్రముఖ రచయిత మృతి!
టాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సినీ గేయ రచయిత వడ్డేపల్లి కృష్ణ కన్నుమూశారు. హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతూ మరణించారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు. సి నారాయణ రెడ్డి మెచ్చిన రచయితల్లో ఒకరైన కృష్ణ పది వేల లలిత గీతాలను పరిశీలించి పీహెచ్డీ పూర్తి చేశారు.పిల్ల జమీందార్, పెద్దరికం, భైరవ ద్వీపం, సోగ్గాడే చిన్ని నాయనా లాంచి హిట్ సినిమాలకు గీత రచయితగా పనిచేసిన వడ్డేపల్లి కృష్ణ రెండు సినిమాలకు దర్శకత్వం వహించారు. లావణ్య విత్ లవ్‌బాయ్స్ అనే సినిమాను ఆయన డైరెక్షన్లో తెరకెక్కించారు. ఆయన దర్శకత్వం వహించిన ఎక్కడికి వెళ్తుందో మనసు చిత్రంలో సాయికుమార్ హీరోగా నటించారు. అంతే కాకుండా గతేడాది సూపర్ హిట్‌గా నిలిచిన బలగం సినిమాలో కూడా నటించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జయ జయహే తెలంగాణ పాటతో ఆయన పేరు మార్మోగిపోయింది.సి.నారాయణరెడ్డిగారి రచనలంటే ప్రాణం.. ఆయన స్ఫూర్తితోనే సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టానని గతంలో ఆయన వెల్లడించారు. ఆయన తన మొదటి పాట భానుమతి దర్శకత్వం వహించిన ‘రచయిత్రి’ సినిమా కోసం రాశారు. కానీ ఆ సినిమా ఆలస్యంగా విడుదల కావడంతో ‘పిల్ల జమీందార్’ మొదటి సినిమాగా రికార్డుల్లోకి ఎక్కింది. దాదాపు ఇప్పటివరకూ మొత్తం 200 పాటలకు పైగా రాశారు. లలిత సంగీత సాహిత్యంలో వచ్చిన మార్పుల మీద పరిశోధన చేసి, ఉస్మానియా నుంచి పీహెచ్డీ పట్టా కూడా అందుకున్నారు.అవార్డులు1992లో బాలల మీద రాసిన ‘చిరుగజ్జెలు’ అనే గేయానికిగాను బాల సాహిత్య పురస్కారం అందుకున్నారు. ఈ గేయాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం పూణెలోని బాలభారతి స్కూల్లో నాలుగో తరగతిలో తెలుగు వాచకంలో ఓ పాఠ్యాంశంగా చేర్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా రాసిన జయహే, జయహే తెలంగాణ నృత్యరూపకానికి సాహిత్యం అందించారు. వివేకానంద విజయం, విశ్వకల్యాణం నృత్యరూపకాలు కూడా నాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఆయన రచించిన ‘విశ్వకల్యాణం’ బెంగాలీ భాషలోకి కూడా అనువాదమైంది. అమెరికాలో ప్రతి ఏటా నిర్వహించే ఆటా, తానా సభలకు వరుసగా స్వాగత సంగీత నృత్యరూపకాలు అందించారు. -
ప్రజాస్వామ్యానికి ఓటే రక్ష
సిరిసిల్ల : ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటును మించిన ఆయుధం లేదని, రాజ్యాంగం ఇచ్చిన ఈఅవకాశాన్ని ఓటర్లు సద్వినయోగం చేసుకోవాలని ప్రముఖ లలిత గేయ కవి, సినీ దర్శకుడు వడ్డెపెల్లి కృష్ణ అన్నారు. ఆదివారం గాంధీనగర్ హనుమాన్ దేవాలయంలో సిరిసిల్ల సాహితీ సమితి ఆధ్వర్యంలో జరిగిన కవి సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఓటు విలువ తెలుసుకుని నోటురూటు మార్చుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం ప్రతీపౌరుడు బాధ్యతాయుతంగా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమాధ్యక్షుడు పొరండ్ల మురళీధర్ మాట్లాడుతూ మందుకో, విందుకో లొంగి ఓటును అమ్ముకుంటే ప్రశ్నించే హక్కును కోల్పోతామన్నారు. అనంతరం సాహితీ సమితికి చెందిన పలువురు కవులు తమ కవితల్లో ఓటు ప్రాధాన్యతను వర్ణించారు. సమితి ప్రతినిధులు వడ్డెపెల్లి కృష్ణను సత్కరించారు. కార్యక్రమంలో సమితి ప్రధాన కార్యదర్శి డాక్టర్ జనపాల శంకరయ్య, కవులు, రచయితలు వెంగళ లక్ష్మణ్, వాసరవేణి పరుశరాం, మడుపు ముత్యంరెడ్డి, జక్కని వెంకట్రాజం, నేరోజు రమేశ్, సబ్బని బాలయ్య, వడ్నాల వెంకటేశం, పాముల ఆంజనేయులు, కనపర్తి హనుమాండ్లు, తుమ్మనపల్లి రామస్వామి, సిద్దిరాం, సత్యనారాయణ పాల్గొన్నారు. -
ఆ నలుగురి సహకారం మరచిపోలేను!
అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘పిల్ల జమీందార్’లోని ‘నీ చూపులోని విరజాజి వాన..’ పాట గుర్తుందా? వడ్డేపల్లి కృష్ణ రాసిన ఆ పాట సూపర్ హిట్. మొదటి పాటతోనే గేయ రచయితగా గుర్తింపు తెచ్చుకున్నారాయన. నేటితో వడ్డేపల్లి సినీ రంగ ప్రవేశం చేసి 35 ఏళ్లయ్యింది. ఈ సందర్భంగా ‘సాక్షి’తో ఆయన మాట్లాడుతూ - ‘‘చిన్నతనం నుంచి తెలుగు సాహిత్యమంటే ఇష్టం. ముఖ్యంగా సి.నారాయణరెడ్డిగారి రచ నలంటే ప్రాణం. ఆయన స్ఫూర్తితోనే సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టాను. నా మొదటి పాట భానుమతి దర్శకత్వం వహించిన ‘రచయిత్రి’ సినిమా కోసం రాశాను. కానీ ఆ సినిమా ఆలస్యంగా విడుదల కావడంతో ‘పిల్ల జమీందార్’ నా మొదటి సినిమాగా రికార్డుల్లోకి ఎక్కింది. అక్కినేని నాగేశ్వరరావు, భానుమతి, దర్శకుడు సింగితం శ్రీనివాసరావు, నిర్మాత ఏఎం రత్నం లేకపోతే నేను ఇన్నాళ్లు ఇండస్ట్రీలో ఉండేవాణ్ణి కాదేమో. ఇప్పటివరకూ మొత్తం 200 పాటలు రాశాను. వాటితో పాటు ప్రైవేటు పాటలు కూడా రాశాను. 1910 నుంచి 2000 సంవత్సరం వరకూ లలిత సంగీత సాహిత్యంలో వచ్చిన మార్పుల మీద పరిశోధన చేసి, ఉస్మానియా నుంచి పీహెచ్డీ పట్టా కూడా తీసుకున్నాను. 1992లో బాలల మీద రాసిన ‘చిరుగజ్జెలు’ అనే గేయానికిగాను బాల సాహిత్య పురస్కారం అందుకున్నాను. ఈ గేయాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం పూణెలోని బాలభారతి స్కూల్లో నాలుగో తరగతిలో తెలుగు వాచకంలో ఓ పాఠ్యాంశంగా చేర్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా రాసిన జయహే, జయహే తెలంగాణ’ నృత్యరూపకానికి సాహిత్యం అందించాను. దీనివల్ల నాకు మంచి గుర్తింపు వచ్చింది. వివేకానంద విజయం, విశ్వకల్యాణం నృత్యరూపకాలు కూడా నాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ‘విశ్వకల్యాణం’ బెంగాలీ భాషలోకి కూడా అనువాదమైంది. అమెరికాలో ప్రతి ఏటా నిర్వహించే ఆటా, తానా సభలకు వరుసగా స్వాగత సంగీత నృత్యరూపకాలు రాశాను కూడా. ఈ మధ్యే సాయికిరణ్ హీరోగా నటించిన ‘ఎక్కడికెళుతుందో మనసు’ సినిమాకు దర్శకత్వం వహించాను. ప్రస్తుతం కొన్ని స్క్రిప్ట్‌లు రెడీ చేస్తున్నాను. అన్నీ కుదిరితే త్వరలో మళ్లీ మెగాఫోన్ పడతాను’’ అని అన్నారు. -
ఆడవే మయూరీ... నటనమాడవే మయూరీ
మావూరు సిరిసిల్లకు దగ్గరలో ఉన్న బోయినిపల్లి. అక్కడ సబ్ పోస్ట్‌మాస్టర్‌గా పనిచేస్తూనే, ప్రైవేట్‌గా బి.ఏ. పరీక్షలు రాయడానికి 1971లో హైదరాబాద్ వచ్చాను. అప్పుడు ‘చెల్లెలి కాపురం’ చిత్రం చూశాను. అప్పటి కే గురువర్యులు డా. సి.నారాయణరెడ్డిగారి ప్రోత్సాహంతో అనేక లలిత గీతాలు, కవితలు రచించి పత్రికల ద్వారా, ఆకాశవాణి ద్వారా కవిగా కాస్త పేరు గాంచాను. ఆ తర్వాత 1979-80లో భానుమతి, అక్కినేని చిత్రాలకు పాటలు రాశాను. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో కె.వి.మహదేవన్ సంగీత నిర్దేశకత్వంలో ‘చెల్లెలి కాపురం’ చిత్రంలో ఎస్.పి.బాలు గళంలో మారుమోగిన సినారె రచించిన ‘చరణకింకిణులు ఘల్లుఘల్లుమన’ పాట నన్నెంతగానో ఆకర్షించింది. ఆ పాట అంతగా ఆకర్షించడానికి కారణం... పాటలో ప్రబంధ పరిమళాలు గుబాళించడమే. అంతేకాదు... అందులో సాహిత్యం-సంగీతం-నృత్యం ఒకదానితో ఒకటి పోటీపడ్డాయి. దొంగకవిని పట్టించి, అసలు కవి (శోభన్‌బాబు) ఆనవాళ్లను ప్రేక్షకలోకానికి పరిచయం చేయదలచిన కథానాయిక (వాణిశ్రీ) తన ఆటకు తగిన పాటనల్లగలవా? అని సవాలు చేస్తూ పోటీకి దిగిన పతాక సన్నివేశంలో వచ్చే ఈ పాట, ప్రతి ప్రేక్షకుని ఎదను పరవశింపజేస్తుంది. నిర్మాత ఎం.బాలయ్య అభిరుచి మేరకు, ప్రౌఢ సమాసాలతో పకడ్బందీగా ఈ గీతాన్ని సినారె రచించి సినిమా పాటకు కావ్యగౌరవాన్ని కలిగించారు. ‘సాకీ’గా ఎత్తుగడలోనే సవాలుగా నిలిచిన హీరో ‘చరణకింకిణులు ఘల్లుఘల్లుమన... కరకంకణములు గలగలలాడగ/ వినీల కచభర విలాసబంధుర తనూలతిక చంచలించిపోగా... అంటూ ప్రౌఢ సమాసాల్ని గుప్పించడం నిండుదనాన్ని తెచ్చిందనవచ్చు. చరణకింకిణులు అంటే కాలి అందెలని, అవి ఘల్లుఘల్లుమన మోగగా, కరకంణములు గలగలమని సవ్వడి చేయగా, వినీల (నల్లని) కచభర (కురులు) విలాసబంధుర (అందంగా ముడివేసిన) తనూ లతిక (తీగలాంటి శరీరం) చంచలించిపోగా అనే పదాలకు సామాన్య ప్రేక్షకులకు అర్థాలే తెలియవు. కాని సన్నివేశ బలం వాళ్లను రజింపజేసింది. పల్లవిలో మాత్రం తేలిక పదాలతో ఆడవే మయూరీ... నటనమాడవే మయూరీ/ నీ కులుకును గని నా పలుకు విరియ/ నీ నటనను గని నవ కవిత వెలయగా... అంటూ ఆ గీతం సాగిపోతుంది. మన మనసు ఆనందంగా ఊగిపోతుంది. ప్రథమ చరణాంతంలో కూడా అంత్యప్రాసలతో ‘అది చల్లని సైకత వేదిక... అట సాగెను విరహిణి రాధిక/ అది రాధ మనసులో మాధవుడూదిన రసమయ మురళీ గీతిక’ అంటూ రసర మ్యంగా ఆ పాట రాధాకృష్ణుల రాసలీల పరమార్థంగా కొనసాగుతుంది. అదే అర్థాన్ని తన నాట్యం ద్వారా నర్తకి విశదీకరిస్తుంది. రెండవ చరణంలో ‘ఫాలనేత్ర సంప్రభవత్ జ్వాలలు ప్రసవ శరుని దహియించగా/ పతిని కోలుపడి రతీదేవి దుఃఖిత మతియై రోదించగా/ హిమగిరీంద్ర శిఖరాగ్ర తాండవత్ ప్రమథగణము కనిపించగా/ ప్రమథనాథ కరపంకజ భాంకృత డమరుధ్వని వినిపించగా’ అంటూ రౌద్రరసంగా ఈ పాట తనకు తపోభంగం చేసిన మన్మథుడిని రుద్రుడు ముక్కంటితో భస్మం గావించిన సన్నివేశాన్ని ప్రస్ఫుటపరచగా అదే అర్థంలో నర్తకి తాండవంతో ఆడి రక్తి కట్టిస్తుంది. హీరో (కవి) ఏ పదాల్ని అల్లినా, ఏ భావాల్ని తెలిపినా దానికి దీటుగా నర్తకి ఆడుతూ సవాలునెదుర్కొంటున్న సందర్భంలో హీరోయిన్ నాట్యానికి వీలుకాని విధంగా పదబంధాల్ని గుప్పించడం ఈ పాటకు హైలైట్‌గా అగుపిస్తుందిలా... ‘కనులలోన కనుబొమలలోన... అధరమ్ములోన వదనమ్ములోన/ గళసీమలోన కటిసీమలోన... కరయుగములోన పదయుగములోన... నీ తనువులోని అణువణువులోన/ అనంత విధముల అభినయించి ఇక ఆడవే ఆడవే ఆడవే...’ అంటూ కవి పలికిన ఈ చరణాంతపు పంక్తులకనుగుణంగా నర్తకి ఆడలేక, అభివ్యక్తీకరించలేక ఓడినట్లు ఒప్పుకుంటుంది. హీరోని ఆసలు సిసలు అద్భుత కవిగా లోకానికి చాటుతుంది. ఒక విధంగా ఈ చిత్రంలో హీరో కవి కావడం వల్ల, గీత రచయితయైన సినారె మమేకమై విజృభించినట్లు తోస్తుంది. సన్నివేశానికి తగిన సత్తువ కూర్చి, పతాక సన్నివేశంలో సాహిత్య విజయ పతాకాన్ని రెపరెపలాడించినట్లు వ్యక్తమవుతుంది. కొసమెరుపుగా నిలచిన ఈ పాట ఆ చిత్రం గెలుపుబాటగా మారిందనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అందుకే నాటికీ, నేటికీ ఈ పాట అపూర్వంగా సాహిత్య సౌరభంగా చరిత్ర పుటల్లోనే గాక ప్రతి ప్రేక్షకుని మనసు పొరల్లోనూ నిలిచిపోయిందని నిస్సందేహంగా చెప్పవచ్చు. అందుకే ఈ గీత రచయితయైన మా గురువుగారు సినారెగారి చరణాలకు శిరసా నమామి-అందలి అద్భుత చరణాలను ‘మనసా స్మరామి’గా మననం చేసుకుంటున్నాను. సంభాషణ: నాగేశ్