మావూరు సిరిసిల్లకు దగ్గరలో ఉన్న బోయినిపల్లి. అక్కడ సబ్ పోస్ట్‌మాస్టర్‌గా పనిచేస్తూనే, ప్రైవేట్‌గా బి.ఏ. పరీక్షలు రాయడానికి 1971లో హైదరాబాద్ వచ్చాను.
మావూరు సిరిసిల్లకు దగ్గరలో ఉన్న బోయినిపల్లి. అక్కడ సబ్ పోస్ట్‌మాస్టర్‌గా పనిచేస్తూనే, ప్రైవేట్‌గా బి.ఏ. పరీక్షలు రాయడానికి 1971లో హైదరాబాద్ వచ్చాను. అప్పుడు ‘చెల్లెలి కాపురం’ చిత్రం చూశాను. అప్పటి కే గురువర్యులు డా. సి.నారాయణరెడ్డిగారి ప్రోత్సాహంతో అనేక లలిత గీతాలు, కవితలు రచించి పత్రికల ద్వారా, ఆకాశవాణి ద్వారా కవిగా కాస్త పేరు గాంచాను. ఆ తర్వాత 1979-80లో భానుమతి, అక్కినేని చిత్రాలకు పాటలు రాశాను.
కె.విశ్వనాథ్ దర్శకత్వంలో కె.వి.మహదేవన్ సంగీత నిర్దేశకత్వంలో ‘చెల్లెలి కాపురం’ చిత్రంలో ఎస్.పి.బాలు గళంలో మారుమోగిన సినారె రచించిన ‘చరణకింకిణులు ఘల్లుఘల్లుమన’ పాట నన్నెంతగానో ఆకర్షించింది. ఆ పాట అంతగా ఆకర్షించడానికి కారణం... పాటలో ప్రబంధ పరిమళాలు గుబాళించడమే. అంతేకాదు... అందులో సాహిత్యం-సంగీతం-నృత్యం ఒకదానితో ఒకటి పోటీపడ్డాయి.
దొంగకవిని పట్టించి, అసలు కవి (శోభన్‌బాబు) ఆనవాళ్లను ప్రేక్షకలోకానికి పరిచయం చేయదలచిన కథానాయిక (వాణిశ్రీ) తన ఆటకు తగిన పాటనల్లగలవా? అని సవాలు చేస్తూ పోటీకి దిగిన పతాక సన్నివేశంలో వచ్చే ఈ పాట, ప్రతి ప్రేక్షకుని ఎదను పరవశింపజేస్తుంది. నిర్మాత ఎం.బాలయ్య అభిరుచి మేరకు, ప్రౌఢ సమాసాలతో పకడ్బందీగా ఈ గీతాన్ని సినారె రచించి సినిమా పాటకు కావ్యగౌరవాన్ని కలిగించారు.
‘సాకీ’గా ఎత్తుగడలోనే సవాలుగా నిలిచిన హీరో ‘చరణకింకిణులు ఘల్లుఘల్లుమన... కరకంకణములు గలగలలాడగ/ వినీల కచభర విలాసబంధుర
తనూలతిక చంచలించిపోగా... అంటూ ప్రౌఢ సమాసాల్ని గుప్పించడం నిండుదనాన్ని తెచ్చిందనవచ్చు. చరణకింకిణులు అంటే కాలి అందెలని, అవి ఘల్లుఘల్లుమన మోగగా, కరకంణములు గలగలమని సవ్వడి చేయగా, వినీల (నల్లని) కచభర (కురులు) విలాసబంధుర (అందంగా ముడివేసిన) తనూ లతిక (తీగలాంటి శరీరం) చంచలించిపోగా అనే పదాలకు సామాన్య ప్రేక్షకులకు అర్థాలే తెలియవు. కాని సన్నివేశ బలం వాళ్లను రజింపజేసింది.
పల్లవిలో మాత్రం తేలిక పదాలతో ఆడవే మయూరీ... నటనమాడవే మయూరీ/ నీ కులుకును గని నా పలుకు విరియ/ నీ నటనను గని నవ కవిత వెలయగా... అంటూ ఆ గీతం సాగిపోతుంది. మన మనసు ఆనందంగా ఊగిపోతుంది. ప్రథమ చరణాంతంలో కూడా అంత్యప్రాసలతో ‘అది చల్లని సైకత వేదిక... అట సాగెను విరహిణి రాధిక/ అది రాధ మనసులో మాధవుడూదిన
రసమయ మురళీ గీతిక’ అంటూ రసర మ్యంగా ఆ పాట రాధాకృష్ణుల రాసలీల పరమార్థంగా కొనసాగుతుంది. అదే అర్థాన్ని తన నాట్యం ద్వారా నర్తకి విశదీకరిస్తుంది.
రెండవ చరణంలో ‘ఫాలనేత్ర సంప్రభవత్ జ్వాలలు ప్రసవ శరుని దహియించగా/ పతిని కోలుపడి రతీదేవి దుఃఖిత మతియై రోదించగా/ హిమగిరీంద్ర శిఖరాగ్ర తాండవత్ ప్రమథగణము కనిపించగా/ ప్రమథనాథ కరపంకజ భాంకృత డమరుధ్వని వినిపించగా’ అంటూ రౌద్రరసంగా ఈ పాట తనకు తపోభంగం చేసిన మన్మథుడిని రుద్రుడు ముక్కంటితో భస్మం గావించిన సన్నివేశాన్ని ప్రస్ఫుటపరచగా అదే అర్థంలో నర్తకి తాండవంతో ఆడి రక్తి కట్టిస్తుంది.
హీరో (కవి) ఏ పదాల్ని అల్లినా, ఏ భావాల్ని తెలిపినా దానికి దీటుగా నర్తకి ఆడుతూ సవాలునెదుర్కొంటున్న సందర్భంలో హీరోయిన్ నాట్యానికి వీలుకాని విధంగా పదబంధాల్ని గుప్పించడం ఈ పాటకు హైలైట్‌గా అగుపిస్తుందిలా... ‘కనులలోన కనుబొమలలోన... అధరమ్ములోన వదనమ్ములోన/ గళసీమలోన కటిసీమలోన... కరయుగములోన పదయుగములోన... నీ తనువులోని అణువణువులోన/ అనంత విధముల అభినయించి ఇక ఆడవే ఆడవే ఆడవే...’ అంటూ కవి పలికిన ఈ చరణాంతపు పంక్తులకనుగుణంగా నర్తకి ఆడలేక, అభివ్యక్తీకరించలేక ఓడినట్లు ఒప్పుకుంటుంది. హీరోని ఆసలు సిసలు అద్భుత కవిగా లోకానికి చాటుతుంది.
ఒక విధంగా ఈ చిత్రంలో హీరో కవి కావడం వల్ల, గీత రచయితయైన సినారె మమేకమై విజృభించినట్లు తోస్తుంది. సన్నివేశానికి తగిన సత్తువ కూర్చి, పతాక సన్నివేశంలో సాహిత్య విజయ పతాకాన్ని రెపరెపలాడించినట్లు వ్యక్తమవుతుంది. కొసమెరుపుగా నిలచిన ఈ పాట ఆ చిత్రం గెలుపుబాటగా మారిందనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అందుకే నాటికీ, నేటికీ ఈ పాట అపూర్వంగా సాహిత్య సౌరభంగా చరిత్ర పుటల్లోనే గాక ప్రతి ప్రేక్షకుని మనసు పొరల్లోనూ నిలిచిపోయిందని నిస్సందేహంగా చెప్పవచ్చు. అందుకే ఈ గీత రచయితయైన మా గురువుగారు సినారెగారి చరణాలకు శిరసా నమామి-అందలి అద్భుత చరణాలను ‘మనసా స్మరామి’గా మననం చేసుకుంటున్నాను.
సంభాషణ: నాగేశ్