లక్డీకాపూల్ (హైదరాబాద్)/ సిరిసిల్ల కల్చరల్: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ కవి, సినీగేయ రచయిత డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ అనారోగ్యంతో కన్నుమూశారు. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 76 ఏళ్లు. లలిత గీతాల రచయితగా, టెలివిజన్ ధారావాహికల దర్శకుడిగా, గేయ రచయితగా, వివిధ డాక్యుమెంటరీలు, ఆడియో ఆల్బమ్స్ రూపకర్తగా ఆయన ప్రసిద్ధి చెందారు. తెలుగు సినీ పరిశ్రమలో రచయితల సంఘానికి ఆయన విశిష్ట సేవలందించారు. నంది పురస్కారాల కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. కాగా, అమెరికా నుంచి ఆయన కుమారుడు రావాల్సి ఉండటంతో కృష్ణ భౌతికకాయాన్ని నిమ్స్ మార్చురీలో భద్రపరిచారు. కృష్ణ మరణ వార్త గురించి తెలిసి పలువురు కవులు, కళాకారులు, రచయితలు నిమ్స్‌కు వచ్చి నివాళులర్పించారు. తెలంగాణ బీసీ కమిషన్ తొలి చైర్మన్ బి.ఎస్.రాములు సంతాపం తెలిపారు.
రెండు రోజుల క్రితమే జీవన సాఫల్య పురస్కారం
రెండు రోజుల క్రితమే తెలుగు సినీ రచయితల సంఘం వడ్డేపల్లి కృష్ణను జీవన సాఫల్య పురస్కారంతో సత్క రించింది. అమెరికాలో ఆటా సభల్లో పాల్గొనడానికి వెళ్లి న ఆయన ఆరోగ్యం దెబ్బతినడంతో జూలై 16న హైద రాబాద్ వచ్చి ఆసుపత్రిలో చేరారు. నెల రోజులు ఆసు పత్రిలోనే ఉండి నాలుగు రోజుల క్రితం డిశ్చార్జ్ అయ్యా రు. మళ్లీ ఇబ్బంది అనిపించడంతో మరోసారి నిమ్స్ ఆసుపత్రిలో చేరారు. వడ్డేపల్లి కృష్ణ సిరిసిల్లలో చేనేత కుటుంబంలో జన్మించారు. హైదరాబాద్ నాగోల్‌లో స్థిరపడ్డారు. తొలుత తపాలా శాఖలో ఉద్యోగం చేశారు. వందేళ్లలో వెలువడిన పది వేల లలిత గీతాలను పరిశీలించి పీహెచ్‌డీ పూర్తి చేశారు. పిల్ల జమీందార్, భైరవద్వీపం, పెద్దరికం తదితర చిత్రాలకు రాసిన పాటలకు ఆయనకు మంచి పేరు వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరు వాత జయ జయహే తెలంగాణ నృత్య రూపకం రచించా రు. కృష్ణ తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. రెండు సినిమాలకు దర్శకత్వం వహించారు.
Comments
Please login to add a commentAdd a comment