గత కొంతకాలంగా ఆపేసిన నంది అవార్డులను ఇచ్చి సినీ పరిశ్రమను ప్రోత్సహించాలని ప్రముఖ సినీ రచయిత విజయేంద్రప్రసాద్ అన్నారు. అవార్డులు ఇవ్వడం ద్వారా తెలంగాణ పర్యాటకంగానూ అభివృద్ధి చెందుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సహకారంతో ‘తెలంగాణ ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్’ ఆధ్వర్యంలో టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ సౌత్ ఇండియా- 2023 వేడుకలు దుబాయ్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన విజయేంద్రప్రసాద్ బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలోనే `ఆర్ఆర్ఆర్` సినిమాటోగ్రాఫర్ కె.కె సెంథిల్ కుమార్‌ను ఘనంగా సన్మానించారు.
విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ..' గత కొన్నేళ్లుగా ఆగిపోయిన నంది అవార్డ్స్‌ను ప్రభుత్వ సహకారంతో ఇవ్వడం సంతోషకరం. అయితే తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా తీసే చిత్రాలకు స్పెషల్‌గా నంది అవార్డులు కేటాయిస్తే బాగుంటుందని నా ఆలోచన. అలాగే తెలంగాణలో అద్భుతమైన టూరిజం స్పాట్స్ ఉన్నాయి. వాటిని బేస్ చేసుకుని 90 శాతం ఇక్కడే షూటింగ్ చేసే సినిమాలకు నంది అవార్డ్స్‌తో పాటు నగదు ప్రోత్సాహకాలిస్తే తెలంగాణలో టూరిజం పెరిగే అవకాశం ఉంటుంది.' అని అన్నారు.
టీయస్‌ఐఐసీ ఛైర్మన్ గ్యాదరి బాలమల్లు మాట్లాడుతూ...' ప్రతాని రామకృష్ణ ఇస్తోన్న అవార్డ్స్‌కు ప్రభుత్వం తరఫు నుంచి కచ్చితంగా మంచి సపోర్ట్ ఉంటుంది. వారికి అన్ని విధాలుగా అండగా ఉంటాం. విజయేంద్రప్రసాద్ చెప్పిన విషయాన్ని కచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం.' అని అన్నారు. ఈ కార్యక్రమంంలో ప్రసన్న కుమార్, కెయల్‌ఎన్ ప్రసాద్, శంకర్ గౌడ్, అశోక్ గౌడ్, వంశీ , శ్రీశైలం , నటి శుభశ్రీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment