నటుడు ఉదయనిధి స్టాలిన్ కథానాయకుడిగా నటించి, తన రెడ్ జెయింట్ మూవీస్ పతాకంపై నిర్మించిన చిత్రం మామన్నన్. వడివేలు, ఫాహద్ ఫాజిల్, కీర్తి సురేష్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు. మారి సెల్వరాజ్ కథ, దర్శకత్వం బాధ్యతలు నిర్వహించిన ఈ సినిమా గత జూన్ 29వ తేదీన విడుదలవగా విశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న మామన్నన్ 50 రోజులు పూర్తి చేసుకుంది.
మంచి అనుభవాన్ని ఇచ్చింది: కీర్తి సురేశ్
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ గురువారం సాయంత్రం చెన్నైలోని ఓ హోటల్‌లో మామన్నన్ చిత్ర అర్ధ శత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. హీరోయిన్ కీర్తి సురేశ్ మాట్లాడుతూ మామన్నన్ తనకు మంచి అనుభవంగా మిగిలిపోయిందని పేర్కొంది. ఏఆర్ రెహమాన్ సంగీతం చిత్ర విజయానికి ముఖ్య కారణమని తెలిపింది. వడివేలు మాట్లాడుతూ.. ప్రతి సన్నివేశంలోనూ జీవం ఉట్టిపడేలా దర్శకుడు మారి సెల్వరాజ్ చిత్రాన్ని తెరపై ఆవిష్కరించారని పేర్కొన్నారు. తాను ఇంత వరకూ చేసిన హాస్య పాత్రలన్నింటికంటే ఈ చిత్రమే ఎక్కువ పేరు తెచ్చిపెట్టిందని, దీన్ని తాను జీవితాంతం మరిచిపోలేనని అన్నారు.
ఈ విజయం దర్శకుడిదే: ఉదయనిధి స్టాలిన్
సినిమా అనేది నాలుగు రోజుల్లో ముగిసి పోయేది కాదని, ఏళ్ల తరబడి మాట్లాడుకునేదనీ దర్శకుడు మారి సెల్వరాజ్ పేర్కొన్నారు. అందుకే తాను నిజాలను వినే చెవుల కోసం అన్వేషిస్తూనే ఉంటానన్నారు. ఈ విజయం దర్శకుడు మారి సెల్వరాజ్‌దని నటుడు ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్నారు. కథ విన్నప్పుడే మామన్నన్ విజయం సాధిస్తుందనే నమ్మకం కలిగించిందన్నారు. ఈ చిత్రం కోసం యూనిట్ అంతా శ్రమించారన్నారు.
నాలోని అంతర్మధనమే మామన్నన్: ఏఆర్ రెహమాన్
తన తొలి చిత్రం ఆరుకల్ ఒరు కన్నాడీ మంచి విజయాన్ని సాధించిందనీ, చివరి చిత్రమైన మామన్నన్ కూడా విజయం సాధించడం సంతోషంగా ఉందని ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్నారు. గత 20, 30 ఏళ్లుగా తనలోని మదనమే మామన్నన్ చిత్రమని ఏఆర్ రెహమాన్ పేర్కొన్నారు. మామన్నన్ చిత్రంలో ఉదయనిధి స్టాలిన్‌తో వడివేలు బైక్‌లో వెళ్లే సన్నివేశాన్ని చూసిన తరువాత మంచి సంగీతాన్ని అందించాలనే నిర్ణయానికి వచ్చానని ఆయన పేర్కొన్నారు.
చదవండి: అంగరంగ వైభవంగా బ్రహ్మానందం ద్వితీయ కుమారుడు సిద్ధార్థ వివాహం
షారుక్ కోసం ఆ పని చేసేందుకు సిద్ధమైన నయనతార.. రూల్ పక్కన పెట్టేసి మరీ..
Comments
Please login to add a commentAdd a comment