టైటిల్: ఊర్వశివో రాక్షసివో
నటీనటులు: అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్, సునీల్, వెన్నెల కిశోర్, ఆమని, అనీష్ కురువిల్లా తదితరులు
నిర్మాణ సంస్థలు: జీఏ2 పిక్చర్స్, శ్రీ తిరుమల ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్
నిర్మాతలు: తమ్మారెడ్డి భరద్వాజ, ధీరజ్ మొగిలినేని, విజయ్ ఎం
సమర్పణ: అల్లు అరవింద్
దర్శకత్వం: రాకేశ్ శశి
సంగీతం: అచ్చు రాజమణి (మాయారే పాట: అనూప్ రూబెన్స్)
సినిమాటోగ్రఫీ: తన్వీర్
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
విడుదల తేది: నవంబర్ 4, 2022
గౌరవం’సినిమాతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు అల్లు శిరీష్. తొలి సినిమాతోనే నటన పరంగా మంచి మార్కులు వచ్చాయి. ఆ తర్వాత కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం లాంటి విభిన్నమైన కథలను ఎన్నుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నాడు. శీరీష్ నుంచి చివరగా వచ్చిన ‘ఎబిసిడి’ చిత్రం ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన శీరీష్.. రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'ఊర్వశివో రాక్షసివో'తో నేడు(నవంబర్ 4) ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మూడేళ్ల విరామం తర్వాత అల్లు శిరీష్ నటించిన ‘ఊర్వశివో రాక్షసివో' చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
శ్రీకుమార్ అలియాస్ శ్రీ(అల్లు శిరీష్) ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువకుడు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న శ్రీకి పక్క ఆఫీస్‌లో ఉద్యోగం చేస్తున్న సింధూజ అలియాస్ సింధు(అనూ ఇమ్మాన్యుయేల్) అంటే చాలా ఇష్టం. సింధూ..కెరీర్‌లో మంచి స్థాయికి ఎదగాలనే తపన ఉన్న అమ్మాయి. అమెరికాలో చదువుకొని ఇండియా వచ్చి మోడ్రన్ లైఫ్‌ని గడుపుతుంది. ఆమెకి పెళ్లి అంటే నచ్చదు. కానీ శ్రీకుమార్‌ని ఇష్టపడుతుంది. ఇద్దరు కలిసి సహజీవనం చేసేందుకు సిద్ధపడతారు. దీని కోసం శ్రీ తన ఇంటికి దగ్గరలో ఓ ఇల్లుని అద్దెకు తీసుకుంటాడు.
మరోవైపు శ్రీకుమార్‌కి పెళ్లి చేయాలని ఎప్పటి నుంచో సంబంధాలు చూస్తుంటారు అతని తల్లిదండ్రులు (ఆమని, కేదార్ శంకర్). శ్రీ మాత్రం తల్లిదండ్రుల దగ్గర సహజీవనం చేస్తున్న విషయాన్ని దాచి, సింధూని పెళ్లికి ఒప్పించాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ ఆమె అందుకు ఒప్పకోదు. కొడుకు పెళ్లి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న శ్రీ తల్లి ఓ రోజు అనారోగ్యంతో ఆసుపత్రి పాలవుతుంది. ఈ విషయం తెలిసిన తర్వాత శ్రీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? తల్లి కోసం పెళ్లి చేసుకున్నాడా? లేదా ప్రేయసిని దక్కించుకోవడం కోసం సహజీవనాన్ని కొనసాగించాడా? కొడుకు తప్పిపోయాడని శ్రీ పేరెంట్స్ పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేశారు? సహజీవనం విషయాన్ని తల్లిదండ్రులకు తెలియకుండా ఉంచడానికి శ్రీ పడిన కష్టాలేంటి? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
ఎలాంటి గోల్ లేకుండా సాధారణ జీవితాన్ని గడిపే ఓ అమాయకపు యువకుడికి, కెరీర్ ఓరియెంటెడ్ అమ్మాయికి మధ్య ప్రేమకథ ఎలా నడించింది అనేదే ఈ సినిమా కథ. ఈ సినిమా ట్రైలర్ చూస్తేనే యూత్ టార్గెట్‌గా తీసిన మూవీ అని అర్థమవుతుంది. కథనం కూడా అలాగే సాగుతుంది. ప్రతి 10 నిమిషాలకు ఒక రొమాంటి సీన్‌తో ఫుల్ ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుంది.
ప్రస్తుతం చాలా మంది యువతీయువకులు లివింగ్ లైఫ్‌పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అదే పాయింట్‌తో దర్శకుడు రాకేశ్ శశి ‘ఊర్వశివో రాక్షసివో’ చిత్రాన్ని తెరకెక్కించాడు. అయితే ఈ కథలో కొత్తదనం ఏమి ఉండదు.. కానీ ఫుల్ కామెడీ, రొమాంటిక్ సీన్స్‌తో సాగడంతో ఎక్కడా బోర్‌కొట్టినట్లు అనిపించదు. డబుల్ మీనింగ్ డైలాగ్స్‌ని ఓ వర్గం ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు.
ఎలాంటి సాగదీత లేకుండా సినిమా స్ఠార్టింగ్ నుంచే హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ కథ సాగుతుంది. ప్రేమించిన అమ్మాయి.. తను పని చేసే ఆఫీస్‌లోకి రావడం.. తన ప్రేమ విషయాన్ని ఆమెతో చెప్పడానికి హీరో పడే కష్టాలు నవ్వులు పూయిస్తాయి. ఇక సెకండాఫ్ మొత్తం సహజీవనం చుట్టే సాగుతుంది. హీరో హీరోయిన్ మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్, కామెడీ ఆకట్టుకుంటాయి. సహజీవనం ఎపిసోడ్‌ని క్రికెట్ కామెంట్రీతో ముడిపెట్టి చెప్పడంతో కామెడీ బాగా పండింది. అయితే ఈ చిత్రంలో ఎమోషన్స్‌ని కూడా యాడ్ చేశారు కానీ అది అంతగా వర్కౌట్ కాలేదు. హీరోయిన్ పెళ్లి ఎందుకు వద్దనుకుంటుందో అనేదానికి బలమైన కారణాన్ని చూపించలేదు. ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌కి కాస్త ఇబ్బందిగా అనిపించొచ్చు కానీ..యూత్ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు.
ఎవరెలా చేశారంటే..
చాలా కాలం తర్వాత అల్లు శిరీష్ తెరపై కనిపించాడు. గత చిత్రాలతో పోలిస్తే ఇందులో ఆయన నటన చాలా మెరుగుపడింది. మిడిల్ క్లాస్ యువకుడు శ్రీకుమార్ పాత్రలో ఒదిగిపోయాడు. తనదైన కామెడీతో అదరగొట్టేశాడు. మోడ్రన్ అమ్మాయి సింధూ పాత్రకి అనూ ఇమ్మాన్యుయేల్ న్యాయం చేసింది. తన గ్లామర్ ఈ సినిమాకు చాలా ప్లస్ అయింది. శిరీష్, అనూల కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది.
ఇక ఈ సినిమాకు మరో ప్రధాన బలం సునీల్, వెన్నెల కిశోర్‌ల కామెడీ. వీరిద్దరు కలిసి పండించిన కామెడీకి ప్రేక్షకులు పగలబడి నవ్వుతారు. పొసాని కృష్ణమురళి ఒకటి రెండు సీన్స్‌లో కనిపించినా.. తనదైన శైలీ కామెడీతో నవ్వించాడు. హీరో తల్లిగా ఆమని మరోసారి తెరపై తన అనుభవాన్ని చూపించారు.కేదార్ శంకర్, పృథ్వితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. అచ్చు రాజమణి సంగీతం బాగుంది. పాటలు సినిమాకు చాలా ప్లస్ అయ్యాయి. తన్వీర్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లు ఉన్నతంగా ఉన్నాయి.
-అంజి శెట్టి, సాక్షి, వెబ్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment