బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్ ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. ఆయన చాలా నీరసంగా ఉంటున్నారు. ఈ విషయాన్ని ఆయన భార్య, నటి సైరా బాను ఓ ఇంటర్వ్యూలో భాగంగా తెలిపారు. దిలీప్ కుమార్ ఆరోగ్యం గురించి సైరా బాను మాట్లాడుతూ– ‘‘దిలీప్ సాబ్ ఈ మధ్య చాలా నీరసంగా ఉంటున్నారు. ఆయన రోగ నిరోధక శక్తి కూడా చాలా తక్కువగా ఉంది. ఇంట్లో తన గదిలో నుంచి హాలు వరకూ నడవగలుగుతున్నారు. గడుస్తున్న ప్రతీ రోజునీ ఒక అదృష్టంగా భావిస్తున్నాం.
అందుకే ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఆయన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాం. ఏదో అభినందనల కోసమో, అంకితభావం ఉన్న భార్య అనిపించుకోవాలనో ఆయన్ను చూడటంలేదు. ఆయన్ను తాకడం, హత్తుకోవడం నా జీవితంలో జరుగుతున్న గొప్ప విషయాలుగా భావిస్తాను. దిలీప్ సాబ్ అంటే నాకంత ఆరాధన. ఆయనే నా శ్వాస. ఆయన ఆరోగ్యం కోసం అభిమానులందరూ ప్రార్థించండి’’ అని అన్నారు. డిసెంబర్ 11తో దిలీప్ కుమార్‌కి 98 ఏళ్లు వస్తాయి. 1966 అక్టోబర్ 11న దిలీప్ కుమార్, సైరా బాను వివాహం జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment