సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ కన్నడ నటి లీలావతి(85) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమెఇటీవలే ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూనే శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని సీనియర్ నటి సుమలత తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ రోజు ఆమె ఫామ్‌హౌస్‌లో ఆమె పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. శనివారం ఆమె అంత్యక్రియలు నెలమంగళలోని నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
సుమలత తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'లీలావతి మరణవార్త నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె మరణం దక్షిణాది సినీ పరిశ్రమకు తీరని లోటు. ఆరు వందలకు పైగా సినిమాల్లో నటించిన లీలావతి సౌత్‌లో విజయవంతమైన నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె సినిమాలో నాకు కథానాయకిగా నటించే అవకాశం వచ్చింది. ఈ విషాద సమయంలో ఆ భగవంతుడు లీలావతి కుటుంబ సభ్యులకు, అభిమానులకు శక్తిని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను' అంటూ పోస్ట్ చేసింది.
లీలావతి కన్నడ, తమిళం, తెలుగు, మలయాళ భాషల్లో దాదాపు 600 చిత్రాలలో నటించింది. సినీ ఇండస్ట్రీలో ఆమె కెరీర్ ఆరు దశాబ్దాలుగా సాగింది. ఆమెకు 1999-2000లో జీవితకాల సాఫల్యానికి ప్రతిష్టాత్మకమైన డా. రాజ్‌కుమార్ అవార్డు, 2008లో తుమకూరు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌తో సహా అనేక ప్రశంసలను అందుకుంది.
బెల్తంగడిలో జన్మించిన లీలావతి చిన్నతనంలోనే నాటకరంగంపై మక్కువ పెంచుకున్నారు. 1949లో సినీ రంగ ప్రవేశం చేసిన లీలావతి ఆ తర్వాత కన్నడ సినిమాలో ప్రముఖ నటిగా పేరు తెచ్చుకున్నారు. ఆమె కన్నడ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడు అయిన వినోద్ రాజ్‌తో కలిసి జీవించారు. 1949లో శంకర్ సింగ్ దర్శకత్వం వహించిన నాగకన్నికే సినిమాతో అరంగేట్రం చేశారామె.
Comments
Please login to add a commentAdd a comment