
శైలేష్ కొలను, నవాజుద్దీన్ సిద్ధిఖీ, వెంకటేశ్, వెంకట్ బోయనపల్లి2
‘‘నా మొదటి సినిమా(కలియుగ పాండవులు) నుంచి ఇప్పుడు 75వ సినిమా ‘సైంధవ్’ వరకూ నన్ను ఎంతగానో ప్రేమించి, ఆదరించి, అభిమానిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మీ ప్రేమ, అభిమానం, ఆప్యాయత వల్లే ఈ ప్రయాణం సాధ్యపడింది. ఇందుకు ప్రేక్షకులకు, నా అభిమానులకు, చిత్ర పరిశ్రమకు ధన్యవాదాలు’’ అని హీరో వెంకటేశ్ అన్నారు. శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేశ్ లీడ్ రోల్‌లో నటించిన చిత్రం ‘సైంధవ్’.
నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెరెమియా, సారా కీలక పాత్రల్లో నటించారు. నిహారిక ఎంటర్‌టైన్మెంట్స్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ‘సైంధవ్’ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో జనవరి 13న విడుదల కానుంది. ఈ మూవీ టీజర్ లాంచ్ వేడుకలో వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘బలమైన భావోద్వేగాలు, యాక్షన్‌కి అవకాశం ఉన్న కథ ‘సైంధవ్’. కుటుంబ ప్రేక్షకులందరికీ సినిమా నచ్చుతుంది. ఇందులో నన్ను కొత్తగా చూస్తారు.
గతంలో నా సినిమాలు ‘చంటి, కలిసుందాం రా, లక్ష్మి’ సంక్రాంతికి వచ్చి, హిట్ అయ్యాయి. ఇప్పుడు ‘సైంధవ్’ వస్తోంది. సంక్రాంతి రోజు ప్రేక్షకులు ఒక మంచి సినిమా చూడబోతున్నారు’’ అన్నారు. ‘‘ఈ మూవీ అందరికీ నచ్చుతుంది’’ అన్నారు నవాజుద్దీన్ సిద్ధిఖీ. ‘‘వెంకటేశ్‌గారి ప్రతిష్టాత్మక 75వ చిత్రానికి దర్శకత్వం చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు’’ అన్నారు శైలేష్ కొలను. ‘‘వెంకటేశ్‌గారితో సినిమా చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు వెంకట్ బోయనపల్లి.
Comments
Please login to add a commentAdd a comment