తమిళ సినిమా: చిత్ర పరిశ్రమను విచిత్ర పరిశ్రమ అంటారు. ఇక్కడ లక్కు కిక్కు కంటే కూడా మరొకటి ఉంటుంది. అదేంటో దర్శకుడు, నటి నయనతార భర్త విగ్నేష్ శివన్‌ను చూస్తే తెలుస్తుంది. పోడాపోడి చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైనా నానుమ్ రౌడీదాన్ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత పలు చిత్రాలు చేసినా, అవి ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేదు. తాజాగా నటుడు అజిత్‌ను డైరెక్ట్ చేసే అవకాశం వరించింది. అజిత్ చిత్రం తుణివు ఇటీవల విడుదలై సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది.
తదుపరి విగ్నేష్ శివన్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమయ్యారు. దీనిని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించనుంది. అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నట్లు సమాచారం. చిత్రం ఫిబ్రవరి మొదటి వారంలో సెట్‌పైకి వెళ్లనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. చిత్రం నుంచి దర్శకుడు విగ్నేష్ శివన్ వైదొలిగినట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అందుకు కారణం విగ్నేశ్ శివన్ చెప్పిన కథ నటుడు అజిత్‌కు, లైకా సంస్థకు సంతృప్తినివ్వక పోవడమేనని సమాచారం.
కథలో కొన్ని మార్పులు చేయాలని సంస్థ చెప్పినా అందుకు విగ్నేష్ శివన్ నిరాకరించినట్లు టాక్. దీంతో నటి నయనతార రంగంలోకి దిగి ఇరువురి మధ్య సంధి కుదిర్చే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయిందని ప్రచారం జరుగుతోంది. అజిత్ కన్విన్స్ అయినా లైకా ప్రొడక్షన్స్ ససేమిరా అన్నట్లు సమాచారం. ప్రస్తుతం అజిత్ 62వ చిత్రానికి మగిళ్ తిరుమేణి దర్శకత్వం వహించనున్నట్లు తాజా సమాచారం. ఈయన ఇంతకుముందు మిగామన్, తడం, కలగతలైవన్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. కాగా విజయ్ కోసం తయారు చేసిన కథను అజిత్‌తో చేయడానికి సిద్ధమవుతున్నట్లు టాక్.
Comments
Please login to add a commentAdd a comment