
సునీల్ నారంగ్, విజయ్ దేవరకొండ, మారియా, శివకార్తికేయన్, అనుదీప్, హరీష్ శంకర్, జాన్వీ
‘‘మాకు సినిమాయే జీవితం.. ఎంత ప్రేమించి చేస్తామో మాకు తెలుసు. అలాంటిది ఓ రోజు ఓ సినిమా వేదికపై శివ కార్తికేయన్‌గారు ఏడుస్తూ మాట్లాడటంతో నాకు చాలా బాధేసింది. అప్పటి నుంచి ఆయన నాకు ఓ బ్రదర్ అనే ఫీలింగ్ కలిగింది’’ అని హీరో విజయ్ దేవరకొండ అన్నారు. శివ కార్తికేయన్, మారియా ర్యాబోషప్క జంటగా అనుదీప్ కేవీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రిన్స్’. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో సోనాలి నారంగ్ సమర్పణలో సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, పుస్కూర్ రామ్‌మోహన్ రావు నిర్మించారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ–‘‘శివ కార్తికేయన్ అన్నని ఈ రోజే తొలిసారి కలిశాను. ఆయన ప్రయాణం నాకు నచ్చింది. ఎప్పుడైనా ఆయనకి నేను తోడుంటే బాగుంటుందనిపించింది.. ఆ అవకాశం ఇంత త్వరగా ‘ప్రిన్స్’ రూపంలో వచ్చింది. సురేశ్ ప్రొడక్షన్స్ (పెళ్లి చూపులు), ఏషియన్ సినిమాస్ (అర్జున్ రెడ్డి) నా కెరీర్‌లో చాలా ముఖ్యమైన పాత్ర పోషించాయి. ‘ప్రిన్స్’ ట్రైలర్ చూసి చాలా ఎంజాయ్ చేశాను. అందర్నీ నవ్వించే అనుదీప్‌కి ఈ సినిమా బిగ్ బ్లాక్‌బస్టర్ ఇవ్వాలి’’ అన్నారు.
డైరెక్టర్ హరీష్ శంకర్ మాట్లాడుతూ–‘‘మధ్యతరగతి జీవితాలను అనుదీప్ క్షుణ్ణంగా చదివాడని ‘జాతిరత్నాలు’ చూసిన తర్వాత నాకు అనిపించింది. ముళ్లపూడి వెంకటరమణ, జంధ్యాల, బాపుగార్లు.. మిడిల్ క్లాస్ లైఫ్‌లను బాగా అర్థం చేసుకుని వినోదాన్ని పండించారు. అనుదీప్ కూడా సీరియస్‌గా ఉంటూ నవ్వులు పంచుతాడు. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ కావాలి’’ అన్నారు. ‘‘ఈ కథ శివ కార్తికేయన్‌గారి కోసమే రాశా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ చూడాల్సిన సినిమా ఇది’’ అన్నారు అనుదీప్. కెమెరామేన్ మనోజ్ పరమహంస, సంగీత దర్శకుడు తమన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment