నటుడు స్టార్ హీరో విజయ్ రాజకీయాల వైపు శరవేగంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. చాలా కాలంగానే అందుకు గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వస్తున్నారని చెప్పవచ్చు. లక్షలాదిమంది విజయ్ అభిమానులు ఆ పనిలోనే నిమగ్నమయ్యారు. ఇదంతా విజయ్ మక్కళ్ సంఘం ప్రధాన కార్యదర్శి, పుదుచ్చేరి శాసన సభ్యుడు బస్సీ సారథ్యంలో జరుగుతోంది. ఆ మధ్య సంస్థాగత ఎన్నికల్లో విజయ్ అనుమతితో పోటీ చేసి ఆయన పేరుతో ప్రచారం చేసి పలువురు అభిమానులు గెలిచిన విషయం తెలిసిందే.
అదే విజయ్‌కి రాజకీయ రంగ ప్రవేశంపై నమ్మకాన్ని పెంచిందని చెప్పవచ్చు. ఇక ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా 10 పరీక్షల్లో అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను జిల్లాకు ముగ్గురు చొప్పున ఎంపిక చేసి వారికి నగదు బహుమతి కార్యక్రమాన్ని విజయ్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో నోటుకు ఓటు సంస్కృతిని నిలువరించాలని వారికి విజయ్ హిత బోధ చేసినప్పుడే ఆయన రాజకీయ రంగ ప్రవేశం షురూ అయ్యిందనే ప్రచారం హోరెత్తింది.
కాగా ఇటీవల నటుడు విజయ్ తాను నటిస్తున్న లియో చిత్ర షూటింగ్‌ను పూర్తి చేసి విశ్రాంతి కోసం లండన్‌కు వెళ్లారు. ఈ పరిస్థితుల్లో విజయ్ మక్కళ్ సంఘం ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఈనెల 5, 6 తేదీల్లో సంఘం న్యాయవాదుల సమావేశం జరగనుంది. స్థానిక పనైయూర్‌లోని విజయ్ కార్యాలయంలో ఈ సమావేశం జరగనున్నట్లు బస్సీ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల ప్రజా సమస్యలపై చట్టపరమైన అంశాల గురించి చర్చించనున్నట్లు, 6వ తేదీన కేరళా విజయ్ అభిమానులతో సమావేశం కానున్నట్లు అందులో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment