టైటిల్: వినరో భాగ్యము విష్ణు కథ
నటీనటులు: కిరణ్ అబ్బవరం, కశ్మీరా పరదేశ, మురళీ శర్మ,ప్రవీణ్ తదితరులు
నిర్మాణ సంస్థ: జీఏ2 పిక్చర్స్
నిర్మాత: బన్నీ వాసు
సమర్పణ: అల్లు అరవింద్
దర్శకత్వం: మురళీ కిశోర్ అబ్బూరు
సంగీతం: చైతన్ భరద్వాజ్
ఎడిటర్: మార్తండ్ కె వెంకటేశ్
విడుదల తేది: ఫిబ్రవరి 18, 2023
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఈ మధ్యే ‘మీకు బాగా కావాల్సిన వాడిని’అంటూ ప్రేక్షకులను పలకరించిన కిరణ్.. ఇప్పుడు వినరో భాగ్యము విష్ణు కథ అంటూ మరోసారి బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వచ్చేశాడు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌కు మంచి స్పందన లభించింది. దానికి తోడు మూవీ ప్రమోషన్స్‌ని కూడా గ్రాండ్‌గా చేయడంతో ‘వినరో..’పై హైప్ క్రియేట్ అయింది. మంచి అంచాల మధ్య మహా శివరాత్రి సందర్భంగా శనివారం (ఫిబ్రవరి 18) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
తిరుపతికి చెందిన విష్ణు(కిరణ్ అబ్బవరం)ఓ లైబ్రేరియన్. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోవడంతో తాత(శుభలేఖ సుధాకర్) పెంపకంలో పెరుగుతాడు.పొరుగు వాళ్లకు చేతనైనంత సహాయం చేసే విష్ణు జీవితంలోకి నైబర్ నంబర్ అనే కాన్సెప్ట్‌తో దర్శన (కాశ్మీర పరదేశి) ప్రవేశిస్తుంది. ఆమె ఒక యూట్యూబర్. ట్రెండింగ్ వీడియోలు చేసి సెలెబ్రిటీ అయిపోవాలనుకుంటుంది. అందులో భాగంగా నైబర్ నంబర కాన్సెప్ట్‌తో వీడియో చేయాలనుకుంటుంది. తన ముబైల్ నంబర్‌లోని చివరి అంకెకు అటు, ఇటు ఉండే నంబర్లతో ఫోన్ చేయగా..ఒకవైపు విష్ణు, మరోవైపు శర్మ(మురళీ శర్మ) పరిచయం అవుతారు.
వీరిద్దరితో కలిసి వీడియోలు చేసే క్రమంలో విష్ణు, దర్శన ప్రేమలో పడతారు. కట్ చేస్తే.. ఒక రోజు శర్మను తుపాకీతో కాల్చి చంపుతుంది దర్శన.అసలు శర్మను దర్శన ఎందుకు చంపింది? నిజంగానే అతను మరణించాడా? శర్మ నేపథ్యం ఏంటి? మంత్రి పదవి కోసం కుట్రలు చేస్తున్న ఓ ఎమ్మెల్యే('కె.జి.యఫ్' లక్కీ)కి, శర్మకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి జైలుకు వెళితే విష్ణు ఏం చేశాడు? నిందితులను పట్టుకోవడానికి నైబర్ నంబర్ కాస్పెప్ట్ ఎలా ఉపయోగపడింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
మన మొబైల్ నంబర్ నుంచి పక్క నంబర్‌కి కాల్ చేస్తే ఎలా ఉంటుంది? వారెవరు..ఎక్కడ ఉంటారో..ఎం చేస్తారో తెలియదు. కానీ ఒక్కసారి కాల్ చేసి మాట్లాడి ఫ్రెండ్‌షిప్ చేస్తే.. వినడానికే కొత్తగా, గమ్మత్తుగా ఉంది కదా. ఇదే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సినిమా వినరో భాగ్యము విష్ణు కథ. దర్శకుడు మురళీ కిశోర్ చాలా కొత్త పాయింట్‌ని ఎంచుకొని అంతే కొత్తగా తెరపై చూపించాడు. కొన్ని సీన్లు సినిమాటిక్‌గా ఉన్నా.. ఫ్లోలో ఓకే అనిపిస్తాయి. ఎన్‌ఐఏ అధికారులు ఓ టెర్రరిస్టు గ్రూప్‌ని పట్టుకోవడం కోసం ప్రయత్నించడం..వారు పారిపోయి ఒకచోట దాక్కోవడం..వారి దగ్గరకు హీరో వెళ్లడం..ఇలా సినిమా ప్రారంభమే సీరియస్‌గా ఉంటుంది. ఆ తర్వాత కాసేపటికీ సినిమా అంతా లవ్‌స్టోరీగా మారిపోతుంది. నైబర్ నెంబర్ కాన్సెప్ట్‌తో హీరో హీరోయిన్లు కలిసిన తర్వాత వచ్చే కామెడీ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా మురళీ శర్మ హీరోయిన్‌తో కలిసి వేసే స్టెప్పులు..వారిద్దరి రిలేషన్‌పై హీరో వేసే పంచులు నవ్వులు పూయిస్తాయి.
ఇలా ఒకవైపు సినిమాను సరదాగా నడిపిస్తూ..మరోవైపు శర్మను హత్య చేయడానికి ఎమ్మెల్యే మనుషులు ప్రయత్నించడం..హీరోయిన్ పాత్రపై అనుమానం కలిగిస్తూ ప్రేక్షకులు అయోమయానికి గురైయ్యేలా చేశాడు దర్శకుడు. అసలు శర్మ ఎవరు? అతన్ని ఎమ్మెల్యే మనుషులు ఎందుకు చంపాలనుకుంటున్నారు? అనేది చివరి వరకు చెప్పకుండా క్యూరియాసిటీని పెంచేశాడు. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే అదిరిపోతుంది. సెకండాఫ్‌లో కథనం రొటీన్‌గా, కాస్త సిల్లీగా సాగుతుంది. నైబర్ కాన్సెప్ట్ విదేశాల వరకు చేరి అక్కడ నిందితుడిని పట్టుకోవడం..అనేది కాస్త సినిమాటిక్ అనిపించినా..చివర్లో దానికి క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. సినిమా ప్రారంభం కూడా ఓవర్‌గా అనిపించినా..క్లైమాక్స్‌లో వచ్చే టిస్ట్‌తో అది కూడా ఓకే అనిపిస్తుంది.‘వినరో భాగ్యము విష్ణు కథ’ స్టోరీ టైటిల్ అంత పెద్దది కాకపోయినా..ప్రేక్షకులను మాత్రం అలరిస్తుంది.
ఎవరెలా చేశారంటే..
లైబ్రేరియన్ విష్ణు పాత్రకి కిరణ్ అబ్బవరం న్యాయం చేశాడు. పక్కింటి మంచి కుర్రాడిలా చక్కగా నటించాడు.అయితే కిరణ్ ఈ తరహా పాత్ర చేయడం కొత్తేమి కాదు.గత సినిమాలలో మాదిరిదే ఇందులో కూడా సాదాసీదాగా కనిపిస్తాడు.ఎమోషనల్ సీన్స్ బాగానే చేశాడు. డ్యాన్స్, ఫైట్స్ విషయంలో ఇంకాస్త శ్రద్ద పెడితే బాగుంటుందేమో. దర్శనగా కాశ్మీర పరదేశీ మెప్పించింది. తెరపై అందంగా కనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో మురళీ శర్మ పాత్ర అందరికి గుర్తిండిపోతుంది. గత సినిమాలకు పూర్తి భిన్నంగా ఆయన పాత్ర ఉంటుంది. ఆయన నటన..వేసిన స్టెప్పులు ప్రతీది నవ్విస్తుంది. హీరో తాతగా శుభలేక సుధాకర్, హీరోయిన్ తల్లిదండ్రులుగా దేవీ ప్రసాద్, ఆమని.. టెర్రరిస్ట్ రాజన్‌గా శరత్ లోహితన్యతో పాటు మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర నటించారు.
ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం చైతన్ భరద్వాజ్ సంగీతం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. కొన్ని చోట్ల కథ కంటే నేపథ్య సంగీతమే గుర్తుండిపోతాయి. పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రాఫర్, ఎడిటర్‌ల పనితీరు బాగుంది.డైలాగ్స్ చప్పట్లు కొట్టిస్తాయి. కానీ కంటెంట్‌తో సంబంధం లేకుండా అవసరానికి మించిన డైలాగ్స్ హీరో చేత చెప్పించారనే ఫీలింగ్ కలుగుతుంది. జీఏ2 పిక్చర్స్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నతంగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment