ముంబై: యోగా తన జీవితంలో భాగమని, గర్భవతిగా ఉన్న సమయంలో కూడా ఆసనాలు వేయడం సంతోషంగా ఉందన్నారు బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ. అయితే వైద్యుల సూచనలు, సలహాలు పాటించడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి- అనుష్క దంపతులు త్వరలోనే తమ తొలి సంతానానికి జన్మనివ్వనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అమ్మదనాన్ని ఆస్వాదిస్తూ ఎప్పటికప్పుడు తన ఫొటోలతో పాటు ఆరోగ్య వివరాలు, గర్భవతిగా ఉన్న సమయంలో తీసుకుంటున్న జాగ్రత్తల గురించి అనుష్క సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. (చదవండి: కోహ్లి కెప్టెన్సీకి వీడ్కోలు చెప్పాలి..)
ఈ నేపథ్యంలో భర్త కోహ్లి సాయంతో శీర్షాసనం వేసిన పాత ఫొటోను తాజాగా ఇన్‌స్టాలో షేర్ చేసిన ఆమె.. ‘‘అన్నింటికంటే ఇది అత్యంత కఠినమైన వ్యాయామం. యోగాకు నా జీవితంలో ముఖ్యస్థానం ఉంది. గర్భవతి కావడానికి ముందు ఎలాంటి ఆసనాలు వేశానో, ఇప్పుడు కూడా వాటిని ప్రాక్టీసు చేయవచ్చని మా డాక్టర్ చెప్పారు. అయితే ఇందుకు మన శరీరం సహకరించాలి. అంతేకాదు సన్నిహితుల అండ కూడా ఉండాలి. ఎన్నో ఏళ్లుగా నేను శీర్షానం వేస్తున్నా.
ఈసారి గోడతో పాటు నాకెల్లప్పుడూ అండగా ఉండే భర్త సాయం తీసుకున్నా. తను నన్ను బ్యాలెన్స్ చేయడంతో పాటుగా మరింత సురక్షితంగా ఉండేలా చేశాడు. ఇదంతా నా యోగా టీచర్ ఎఫా ష్రోప్ ఆధ్వర్యంలో జరిగింది. తను వీడియోకాల్‌లో ఈ సెషన్ నిర్వహించారు. గర్భం దాల్చిన తర్వాత కూడా యోగా ప్రాక్టీసు చేయగలుగుతున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది’’ అని చెప్పుకొచ్చారు. కాగా కోహ్లి ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. మూడు వన్డేలు, టీ20లు, తొలి టెస్టు ముగిసిన తర్వాత పితృత్వ సెలవుపై అతడు భారత్‌కు తిరిగిరానున్నాడు. ప్రసవ సమయంలో అనుష్క దగ్గర ఉండేందుకు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment