సాక్షి, చెన్నై: చిత్రను హేమనాథ్ కొట్టి చంపేశాడని ఆమె తల్లి విజయ ఆరోపించారు. సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు. పోస్టుమార్టం అనంతరం గురువారం సాయంత్రం అభిమానుల కన్నీటిసంద్రం నడుమ బుల్లి తెర నటి చిత్ర భౌతికకాయానికి బీసెంట్ నగర్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిగాయి. చిత్ర బలవన్మరణం ఓ మిస్టరీగా మారింది. ఆమె ముఖంపై ఉన్న గాయాలు, ప్రతిరోజూ తిరువాన్మియూరులోని ఇంటి నుంచి షూటింగ్‌కు వెళ్లిన చిత్ర, నాలుగు రోజులుగా హోటల్‌లో బసచేయడం అనుమానాలకు దారితీశాయి. రెండు కుటుంబాల పెద్దల అంగీకారంతో నిశ్చితార్థం జరిగినా, పెళ్లికి ముహూర్తం కుదిర్చినా, హేమనాథ్‌ను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో అన్న ప్రశ్న తప్పడం లేదు.
దీంతో రెండవ రోజుగా హేమనాథ్ వద్ద తీవ్ర విచారణ సాగుతోంది. పూందమల్లి అసిస్టెంట్ కమిషనర్ సుదర్శనం నేతృత్వంలోని బృందం ఈ కేసుపై ప్రత్యేక దృష్టి పెట్టింది. చిత్రతో సన్నిహితంగా ఉన్న నటీ నటులు, స్నేహితుల వద్ద, పాండియన్ స్టోర్స్ యూనిట్‌ను విచారించేందుకు నిర్ణయించారు. పోస్టుమార్టంలో చిత్రది ఆత్మహత్యే అని తేలినట్టు సమాచారం. ఆత్మహత్యగా తేలినా, ఆమె మరణం వెనుక బలమైన కారణం ఉండొచ్చన్న కోణంలో దర్యాప్తు వేగం పెంచారు. ఈ పరిస్థితుల్లో హేమనాథ్‌పై చిత్ర తల్లి విజయ తీవ్ర ఆరోపణలు చేశారు. చదవండి: (ప్రముఖ నటి వీజే చిత్ర ఆత్మహత్య)
భర్తతో చిత్ర(ఫైల్), మీడియాతో తల్లి విజయ
చంపేశాడు..
నిశ్చితార్థం అయ్యే వరకు హేమనాథ్ పద్ధతిగానే ఉన్నాడని, ఆ తర్వాత అతడి నిజస్వరూపం బయటపడిందని చిత్ర తల్లి విజయ ఆరోపించారు. వారిద్దరి మధ్య అభిప్రాయభేదాలు బయలు దేరినట్టుందని, చిత్ర ఏ విషయాన్ని తమ దృష్టికి తీసుకు రాలేదని పేర్కొన్నారు. చిత్ర ఆత్మహత్య చేసుకునే పిరికిది మాత్రం కాదన్నారు. హేమనాథ్ ఆమెను కొట్టి చంపేసినట్టున్నాడని, సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు. చిత్ర స్నేహితురాలు, నటి శరణ్య పేర్కొంటూ తామిద్దరం మంచి మిత్రులుగా ఉన్నట్టు, ఎప్పుడు వ్యక్తిగత విషయాలను తనతో పంచుకోలేదన్నారు. ఆర్థికపరంగా ఏదో సమస్యలో ఆమె ఉన్నట్టు గుర్తించానని, ఇందుకు కారణాలు తనకు తెలియదని పేర్కొన్నారు. పాండియన్ స్టోర్ ధారావాహికలో కొన్ని సన్నివేశాల విషయంగా చిత్రతో హేమనాథ్ గొడవపడ్డట్టు సమాచారం. చిత్ర మరణించిన హోటల్‌కు ఓ రాజకీయ ప్రముఖుడి కారు వచ్చి వెళ్లినట్టుగా కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది.
కన్నీటి వీడ్కోలు....
చిత్ర మృతదేహానికి కీల్పాకం ఆస్పత్రిలో పోస్టుమార్టం జరిగింది. అనంతరం ఆమె మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. మార్చురీ వద్దకు పెద్ద ఎత్తున అభిమానులు తరలిరావడంతో వారిని కట్టడి చేయడానికి పోలీసులు శ్రమించారు. అంబులెన్స్‌లో ఆమె మృతదేహాన్ని కోట్టూరుపురానికి తరలించారు. అభిమానుల సందర్శనార్థం ఉంచారు. బుల్లి తెరకు చెందిన సహచర నటీ నటులు, టెక్నీషియన్లు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ఆమె భౌతికకాయానికి నివాళులర్పించారు. సాయంత్రం ఊరేగింపుగా, అభిమానుల కన్నీటి సంద్రం నడుమ బీసెంట్ నగర్ శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. అక్కడ సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు జరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment