
Yami Gautam Joins Hands With NGOs To Help Rape Survivors: బాలీవుడ్ ముద్దుగుమ్మ యామీ గౌతమ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. నితిన్ సరసన కొరియర్ బాయ్ కల్యాణ్, గౌరవం, నువ్విలా తదితర చిత్రాల్లో నటించి టాలీవుడ్ ఆడియెన్స్‌కు చేరువైంది. అయితే ఆశించినంత పేరు ప్రఖ్యాతలు సంపాదించలేకపోయింది. అందుకే మళ్లీ బాలీవుడ్లోనే తనను తాను నిరూపించుకుంటోంది. అయితే తాజాగా ఈ భామ లైంగిక వేధింపులకు గురైన బాధితులకు మద్దతు తెలిపింది. అలాంటి వారికి పునరావాసం కల్పించడానికి మజ్లిస్, పారి పీపుల్ ఎగైనెస్ట్ రేప్ ఇన్ ఇండియా అనే రెండు ఎన్జీవోలతో కలిసి పనిచేయనుంది.
'లైంగిక వేధింపుల బాధితుల పునరావాసానికి కృషి చేస్తున్న రెండు ఎన్జీవోలతో నేను కలిసి పనిచేయబోతున్నాని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. చాలా గర్వంగా కూడా ఉంది. మహిళల భద్రత సమస్యలపై పనిచేయాల్సిన అవసరం ఎంతో ఉంది. భవిష్యత్తులో అన్ని వర్గాల మహిళలను రక్షించడానికి, వారికి మెరుగైన వనరులను సేకరించడంలో సహాయపడేందుకు నేను మరింత సహకారం అందించాలనుకుంటున్నాను.' అని యామీ పేర్కొంది.
ఇదిలా ఉంటే యామీ గౌతమ్ నటించిన తాజా చిత్రం 'ఏ థర్స్డే'. ఇందులో తన నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రంలో యామీ అత్యాచార బాధితురాలి పాత్రను పోషించి ప్రేక్షకులను మెప్పించింది. అలాగే లైంగిక వేధింపులకు గురైన బాధితుల పునరావాసం కోసం అందుబాటులో ఉన్న ప్రస్తుత మౌలిక సదుపాయాల గురించి మనందరం ఆలోచింపజేసింది. ఇప్పుడు నిజ జీవితంలో లైంగిక వేధింపుల బాధితుల కోసం తనవంతు సహకారం అందించడం నిజంగా మెచ్చుకోదగ్గ విషయమే.