Youtube’s First One Billion Song Gangnam Style Completes 9 Years- Sakshi
Sakshi News home page

Gangnam Style: పాట వచ్చి తొమ్మిదేళ్లు.. అయినా ఊపు తగ్గలేదు

Published Thu, Jul 15 2021 2:30 PM | Last Updated on Thu, Jul 15 2021 4:31 PM

YouTube First Billion Song Gangnam Style Completed Nine Years - Sakshi

ఎంటర్​టైన్​మెంట్​ ఎల్లలు లేనిది. భాష తెలియకపోయినా.. కంటెంట్​ను ఆస్వాదించడమే అందరికీ తెలిసింది. కానీ, ఒక పాటను అంతలా ఆదరించడం.. ఆస్వాదించడం కనిపించింది అప్పుడే. ఆ పాట అతని జీవితాన్ని మలుపు తిప్పింది. కే-పాప్‌ సత్తా ఏంటో ప్రపంచానికి తెలియజేసింది. హుషారెత్తించే మ్యూజిక్‌తో గ్లోబ్‌ మొత్తాన్ని చిందులేయించింది. యూట్యూబ్​లో తొలిసారి మిలియన్​లైకులతో గిన్నిస్‌ బుక్‌ రికార్డు.. అంతకు మించి ఫస్ట్​ బిలియన్​ వ్యూస్​ పూర్తి చేసుకున్న తొలి ఘనతకు దక్కించుకుంది గంగ్నమ్​ స్టైల్. ఇవాళ్టికి ఈ సెన్సేషన్​ సాంగ్​ రిలీజ్​ అయ్యి సరిగ్గా తొమ్మిదేళ్లు పూర్తయ్యింది. 

సాక్షి, వెబ్‌డెస్క్‌: కొరియా పాప్​సాంగ్ గంగ్నమ్​ స్టైల్​.. జులై 12న టీజర్​ రిలీజ్ అయ్యింది. ఎలాంటి అంచనాలు లేకుండా జులై 15న ఆడియోతో పాటు ఒకేసారి యూట్యూబ్​లో అప్​లోడ్​ అయ్యింది. అప్పటికే సౌత్ కొరియాలో సింగర్‌ సై(పార్క్​ జెయ్​ సాంగ్)కు కొద్దిపాటి ఫేమ్​ ఉంది. అయితే రిలీజ్​ తర్వాత పాటకు మిక్స్​డ్​ రివ్యూస్​ దక్కాయి. కానీ, నెమ్మదిగా గంగ్నమ్‌ స్టైల్‌ మత్తు గ్లోబ్‌ మొత్తానికి ఎక్కేసింది. సిగ్గుపడే మగవాళ్ల నోట సైతం ‘సెక్సీ లేడీ’ అనే పదం వచ్చేలా చేసి.. హుషారెత్తించింది ఈ పాట.


డబుల్‌ మీనింగ్‌, కానీ.. 
‘ఒప్ప​ గంగ్నమ్​ స్టైల్..’ గగ్నమ్​ అనేది సౌత్​ కొరియాలో ఒక జిల్లా. కొరియన్‌ పాప్‌ సింగర్‌ సై పుట్టి, పెరిగింది అక్కడే. అందుకే అక్కడి ఆడవాళ్ల లైఫ్​ స్టైల్​ గురించి చెప్పడానికే ఆ ఆల్బమ్​ను కంపోజ్ చేశాడు. ఒప్ప​ అంటే.. పెద్దన్న, తోపు అనే అర్థాలు వస్తాయి. అక్కడి ఆడవాళ్లను, ముఖ్యంగా తన కంటికి నచ్చిన అమ్మాయిని ఇంప్రెస్​చేసేందుకు చేసే ప్రయత్నాల్ని.. తన విరహా వేదనను వివరిస్తూ సాగే పాట అది. అందుకే అక్కడి ఉన్నతవర్గాలకు చెందిన ఆడవాళ్లకు ఆ పాటను అంకితం చేశాడు. అయితే ఆ పాట లిరిక్స్‌ పక్కా డబుల్‌ మీనింగ్‌. విజువల్‌లో అది స్పష్టంగా కనిపిస్తుంది కూడా. కానీ, అర్థాన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేకుండానే.. దానిని సూపర్‌ హిట్‌ చేసేశారు జనాలు. అప్పటిదాకా హిందీ, ఇంగ్లీష్, డీజే రీమిక్స్​ సాంగ్స్​తో హోరెత్తిన న్యూఇయర్​ వేడుకల్లో కొత్త జోష్​ నింపింది గగ్నమ్​ స్టైల్​. ముఖ్యంగా గుర్రపు స్వారీ స్టెప్పులకు ప్రపంచం మొత్తం ఫిదా అయ్యింది.

30 దేశాల్లో ఛార్ట్‌బస్టర్​
దక్షిణ కొరియా వయా అమెరికా నుంచి ప్రపంచం మొత్తం గంగ్నమ్​ స్టైల్​ పాకింది. రిలీజ్​ అయిన అన్ని దేశాల్లోనూ ఈ పాట పెద్ద హిట్‌ అయ్యింది. గుర్రపుస్వారీ డ్యాన్స్​ను ప్రపంచం మొత్తం ఆస్వాదించింది. కొరియా పాప్ మ్యూజిక్​ సత్తా ఏంటో ఆ టైంలోనే చాటిన ఈ సాంగ్​.. చాలామందికి ఇది కొరియన్​ ఆల్బమ్​ అని తెలియకుండానే ఎక్కేసింది. పిల్లల దగ్గరి నుంచి పెద్దల దాకా, సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా అందరినీ ఊపేసింది. అప్పటి బ్రిటన్​ ప్రధాని డేవిడ్​ కామెరూన్ సైతం స్టెప్పులేయగా, అప్పటి యూఎన్​ఏ సెక్రటరీ బాన్​ కీ మూన్​ ఐక్యత కోసం ఈ పాటను ప్రచార గీతంగా ఉపయోగించాలని పిలుపు ఇచ్చారంటే అతిశయోక్తి కాదు. అమెరికా మాజీ ప్రెసిడెంట్‌ బరాక్‌ ఒబామా ఆ టైంలో.. ‘‘కొరియన్ వేవ్‌లో ప్రపంచమంతా కొట్టుకుపోతోంద’ని సరదాగా వ్యాఖ్యానించాడు. జకోవిచ్, క్రిస్​ గేల్, విరాట్ కోహ్లీ ఇలా.. ఇలా ఆటగాళ్లు, మరెందరో స్టార్లు సైతం చిందులేశారు.


సాంగ్‌ ఆఫ్‌ యూట్యూబ్‌
కొరియా పాప్‌ సింగర్‌ పార్క్​ జెయ్​ సాంగ్​(సై)(43), యూ జంగ్ హ్యుంగ్​ రాసిన సాంగ్​. మ్యూజిక్ కూడా వాళ్లదే. చో సూ హ్యున్​ డైరెక్షన్. గుర్రపు స్వారీ, కంగారు, పాండా స్టెప్పులను కలగలిపి లీ జు సన్​స్టెప్పులు కంపోజ్‌ చేశాడు. కొరియన్​ చెస్​ గేమ్ జంగ్గీ తరహాలో మూమెంట్స్.. ఆకట్టుకునేలా తీర్చిదిద్దాడు. ఇక ఈ పాటలో బుడ్డోడు వాంగ్ మిన్​వూ, నటుడు యూ జయ్​ సుక్​, నోహ్​ హోంగ్​ హుల్​, ట్రైన్‌లో కనిపించే నటి హ్యునా.. ఇలా అందరూ కలిసి పాటను రిచ్‌గా మార్చేశారు.  మొదటిరోజు ఐదు లక్షల వ్యూస్​ వచ్చాయి.

సౌత్ కొరియా గావోన్ ఛార్ట్​ నుంచి ఆగష్టు నాటికి యూట్యూబ్​ టాప్​ 100 లిస్ట్​కి అటుపై బిల్​బోర్డ్ హాట్​ 100 కి చేరింది. సెప్టెంబర్​ నాటికి కేవలం ఐదు మిలియన్ల మార్క్​కు చేరింది. కానీ, ఆ తర్వాత విధ్వంసం మొదలైంది. డిసెంబర్​ 21 నాటికి గంగ్నమ్​ స్టైల్​ బిలియన్​ మార్క్​ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం 4 బిలియన్ల వ్యూస్‌కి పైగా.. ఓవరాల్‌ టాప్‌ పొజిషన్‌ సాంగ్‌ లిస్ట్‌లో ఎనిమిదో పొజిషన్​లో కొనసాగుతోంది గంగ్నమ్​స్టైల్​. పేరడీలు, మిగతా వెర్షన్​లు ఇవన్నీ లెక్కేస్తే ప్రస్తుతం టాప్‌ పొజిషన్‌లో ఉన్న డెస్​పాసిటోను ఎనిమిదేళ్ల క్రితమే గంగ్నమ్‌ స్టైల్‌ దాటేసినట్లే లెక్క. 


సై ఏం చేస్తున్నాడు
‘సై సిక్స్​రూల్స్’​ పేరుతో రిలీజ్​ చేసిన ఆల్బమ్​లో మొదటి పాటే గంగ్నమ్​ స్టైల్​. 2012లో సై ఒక వైరల్​ స్టార్. కానీ, ఆ ఫేమ్‌ను సై కొనసాగించలేకపోయాడు. కారణం.. సై మిగతా పాప్​ సింగర్స్​లాగా కాదు. అభిమానం ఎక్కడుంటే.. వెతుక్కుంటూ వెళ్లి మరీ ఉచితంగా ప్రదర్శనలిచ్చేవాడు. బ్రాండ్లు, ప్రమోషన్‌, సంపాదన కోసం ఏనాడూ పెద్దగా ఆలోచించేవాడు కాదు. గంగ్నమ్​స్టైల్​ తర్వాత సైకి దక్కిన పాపులారిటీతో ఒక గ్లోబల్ సెలబ్రిటీగా మారిపోయే అవకాశం దక్కినా.. దానికి ఆయన మొగ్గు చూపించలేదు.


ఆ తర్వాత నాలుగైదు పాప్​ సాంగ్స్​ కంపోజ్​ చేసినప్పటికీ.. తర్వాత కొత్త టాలెంట్​ను ఎంకరేజ్​ చేసే ఉద్దేశంతో రియాలిటీ షోలను నిర్వహిస్తున్నాడు. పీ నేషన్​ పేరుతో కంపెనీ స్థాపించి..కొత్తవాళ్లకు అవకాశం ఇస్తున్నాడు. మామూలుగా సై(43) ప్లేస్​లో వేరే ఎవరు ఉన్నా.. ప్రదర్శనల కోసం, యూట్యూబ్​ రికార్డుల కోసం, డబ్బు కోసం పాకులాడేవాళ్లేమో!.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement