మల్యాల(చొప్పదండి): ఎండిన డొక్కను అడిగితే.. గంగవ్వ పేరు చెబుతుంది. పుట్టీపుట్టగానే తల్లి ఒడికి దూరమైంది. చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకుని వారి ప్రేమకు దూరమైంది. పలక, బలపం చేతబట్టకపోయినా ఇంగ్లిష్ నేర్చింది. ఐదేళ్లలోనే పెళ్లిపీఠలపై కూర్చుంది. కన్నీళ్లు.. కష్టాలే తోడునీడగా పెరిగింది. ఇక జీవితం అయిపోయిందనుకున్న తరుణంలో మై విలేజ్ షో.. గంగవ్వలోని తెలంగాణ గడుసుతనాన్ని..యాసను. భాషను ఒడిసిపట్టింది. మట్టిలోని మాణిక్యాన్ని వెలికితీసి, ప్రపంచపు నలుమూలలకు పరిచయం చేసింది. అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, ఐరోపా దేశాలతోపాటు సౌదీ అరేబియా, దుబాయ్ వంటి గల్ఫ్ దేశాల్లోని తెలుగు వారికి గంగవ్వ ఆరాధ్యదైవమైంది. ఐదేళ్ల చిన్నారుల నుంచి 60 ఏళ్ల ముదుసలి వాళ్లు సైతం గంగవ్వ అంటే తెలియని వారు లేరు. కష్టాల కడలిని దాటుకుంటూ లంబాడిపల్లి నుంచి బిగ్‌బాస్ షో వరకు వెళ్లిన బహుదూరపు బాటసారి గంగవ్వ.
గంగవ్వను గెలిపించేందుకు ఓటు
మల్యాల మండలంలోని లంబాడిపల్లికి చెందిన మిల్కూరి గంగవ్వ బిగ్‌బాస్ రియాలిటీ షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆమె నామినేషన్ కోసం వేలాదిమంది ఇతర దేశాల్లోని అభిమానులు, స్థానికులు, తెలంగాణ భాషా ప్రేమికులు ఆన్‌లైన్ ఓటు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. తెలంగాణ సంప్రదాయం..కట్టు..బొట్టు..అమాయకత్వానికి నిదర్శనంగా నిలిచిన గంగవ్వ ఫొటో వాట్సాప్ స్టేటస్‌లలో, ఫేస్‌బుక్‌లో వైరల్‌గా మారింది. గంగవ్వను గెలిపించేందుకు యూట్యూబ్ గంగవ్వ ఫాలోవర్స్ తపన పడుతున్నారు. విదేశాల్లోని తెలుగు వారుసైతం తమతోపాటు తమ కుటుంబ సభ్యులు, సన్నిహితులుసైతం ఓటు వేస్తున్నారు.
ఎనిమిదేళ్లలో లంబాడిపల్లి టు బిగ్‌బాస్..
లంబాడిపల్లికి చెందిన ఎంటెక్ విద్యార్థి శ్రీరాం శ్రీకాంత్ పల్లె సంస్కృతిని, సంప్రదాయాలను పల్లెల్లోని అనుబంధాలు, ప్రేమలు, పండుగలు ప్రపంచానికి చాటి చెప్పేందుకు 2012లో ‘మై విలేజ్ షో’ ఛానల్ ప్రారంభించాడు. ఎస్సారెస్పీ ఆయకట్టు ప్రాంతమైన లంబాడిపల్లిలోని పచ్చని పొలాలు, పండుగలను యూట్యూట్‌లో అప్‌లోడ్ చేయడం ప్రారంభించాడు. తన ఇంటి పక్కనే ఉన్న గంగవ్వతోపాటు స్థానికులతో షార్ట్ ఫిల్మŠస్‌లో నటింపజేశారు.
సుమారు 200 షార్ట్ ఫిల్మŠస్‌లో నటించింది. గంగవ్వ అమాయకత్వం..తెలంగాణ తిట్లు..భాష..యూట్యూబ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో పల్లె ప్రజల్లో ఇంటి మనిషిగా మారిపోయింది. ఇక వెనకకు తిరిగిచూడలేదు. గంగవ్వకు ఫాలోవర్స్ పెరిగిపోయారు. గంగవ్వ ఎక్కడ కనపడినా ఆమెతో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. దీంతో ఆమె సహజనమైన నటనను సినిమా దర్శకులను సైతం ఆకట్టుకుంది. పూరి జగన్నాథ్ సినిమాలో అవకాశం కల్పించారు. ఇస్మార్ట్ జోడీ వంటి టీవీ ప్రోగ్రాంలో పాల్గొని విజేతగా నిలిచింది. ఆమె ప్రతిభను గుర్తించి, రాష్ట్ర గవర్నర్ తమిళిసై నుంచి జ్ఞాపిక అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment