'దంగల్' సినిమాతో పదహారేళ్లకే ప్రేక్షకులకు దగ్గరైన నటి జైరా వసీమ్. అయితే ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రెండేళ్లకే సినిమాలకు స్వస్తి పలుకుతూ గతేడాది అభిమానులకు షాకిచ్చారు. జాతీయ అవార్డు పొందిన జైరా చివరిసారిగా ప్రియాంక చోప్రా నటించిన 'ది స్కై ఈజ్ పింక్' సినిమాలో కనిపించారు. తాజాగా ఆమె మరోసారి అభిమానులకు షాకిచ్చారు. సోషల్ మీడియాలో తన ఫొటోలు తొలగించాలన్న నటి విన్నపంతో ఆమె అభిమానుల హృదయం మరోసారి ముక్కలైంది. (చదవండి: ఒకరి బాధకు మీరు కారణం కాకండి: బాలీవుడ్ హీరోయిన్)
'అందరికీ హాయ్!! నా మీద ప్రేమాభిమానాలు కురిపించి, సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. మీరంతా నాకో సాయం చేస్తారని ఆశిస్తున్నాను. దయచేసి సోషల్ మీడియా అకౌంట్ల నుంచి నా ఫొటోలు తొలగించండి. అలాగే ఫ్యాన్ పేజీలకు కూడా ఇదే చెప్పండి. ఇంటర్నెట్ నుంచి నా ఫొటోలను తొలగించడం ఎలాగో అసాధ్యం. కాబట్టి ఇకపై నా ఫొటోలు ఏవీ షేర్ చేయకండి. అన్నింట్లో మద్దతుగా నిలిచిన మీరు ఈ విషయంలో కూడా నాకు సపోర్ట్ చేస్తారని భావిస్తున్నా. నా జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభించబోతున్నా. మీరు చేసే సాయం వల్ల నాకు ప్రయోజనం దక్కుతుంది' అని జైరా వసీం అభ్యర్థించారు. 'తన ఫొటోలను వాడొద్దన్న విషయాన్ని ఏడాదిగా ఫ్యాన్ పేజీలకు చెప్తూ వస్తున్నానని, అయినా దాన్ని పట్టించుకోనివారు మరోసారి ఈ అభ్యర్థనను ఆలకించండి' అని చెప్పుకొచ్చారు.
తరచూ వివాదాల్లో నిలిచే జైరా మే నెలలోనూ ట్రోలింగ్ బారిన పడ్డారు. మే నెలలో దేశంలోని పలు రాష్ట్రాలపై మిడతల దండు దాడి చేసింది. ఈ దాడిని సమర్థించేలా.. 'మానవ చర్యల పాపాల ఫలితమే మిడతల దాడి. వరదలు, ఇతరత్రా వాటికి కూడా మానవ చర్యల తప్పిదాలే అసలైన కారణం. ఖురాన్‌లో దీన్ని పేర్కొన్నట్లు'గా ఆమె పోస్ట్ పెట్టారు. దీంతో మతాన్ని ఉటంకిస్తూ కామెంట్లు చేయడం మీద నెటిజన్లు ఆమెను దుమ్మెత్తిపోశారు. వెరసి.. ట్రోలింగ్ బెడద తట్టుకోలేక నటి ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లను తాత్కాలికంగా డిలీజ్ చేశారు. (చదవండి: ఇప్పటికి నా భార్యకి లవ్ లెటర్స్ రాస్తాను)
Comments
Please login to add a commentAdd a comment