సాక్షిప్రతినిధి, వరంగల్: జనగామ జిల్లా స్టేషన్‌ఘనపూర్ ఎమ్మెల్యే టి.రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. వ్యక్తిగత విమర్శలు ఆరోపణలు, రాజకీయంగా దుమారం రేపుతుండగా.. గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తున్నాయి. కడియం శ్రీహరి దళితుడు కాదు.. అవినీతిపరుడు అంటూ ఎమ్మెల్యే రాజయ్య చేసిన ఆరోపణలపై కడియం కౌంటర్ ఎటాక్ చేశాడు.
కుల ప్రస్తావనతోపాటు అవినీతి ఆరోపణలు నిరూపించాలి.. లేకుంటే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కొంతకాలంగా ‘స్టేషన్’లో ఇద్దరు మాజీ ఉప ముఖ్యమంత్రుల మధ్య వైరం సాగుతున్నా.. నాలుగైదు రోజులుగా అది పరాకాష్టకు చేరింది. ఆ ఇద్దరి పోటాపోటీ ప్రెస్‌మీట్‌లు, సమావేశాలతో కార్యకర్తలు, నాయకులు సైతం నియోజకవర్గంలో రెండు గ్రూపులుగా చీలిపోయి పాల్గొంటున్నారు. ఇంత జరుగుతున్నా అధిష్టానం మాత్రం వేచిచూసే ధోరణితో ఉండటం.. మరోవైపు సీనియర్ల ద్వారా ఆరా తీస్తుండటం రాజకీయవర్గాల్లో హాట్‌టాఫిక్‌గా మారింది.
అటాక్, కౌంటర్ అటాక్..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య అటాక్.. కౌంటర్ అటాక్‌లు, మాటల వాగ్ధాటి, మాటల యుద్ధం పెరిగింది. జానకీపురం సర్పంచ్ నవ్య వేధింపుల ఆరోపణల నేపథ్యంలో కొంతకాలం మౌనంగా ఉన్న రాజయ్య నాలుగైదు రోజుల నుంచి కడియం శ్రీహరి టార్గెట్‌గా వాగ్ధాటి పెంచారు. కడియం పద్మశాలి కులంలో పుట్టి బైండ్ల కులంలో పెరిగాడని ఆయన కులంపై చర్చ జరగాలంటున్నారు రాజయ్య. బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేస్తూ దళితులు రాజకీయంగా ఎదిగితే కేసులు పెట్టి చిత్రహింసలకు గురి చేశాడని ఆరోపించారు. 14 ఏళ్లు మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో ఏ దళిత బిడ్డను ఎదగనీయలేదని విమర్శించారు.
రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్లి వర్ధన్నపేట నుంచి కావ్యకు టికెట్ ఇవ్వాలని అడుగుతున్న ఆధారాలు బయటకు వస్తున్నాయంటూ.. కొత్త ఆరోపణలను తెరమీదకు తెచ్చారు. మాదిగల జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్న రాజయ్య.. శ్రీహరి అవినీతిపై ఖల్‌నాయక్ అనే పుస్తకం ఉందని.. దాన్ని త్వరలో ప్రజల ముందు ఉంచుతానని తెలిపారు. ఎవరు ఏంటో తేల్చుకునేందుకు బహిరంగ చర్చకు రావాలని రాజయ్య సవాల్ విసిరారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే రాజయ్య విమర్శలపైన ఎమ్మెల్సీ కడియం శ్రీహరి కూడా సోమవారం కౌంటర్ ఎటాక్ చేశారు.
రాజయ్య స్థాయిని మరిచి వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని ధ్వజమెత్తిన ఆయన.. నా పుట్టుక, నా కూతురు కులాన్ని ఎమ్మెల్యే ప్రస్తావించడం మనస్తాపానికి గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు కోర్టు తీర్పుతో తాను ఎస్సీ, తల్లి బీసీ, తండ్రి ఎస్సీ అని స్పష్టం చేశారని, తల్లి సత్యం, తండ్రి అపోహ అని చేసిన కామెంట్స్‌కు, ఎన్‌కౌంటర్ సృష్టికర్త అన్నందుకు క్షమాపణ చెప్పాలని శ్రీహరి డిమాండ్ చేశారు. తాను ఎస్సీ అయితే తన కూతురు ఎస్సీ అవుతుందని, ఈ న్యాయ సూత్రాలు తెలియని రాజయ్య ఎమ్మెల్యేగా ఎలా ఉన్నావని ప్రశ్నించారు. అక్రమ ఆస్తులు ఉన్నాయని ఆరోపిస్తున్న రాజయ్య నిరూపిస్తే వాటిని నియోజకవర్గ దళితులకు పంపిణీ చేస్తానని స్పష్టం చేశారు. వారం రోజుల్లో ఆ ఆస్తుల వివరాలు తేల్చి ఆరోపణలను నిరూపించాలని డిమాండ్ చేశారు.
బీఆర్‌ఎస్ అధిష్టానం ఆరా..
బజారున పడ్డ ఎమ్మెల్సీ శ్రీహరి, ఎమ్మెల్యే రాజయ్య మధ్య రాజకీయ వైరంపై ఆ పార్టీ అధిష్టానం సీరియస్‌గా స్పందించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. మొదటి నుంచి రాజకీయ ప్రత్యర్థులైన వీరిద్దరి మధ్య కొంతకాలంగా ఆధిపత్య పోరు కొసాగుతోంది. ఎమ్మెల్యేగా తాడికొండ రాజయ్య వ్యవహరిస్తుండగా.. ఎమ్మెల్సీగా కొనసాగుతున్న కడియం శ్రీహరి కూడా స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంనే ఎంచుకున్నారు. 2019 సెప్టెంబర్‌లో వేర్వేరుగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన యాత్ర రెండు వర్గాల మధ్య విభేదాలకు ఆజ్యం పోయగా.. ఆ తర్వాత పరిణామాలు కూడా మరింత దూరం పెంచాయి.
ఎవరికీ వారుగా నియోజకవర్గంలో సభలు, సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఫ్లెక్సీలు, ప్రొటోకాల్ వివాదం.. అంటూ ఇరువర్గాల మధ్యన తరచూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అయితే 20 రోజుల వరకు కూడా పరోక్షంగా ఆరోపణలు చేసుకున్న ఇద్దరు నేతలు కాస్తా ఇటీవల దూకుడు పెంచారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో స్వరం మరింత పెంచారు. ఈ క్రమంలో ఒక దశలో అధిష్టానం సూచనలను కూడా ధిక్కరించేందుకు వెనుకాడటం లేదు. దీంతో బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు, మాజీ ఉప ముఖ్యమంత్రులు పోటీపోటీగా ప్రెస్‌మీట్‌లు ఏర్పా టు చేసి బహిరంగంగా ఆరోపణలు చేసుకోవడం దేనికి సంకేతం? అన్న చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో బీఆర్‌ఎస్ అధిష్టానం సైతం సీరియస్‌గా ఆరా తీస్తుండటంతో.. ‘స్టేషన్’లో ఏం జరుగబోతోంది? అన్న ఆసక్తి అందరిలో నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment