ఆలయం తరలిస్తారా..?
ములుగు: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ మోడల్ బస్టాండ్ పునరుద్ధరణలో భాగంగా ములుగు బస్టాండ్ ఆవరణలో ఉన్న పోచమ్మ ఆలయ తరలింపుపై పట్టణంలో ఉత్కంఠ వాతావరణం నెలకొన్నది. పోచమ్మ ఆలయాన్ని అక్కడి నుంచి కదిపితే ఉరుకునేది లేదని పట్టణవాసులు, హిందూత్వ సంఘాలు పట్టుబడుతున్నాయి.
కలెక్టర్ తీరుపై సర్వత్రా విమర్శలు
ఆర్టీసీ మోడల్ బస్టాండ్ పునరుద్ధరణకు పోచమ్మ ఆలయం అడ్డంకిగా మారిందని కలెక్టర్‌కు నివేదిక అందించినట్లు తెలుస్తుంది. ఈ విషయంలో హిందూపరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో శనివారం కలెక్టర్‌కు వినతిపత్రతం అందించి, పోచమ్మ ఆలయాన్ని తరలించకూడదని కోరారు. అయినప్పటికీ కలెర్టర్ ఈ విషయాలను పరిగణలోకి తీసుకోకుండా అందరి సమక్షంలో పోచమ్మ ఆలయానికి వేరేచోట స్థలాన్ని కేటాయిస్తామన్ని తెలిపినట్టుగా సమాచారం. దీనిపై హిందూత్వ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో స్థానికులు శనివారం ఆలయం ఎదుట జిల్లా యంత్రాంగానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. తాత, ముత్తాల నుంచి ఉన్న పోచమ్మ గుడిని తరలిస్తామంటే ఉరుకునేది లేదని తెలిపారు.
రూ.5.11 కోట్ల నిధులు మంజూరు
జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ పునరుద్ధరణ(మోడల్)కు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రూ.5.11 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఇందులో భాగంగానే ఆర్టీసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులు ప్రస్తుతం ఉన్న బస్టాండ్ ఏరియాను సర్వే చేసి డిజిటల్ మ్యాప్‌ను సిద్ధం చేశారు. మ్యాప్‌ను స్థానిక ఎమ్మెల్యే, మంత్రి డాక్టర్ ధనసరి సీతక్కకు అందజేశారు. ములుగు చుట్టుపక్కన ఉన్న జిల్లాలకు ప్రత్యేక బస్‌స్టేషన్ పాయింట్‌లతో డిజిటల్ మ్యాప్‌ను సిద్ధం చేసి అందించారు. సానుకులంగా స్పందించిన సీతక్క వెంటనే పనులను మొదలు పెట్టాలని అధికారులను ఆదేశించారు.
అందరి అభిప్రాయం మేరకే నిర్ణయం
జిల్లాకేంద్రంలోని అన్ని వర్గాల అభిప్రాయం మేరకే పోచమ్మ గుడి తరలింపుపై నిర్ణయం తీసుకుంటాం. జిల్లాకేంద్రంలో గిరిజన యూనివర్సిటీ, మెడికల్ కళాశాల, ఇతరత్రా అంశాలలో ఆయా ప్రాంతాల నుంచి వచ్చే వారి ప్రయాణ సౌకర్యాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాం. కొన్ని వర్గాలకు పోచమ్మ ఆలయం తరలింపు అడ్డంకిగా మారుతుందని తెలుస్తుంది. దీనిపై మరోసారి చర్చించి తుది నిర్ణయం తీపుకుంటాం. ఎవరినీ ఇబ్బంది పెట్టాలనే ఆలోచన మాకు లేదు.
– టీఎస్ దివాకర, కలెక్టర్
పోచమ్మ గుడి తరలింపుపై ఉత్కంఠ
తరలించొద్దంటున్న పట్టణవాసులు, హిందూత్వ సంఘాలు
Comments
Please login to add a commentAdd a comment