రామప్పలో మహాశివరాత్రి ఏర్పాట్లు
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని పాలంపేట శివారులో గల రామప్ప దేవాలయంలో ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు మూడు రోజుల పాటు మహాశివరాత్రి మహోత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రామప్ప రామలింగేశ్వరస్వామిని క్యూ పద్ధతిలో భక్తులు దర్శించుకునేందుకు ఆలయం ముందు నుంచి నందీశ్వరుని వరకు క్యూలైన్లను ఏర్పాటు చేసి చలువ పందిళ్లు వేస్తున్నట్లు ఆలయ ఈఓ శ్రీనివాస్ తెలిపారు. రామప్ప ఆలయం, గార్డెన్, రామప్ప పరిసర ప్రాంతాల్లో విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భక్తులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్సై జక్కుల సతీష్ తెలిపారు. 300మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించడమే కాకుండా ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాలకు వేర్వేరుగా పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. రామప్ప తూర్పు ముఖద్వారం రహదారికి ఇరువైపులా ఉన్న పిచ్చిమొక్కలను గ్రామపంచాయతీ సిబ్బంది శనివారం తొలగించారు. రహదారిని వాటర్ ట్యాంక్ సహాయంతో శుభ్రపరిచారు. రామప్ప గార్డెన్‌లో భక్తులు సేదతీరేలా గార్డెనింగ్ సిబ్బంది గార్డెన్‌ను అందంగా తీర్చిదిద్దారు. మహాశివరాత్రి ఉత్సవాల కోసం మూడు రోజుల ముందు నుంచే అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తు భక్తులకు వసతులు కల్పిస్తున్నారు.
పర్యాటకుల సందడి
రామప్ప దేవాలయంలో శనివారం పర్యాటకుల సందడి నెలకొంది. వీకెండ్ కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో తరలివచ్చి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు హరీశ్‌శర్మ, ఉమాశంకర్, రాజ్‌కుమార్‌లు పర్యాటకులకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. రామప్ప ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్‌కుమార్ విద్యార్థులకు వివరించారు. నందీశ్వరుడి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అదేవిధంగా రష్యాకు చెందిన వాల్ రామప్ప ఆలయాన్ని సందర్శించి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. రామప్ప శిల్పకళ సంపద బాగుందని కొనియాడారు.
రామలింగేశ్వరస్వామి దర్శనానికి క్యూలైన్లు
300 మంది పోలీసులతో బందోబస్తు
రామప్పలో మహాశివరాత్రి ఏర్పాట్లు
Comments
Please login to add a commentAdd a comment