మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యం
గోవిందరావుపేట: మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అన్నారు. మండల పరిధిలోని పస్రా, కోటగడ్డ గ్రామాలలో కోటి రూపాయలతో పలు అభివృద్ధి పనులకు మంగళవారం మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ జిల్లాను అన్ని రంగాల్లో అబివృద్ధి చేయడమే లక్ష్యమని, ఇప్పటికే ములుగు జిల్లాకు రూ.500 కోట్లకు పైగా నిధులు కేటాయించగా పనులు జరిగాయన్నారు. ములుగులో ఇప్పటికే మెడికల్ కాలేజీ, గిరిజన యూనివర్శిటీకి భూమిని కేటాయించడం, ఏటూరునాగారం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు, మల్లంపల్లి మండలం ఏర్పాటు, జిల్లా కేంద్రంలో మోడ్రన్ బస్టాండ్, ఏటూరునాగారంలో బస్‌డిపో మంజూరు చేశామని తెలిపారు. మహిళల అభ్యున్నతికి పలు రకాల కార్యక్రమాలను చేపట్టి కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకుసాగుతుందన్నారు. మహిళా గ్రూపులకు స్వయం ఉపాధియే లక్ష్యంగా, ఆర్థికాభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పాలడుగు వెంకటకృష్ణ, పన్నాల ఎల్లారెడ్డి, పీఆర్ ఈఈ అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
చదువుతోనే మార్పు
ప్రతీఒక్కరి తలరాత మార్చేది చదువేనని మంత్రి సీతక్క అన్నారు. చల్వాయి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో కలెక్టర్ దివాకర ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దిశా ఫౌండేషన్ వారి సెల్ఫ్ ఇంగ్లిష్ లర్న్ టూ రీడ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరై మాట్లాడారు. విద్యార్థులు సాంకేతిక రంగాల్లో రాణించేందుకు ఇంగ్లిష్ నేర్చుకోవాలన్నారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క
పస్రా, కోటగడ్డ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Comments
Please login to add a commentAdd a comment