పులి సంచరిస్తోందంటూ ప్రచారం
మల్హర్: అనుమానాస్పద స్థితిలో ఆవు మృత్యువాతపడిన ఘటన మండలంలోని కాపురం అటవీ ప్రాతంలోని చెరువు శివారులో చోటు చేసుకుంది. మండలంలోని తాడిచర్ల గ్రామానికి చెందిన రఘపతి ఆవు గత శనివారం మేతకు వెళ్లి ఇంటికి రాలేదు. దీంతో రఘుపతి ఆదివారం ఉదయం కాపురం అటవీ ప్రాతంలో గాలించగా.. ఆవు చనిపోయి కనిపించింది. ఆవుపై ఏదో అటవీ జంతువు దాడి చేసినట్లు గుర్తించి, ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. తాడిచర్ల ఫారెస్ట్ సెక్షన్ అధికారి లక్ష్మణ్, సిబ్బంది అక్కడికి చేరుకుని ఆవును పరిశీలించారు. ఆవు కళేబరంపై ఉన్న గాయాలను పరిశీలించారు. ఆవుపై పులి దాడి చేసిందా? లేక ఇతర అటవీ జంతువులేమైనా దాడి చేశాయా? అనే కోణంలో చుట్టు పక్కల పాదముద్రలను పరిశీలించారు. ఇప్పటి వరకు పులికు సంబందించిన పాదముద్రల కానీ.. ఇతర అటవీ జంతువు ఆనవాళ్లు కానీ కనిపించలేదని రేంజర్ రాజేశ్వర్‌రావు తెలిపారు. ఆవు మృతి చెందిన సమీపంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
జంకుతున్న ప్రజలు
అనుమానాస్పద స్థితిలో ఆవు చనిపోవడంతో కాపురం అటవీ ప్రాతంలో పులి సంచరిస్తోందని గ్రామాల్లో ప్రచారం జరగుతోంది. గత కొన్ని రోజులుగా మహదేవపూర్ మండలం గోదావరి పరివాహక ప్రాతంలో, కాటారం అడవుల్లో మగపులి సంచరిస్తోంది. పులి అటవీ ప్రాంతాల గుండా కాపురం అటవీ ప్రాతంలోకి వచ్చి ఆవుపై దాడి చేసి చంపిందని గ్రామాల్లో ప్రచారం జరగుతోంది. ఈ అటవీ ప్రాతంలో ఏర్పాటు చేసిన కన్వేయర్ మట్టి రోడ్డు గుండా తాడిచర్ల ఓపెన్‌కాస్ట్ పనులకు నిత్యం కార్మికులు, ఉద్యోగులు ప్రయాణం చేస్తున్నారు. అలాగే.. భూపాలపల్లికి వెళ్లడానికి సైతం వాహనదారులు రహదారిని వినియోగిస్తారు. పులి సంచరిస్తోందని ప్రచారం జరగడంతో రహదారిగుండా ప్రయాణించడానికి వాహనదారులు, పొలాల వద్దకు వెళ్లాడానికి రైతులు జంకుతున్నారు.
అనుమానాస్పద స్థితిలో ఆవు మృతి
ఏన్కపల్లి అడవుల్లో పెద్దపులి
కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం ఏన్కపల్లి, కిష్టారావుపేట అటవీ ప్రాంతంలో ఆదివారం పెద్ద పులి సంచరిస్తోంది. గత కొన్ని రోజులుగా మహాదేవపూర్, కాటారం అటవీ ప్రాంతంలో సంచరిస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. మహదేవపూర్ మండలం పలుగుల ప్రాంతంలో ఓ ఎద్దుపై దాడి చేసిన విషయం తెలిసిందే. శనివారం కాటారం మండలం నస్తురుపల్లి అటవీ ప్రాంతంలో ప్రత్యక్షమైంది. అక్కడి నుంచి ఆదివారం మండలంలోని ఏన్కపల్లి, కిష్టరావుపేట, అటవీ ప్రాంతంలో పులిపాదముద్రలను గుర్తించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఆప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు.
పులి సంచరిస్తోందంటూ ప్రచారం
Comments
Please login to add a commentAdd a comment