జియోట్యూబ్స్ లేనట్లే?
ఏటూరునాగారం: మండలంలోని రామన్నగూడెం నుంచి ఏటూరునాగారం గ్రామం వైపు గోదావరి వరద ముంపుకు గురికాకుండా ఉన్న కరకట్ట కోతకు గురవుతూ వస్తుంది. పదేళ్ల నుంచి కరకట్ట పటిష్ట పరచడంలో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపుతోంది. ఏజెన్సీకి కేంద్ర బిందువు అయిన రామన్నగూడెం, ఏటూరునాగారం గ్రామాల కరకట్ట గోదావరి వరదకు ప్రతీ ఏడాది కోతకు గురవుతూ వస్తోంది. అయితే దీనిపై కేంద్ర, రాష్ట్ర ఇరిగేషన్‌శాఖ అసోంలోని బ్రహ్మపుత్ర నదిపై నూతన సాంకేతిక విజ్ఞానంతో కూడిన జియోట్యూబ్స్‌ను ఏర్పాటు చేసి కరకట్ట కోతకు గురికాకుండా చేస్తుందని ప్రణాళిక రూపొందించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పరిపాలన అనుమతులు కూడా పొందారు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ శాఖ ద్వారా రూ.70 కోట్లు కూడా మంజూరు చేసింది.
సీఈ పదవీ విరమణతో..
గతంలో పనిచేసిన చీఫ్ ఇంజనీర్ గతేడాది డిసెంబర్‌లో పదవీ విరమణ పొందడంతో జియోట్యూబ్స్ నిర్మాణ పనులు మూలన పడ్డాయి. కొత్తగా వచ్చిన ఈఎన్‌సీ, అధికారులకు దీనిపై అవగాహన లేక ముందుకు పోవడం లేదు. ప్రస్తుతం గోదావరి వద్ద నీటిలో మోటార్లను ఏర్పాటు చేసి నీటిని మళ్లీస్తున్నారు. కానీ జియోట్యూబ్ నిర్మాణ పనులు మాత్రం కావడం లేదు. ఈ ఏడాది వర్షాకాలంలో గోదావరి ఉప్పొంగితే రామన్నగూడెం, ఏటూరునాగారానికి రక్షణగా ఉన్న కరకట్ట కొట్టుకుపోయి ప్రాణ, ఆస్తినష్టం జరిగేలా ఉంది. ఈ విషయాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం బాధాకరం.
షాంపిల్ అడుగుతున్నారని..
కేంద్ర డిజైనింగ్ ఆఫీస్ (సీడీఓ) అధికారులు ఏటూరునాగారంలోని కరకట్ట కోతకు గురికాకుండా ఉన్న మట్టి (అన్‌డిస్టబుల్) నమూనాలను సేకరించి పంపించాలని ఆదేశాలు ఇచ్చారు. ఇలాంటి షాంపిల్స్‌ను ఇరిగేషన్‌శాఖ అనేకమార్లు ఇచ్చిందని వాపోతున్నారు. అయినప్పటికీ మళ్లీ షాంపిల్స్ కావాలని కోరడంతో స్థానిక ఈఈ, డీఈఈలు దీనిపై దృష్టి సారించడం లేదు. ఫలితంగా షాంపిల్స్ సీడీఓకు చేరకపోవడంతో జియోట్యూబ్స్ పనులు నిలిచిపోయాయి. మళ్లీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే అన్న చందంగానే మారింది కరకట్ట పునరుద్ధరణ పనులు. దీనిపై కలెక్టర్, మంత్రులు, పాలకులు, ఉన్నతాధికారులు స్పందించి కరకట్ట పటిష్టపై దృష్టి పెట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.
కరకట్ట అన్ డిస్టెబుల్ షాంపిల్ కోరిన సీడీఓ అధికారులు
గతంలో పంపినా..మళ్లీ కోరుతున్నారని పంపించని స్థానిక అధికారులు
చీఫ్ ఇంజనీర్ పదవీ విరమణతో మూలనపడిన పునరుద్ధరణ పనులు
జియోట్యూబ్స్ లేనట్లే?
Comments
Please login to add a commentAdd a comment