సమన్వయంతో పనిచేయాలి
వెంకటాపురం(ఎం): మహాశివరాత్రిని పురస్కరించుకొని యునెస్కో గుర్తింపు పొందిన రామప్పలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ఉత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ దివాకర టీఎస్ పేర్కొన్నారు. సోమవారం మండలంలోని చారిత్రాత్మక రామప్ప ఆలయాన్ని ఆయన సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అన్ని శాఖల అధికారులతో రామప్ప గార్డెన్‌లో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఆయా శాఖల తరఫున చేపట్టిన ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మహాశివరాత్రి సందర్భంగా ఈనెల 26 నుంచి రామప్పకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడంతో పాటు పరిసరాలు శుభ్రంగా ఉండే విధంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్మికులను ఏర్పాటు చేశామన్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా మూడు రోజుల పాటు నిరంతర విద్యుత్ సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. జాగరణ చేసే భక్తుల కోసం రామప్ప పరిసర ప్రాంతాలలో ప్రత్యేక ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశామన్నారు. మూడు రోజుల పాటు సాయంత్రం ఐదు గంటల తర్వాత రామప్ప కట్టపైకి ఎవరిని అనుమతించవద్దని పోలీసు అధికారులను ఆదేశించారు. జాతరకు వచ్చే భక్తుల కోసం వాహనాల పార్కింగ్, మరుగుదొడ్ల ఏర్పాటుతోపాటు తాగునీటిని అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఉత్సవాల సందర్భంగా రామప్పలో చేపట్టిన పనులను, క్యూలైన్లలను పరీశీలించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్ రావు, ఆర్డీఓ వెంకటేష్, డీఎస్పీ రవీందర్, ఎండోమెంట్ ఈఓ శ్రీనివాస్, డీఎంహెచ్‌ఓ గోపాల్ రావు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ దివాకర
Comments
Please login to add a commentAdd a comment