ఎట్టకేలకు ఎల్‌ఆర్‌ఎస్
సాక్షిప్రతినిధి, వరంగల్/ములుగు: అనుమతి లేని లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎస్)కు ఎట్టకేలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం.. తక్షణమే అమలు చేసేలా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ మేరకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, కుడా వైస్ చైర్మన్‌లతో పాటు మున్సిపల్ కమిషనర్‌లు, జిల్లాల ఉన్నతాధికారులకు మార్గదర్శకాల ఉత్తర్వులు కూడా అందాయి. చీఫ్ సెక్రటరీ శాంతికుమారి జిల్లా కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. మార్చి నాటికి దాదాపుగా ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ పూర్తి చేయాలన్న లక్ష్యంతో అధికార యంత్రాంగం ముందుకు సాగాలని సూచించారు.
దరఖాస్తుల క్రమబద్ధీకరణకు అంతా సిద్ధం..
ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేసేందుకు అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. మొదటగా ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను వివిధ నిబంధనల ప్రకారం ఆన్‌లైన్‌లోనే వడపోసేందుకు రంగం సిద్ధం చేశారు. ఆయా ఆస్తులు నిషేధిత జాబితాలో ఉన్నాయా? దరఖాస్తుదారుడు పూర్తిస్థాయిలో పత్రాలు సమర్పించాడా? లేదా? అన్న అంశాలను పరిశీలిస్తారు. ఉమ్మడి జిల్లాలోని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు 9 మున్సిపాలిటీలు, వివిధ గ్రామాలనుంచి వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు రెవెన్యూ, నీటిపారుదల, టౌన్ ప్లానింగ్, పంచాయతీ అధికారులు కార్యాచరణ రూపొందించారు. దరఖాస్తుదారులకు సమాచారం ఇస్తూ.. ఆ ప్లాటు, స్థలం వద్దకు రమ్మని జీపీఎస్ ద్వారా పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉండగా నాలాలు, చెరువులు, కుంటలు, వారసత్వ సంపద, శిఖం, దేవాదాయ, ఇనాం భూములు వంటివి పరిశీలించి అభ్యంతరాలు ఉంటే నమోదు చేసుకుని ఉన్నతాధికారులకు రిపోర్టు చేస్తామని చెబుతున్నారు. చివరగా మరోసారి వాటిపై ఉత్తర ప్రత్యుత్తరాలు, పత్రాల పరిశీలన చేసినా అభ్యంతరాలు అలాగే ఉంటే వాటిని తిరస్కరించి సమాచారం ఇస్తామంటున్నారు. అర్హత ఉన్న దరఖాస్తులను వెంటనే పరిశీలించి కావాల్సిన పత్రాలతోపాటు ఫీజు చెల్లించేలా నోటీసు జారీ చేసి.. దరఖాస్తులు సరైనవి అయితే క్రమబద్ధీకరించి ఉత్తర్వులు జారీ చేస్తామని అధికారులు చెబుతున్నారు.
అందరికీ సమాచారం అందేలా ఏర్పాట్లు..
ఉమ్మడి వరంగల్‌లో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సహా 9 మున్సిపాలిటీలు, కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) 2020లో ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తులు స్వీకరించింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఈ కార్యక్రమం 2020 అక్టోబర్ 31 వరకు కొనసాగగా, రూ.1,000 ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించి వివరాలను నమోదు చేసుకున్నారు. మొత్తంగా 1,58,097 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 10,840 దరఖాస్తులు పరిశీలించిన అధికారులు అప్పట్లోనే కొన్నీ క్రమబద్ధీకరణ చేయగా.. 1,47,257 వివిధ స్థాయిల్లో పెండింగ్‌లో ఉన్నాయి. ఆ తర్వాత ఈ ప్రక్రియకు బ్రేక్ పడగా.. రాష్ట్ర ప్రభుత్వం తాజా ఉత్తర్వుల నేపథ్యంలో అధికార యంత్రాంగం మళ్లీ ఎల్‌ఆర్‌ఎస్ అమలుకు కదిలింది. ఈసారైనా నిబంధనల ప్రకారం చకచకా క్రమబద్ధీకరణ పూర్తి చేయాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు.
●
ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి..
రాష్ట్ర ప్రభుత్వం ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఇచ్చిన అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. మూడు అంచెలుగా సర్వే చేసి డీపీఓకు పంపించారు. అక్కడి నుంచి నా దగ్గరకు వచ్చిన తర్వాత కలెక్టర్ లాగిన్‌కు పంపుతాం. డిజిటల్ మ్యాప్ ఆధారంగా ప్రాంతాన్ని బట్టి రుసుము అనేది ఆన్‌లైన్‌లో జనరేట్ అవుతుంది. సదరు ప్లాట్ కొనుగోలు చేసిన వ్యక్తి ఫీజు చెల్లించగానే క్లియరెన్స్ అందిస్తాం.
– సంపత్‌రావు, అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు)
ప్లాట్ క్రమబద్ధీకరణకు సిద్ధంగా ఉన్నా..
ములుగు జిల్లా కేంద్రంలోని రిటైర్డ్ భవనం పక్కన 373 గజాల ప్లాట్ కొన్నాను. అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌కు ఫీజు చెల్లించి క్రమ బద్ధీకరించుకోవాలని సూచించడంతో ఆన్‌లైన్‌లో రూ.1,000 చెల్లించాను. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి, రెవెన్యూ శాఖ తరఫున సర్వే చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం క్రమబద్ధీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సంతోషకరం. ఫీజు చెల్లించి భవిష్యత్‌లో ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా చూసుకుంటా.
– పోరిక హరిసింగ్, అన్నంపల్లి
ఇక చకచకా నాన్ లే అవుట్ భూముల క్రమబద్ధీకరణ
కలెక్టర్‌లు, మున్సిపల్ కమిషనర్లు, ఉన్నతాధికారులకు మార్గదర్శకాలు
మార్చి వరకు ప్రక్రియ పూర్తి చేసేలా ఆదేశాలు
తాజా ఉత్తర్వులతో మళ్లీ కదలిక...
ఇప్పటికై నా పూర్తి చేయాలంటున్న దరఖాస్తుదారులు
ఉమ్మడి జిల్లాలో ఇలా..
మొత్తం దరఖాస్తులు
1,58,097
పరిశీలించి ఆమోదించినవి
10,840
వివిధ స్థాయిల్లో పెండింగ్
1,47,257
ఎట్టకేలకు ఎల్‌ఆర్‌ఎస్
ఎట్టకేలకు ఎల్‌ఆర్‌ఎస్
Comments
Please login to add a commentAdd a comment