అడవిలో మంటలార్పిన అటవీశాఖ సిబ్బంది
వాజేడు: అడవిలో మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన అటవీశాఖ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. మండల పరిధిలోని దూలాపురం గుట్టలపై మంగళవారం మంటలు చెలరేగినట్లు ఫైర్ పాయింట్స్ ఆధారంగా అటవీశాఖ సిబ్బంది గుర్తించారు. ఈ మేరకు దూలాపురం రేంజికి చెందిన సిబ్బంది హతిరాం, ఆదిలక్ష్మి, ఫైర్ వాచర్స్ 5కిలో మీటర్ల మేర కాలినడకన గుట్టపైకి వెళ్లి అక్కడ అడవిలో మంటలు కనిపించడంతో ఆర్పారు.
విద్యుత్ ఉద్యోగులకు సేఫ్టీ కిట్ల అందజేత
వెంకటాపురం(కె)/వాజేడు: మండల కేంద్రంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌లో మంగళవారం విద్యుత్ ఉద్యోగులకు సేఫ్టీ కిట్లను ములుగు డీఈ నాగేశ్వరావు, ఏడీఈ అకిటి స్వామి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమ్మర్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా నిరంతర విద్యుత్ అందిచాలనే లక్ష్యంతో ఉద్యోగులకు సేఫ్టి కిట్లు, జాకెట్లు, టార్చిలైట్లు, టూల్స్ తో పాటు తదితర వస్తువులను అందజేసినట్లు వారు వివరించారు. అదే విధంగా వాజేడు మండల కేంద్రంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ ఆవరణలో సిబ్బందికి ములుగు డీఈ నాగేశ్వరావు, ఏడీఈ అకిటి స్వామి, ఏఈ అర్షద్ అహ్మద్ సేఫ్టీ కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఈఈ హనుమాన్ దాస్, విద్యుత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మామిడి తోట దగ్ధం
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మండల పరిధిలోని ఒడ్డుగూడెంలో ఓ గిరిజన రైతు మామిడి తోట దగ్ధమైంది. ఈ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే..మాతోట కార్యక్రమంలో భాగంగా నాబార్డు ఆర్థిక సాయంతో ఒడ్డుగూడెం గ్రామానికి చెందిన చెల చిన్న ఎర్రయ్య 2021లో ఐదు ఎకరాల్లో మామిడి మొక్కలను నాటారు. ఎకరానికి 70మొక్కల చొప్పున 350 నాటి కుటుంబ సభ్యులంతా కష్టపడి పెంచారు. ఈ క్రమంలో సోమవారం మామిడి తోటకు నిప్పంటుకుని దగ్ధమైందని బాధిత రైతు మంగళవారం తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది గుర్తు తెలియని వ్యక్తులు చేసిన పనా లేక మామిడి తోట ప్రమాదవశాత్తు దగ్ధమైందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనలో మామిడి తోటతో పాటు సోలార్ పెన్సింగ్, 300 మీటర్ల పైపులతో పాటు గుడిసె కూడా కాలిపోయిందని బాధితుడు వాపోయాడు.
జాబితాను అధికారులకు అందించాలి
వెంకటాపురం(కె):మొక్కజొన్న సాగు చేసి నష్టపోయిన రైతుల జాబితాను మొక్కజొన్న డీలర్లు అధికారులకు అందించాలని ములుగు ఆర్డీఓ వెంకటేశ్ అన్నారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో బాండ్ మొక్కజొన్న ఆర్గనైజర్స్, వ్యవసాయ శాఖ అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ మొక్కజొన్న కంపెనీ ఆర్గనైజర్స్ దగ్గర ఉన్న రైతుల జాబితాను అధికారులకు అందజేయాలన్నారు. జాబితా ఆధారంగా గ్రామాల వారీగా ఏఈవోలు సందర్శించి రైతులను వ్యక్తిగతంగా కలిసి వారి వద్ద నుంచి వివరాలను తీసుకుంటారని తెలిపారు. ఎవరైనా రైతులు కంపెనీ, ఆర్గనైజర్ ద్వారా నష్టపోతే నష్టాన్ని అంచనా వేసి వారికి పరిహారం చెల్లించాలని కంపెనీ ఆర్గనైజర్లను ఆదేశించారు. భవిష్యత్‌లో ఎటువంటి లిఖిత పూర్వక ఒప్పందాలు లేకుండా కంపెనీలు పంట సాగు చేయిస్తే ఆ కంపెనీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కంపెనీ ఆర్గనైజర్లతో రైతులు ఇబ్బందులు పడుతుంటే తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మిరాజయ్య, డీఏఓ సురేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అడవిలో మంటలార్పిన అటవీశాఖ సిబ్బంది
అడవిలో మంటలార్పిన అటవీశాఖ సిబ్బంది
Comments
Please login to add a commentAdd a comment