రామప్ప శిల్పకళ అద్భుతం
వెంకటాపురం(ఎం): రామప్ప దేవాలయం శిల్పకళ అద్భుతంగా ఉందని అమెరికా కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ కొనియాడారు. రామప్ప దేవాలయాన్ని ఆమె గురువారం సందర్శించారు. ములుగు ఆర్డీఓ వెంకటేశ్, జిల్లా టూరిజం అధికారి శివాజీ ఆమెకు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు హరీశ్ శర్మ, ఉమాశంకర్‌లు పూర్ణకుంభంతో ఆలయంలోకి ఆహ్వానించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి ఆమె పూజలు నిర్వహించగా అర్చకులు స్వామివారి శేషవస్త్రాలు అందించి శాలువాతో సత్కరించారు. రామప్ప ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్‌కుమార్ వివరించగా టెంపులు బాగుందని కొనియాడారు. రామప్ప ఆలయ నిర్మాణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆలయ గోపురానికి వినియోగించిన నీటిలో తేలాడే ఇటుకలను స్వయంగా పరిశీలించి ఆశ్చర్యానికి గురయ్యారు. ఆమె వెంట ములుగు డీఎస్పీ రవీందర్, తహసీల్దార్ గిరిబాబు, ఎస్సై జక్కుల సతీష్, కేంద్ర పురావస్తుశాఖ అధికారులు పాల్గొన్నారు.
విద్యార్థులతో ప్రత్యేక సమావేశం
ఎస్‌ఎస్ తాడ్వాయి: మండల పరిధిలోని కాటాపూర్ గ్రామానికి చెందిన ఎన్నారై పులి రవిగౌడ్ ఆధ్వర్యంలో కాటాపూర్ జెడ్పీ పాఠశాలకు చెందిన 30మంది విద్యార్థులను రామప్పకు తీసుకెళ్లి అమెరికా కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులతో లార్సన్ మాట్లాడుతూ విద్యార్థులు ఆడుడుపాడుతూ ఆనందంగా విద్యను అభ్యసించాలన్నారు. ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు వింటూ ప్రణాళికతో చదువుకుని ఉన్నతస్థాయికి చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాటాపూర్ మాజీ సర్పంచ్ పులి నర్సయ్య, ఉపాధ్యాయులు శ్రీదేవి, చక్రునాయక్, విద్యార్థులు పాల్గొన్నారు.
అమెరికా కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్
Comments
Please login to add a commentAdd a comment